టైటిల్: భగవంత్ కేసరి
నటీనటులు: బాలకృష్ణ, శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్ తదితరులు
నిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్ బ్యానర్
నిర్మాత: హరీశ్ పెద్ది, సాహు గారపాటి
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు
విడుదల తేది: అక్టోబర్ 19, 2023
‘భగవంత్ కేసరి’ కథేంటంటే..
నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీగా ఉంటాడు. అక్కడికి కొత్తగా వచ్చిన జైలర్ శ్రీకాంత్(శరత్ కుమార్).. భగవంత్ కేసరి గురించి తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. భగవంత్ కేసరికి సహాయం చేసిన కారణంగా శ్రీకాంత్ సస్పెండ్ అవుతాడు. వెళ్లే ముందు సత్ప్రవర్తన కారణంగా రిలీజ్ చేసే ఖైదీల లిస్ట్‌లో భగవంత్ కేసరి పేరు చేర్చుతాడు.
దీంతో భగవంత్ జైలు నుంచి విడుదల అవుతాడు. బయటకు రాగానే జైలర్ శ్రీకాంత్ ఇంటికి వెళ్తాడు. అదే రోజు శ్రీకాంత్ రోడ్డు యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. దీంతో అతని కూతురు విజ్జి పాప(శ్రీలీల) బాధ్యతను భగవంత్ కేసరి తీసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు విజ్జి పాపను ఇండియన్ ఆర్మీలో చేర్పించాలనుకుంటాడు.
మరోపక్క వ్యాపారవేత్త రాహుల్ సంఘ్వీ(అర్జున్ రాంపాల్) ప్రభుత్వాన్ని బెదిరించి ప్రాజెక్ట్ V ని దక్కించుకోవాలనుకుంటాడు. దానికి అడ్డుగా వచ్చిన ఉప ముఖ్యమంత్రి(శుభలేఖ సుధాకర్)ని హత్య చేసి.. అతని పీఏ దగ్గర ఉన్న ఆధారాల కోసం వెతుకుతుంటాడు. ఓ కారణంగా విజ్జి పాపను చంపేందుకు సంఘ్వీ మనుషులు ప్రయత్నిస్తారు. అప్పుడు భగవంత్ కేసరి ఏం చేశాడు? అసలు భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? ఆదిలాబాద్ ఊచకోత కేసు నేపథ్యం ఏంటి? రాహుల్ సింఘ్వీకి, కేసరికి మధ్య ఉన్న పాత వైరం ఏంటి? చివరకు విజ్జి పాప ఆర్మీలో చేరిందా? లేదా? అదేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘భగవంత్ కేసరి’ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కామెడీ చిత్రాలను కమర్షియల్ పద్దతిలో తెరకెక్కించి హిట్ సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. కచ్చితంగా కామెడీ ఆశిస్తాం. మరోవైపు బాలయ్య సినిమా అంటే పంచ్ డైలాగ్స్, ఊరమాస్ ఫైట్స్ మస్ట్. కానీ తొలిసారి వీరిద్దరు తమ బలాలను వదిలి చేసిన ప్రయోగమే ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే బాలయ్యను కొత్తగా చూడబోతున్నారని చెప్పాడు అనిల్ రావిపూడి. అన్నట్లుగానే బాలయ్యను తెరపై కొత్తగా చూపించాడు. అయితే కథ-కథనం విషయంలో మాత్రం కొత్తదనం లేదు.
హీరో తన సొంతూరిని వదిలి దూరంగా బతకడం..దాని వెనుక విలన్ కారణంగా ఉండడం..ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ.. క్లైమాక్స్‌లో హీరో మళ్లీ వచ్చి విలన్‌ని చంపడం... ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. ‘భగవంత్ కేసరి’ కథ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ట్రీట్‌మెంట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. దానికి కారణం బాలయ్య, శ్రీలీల అనే చెప్పాలి. తెరపై ఇంతవరకు వారిద్దరిని అలాంటి పాత్రల్లో చూడలేదు. అమ్మాయిలను సింహం లెక్క పెంచాలి అని చెబుతూ.. వారినికి కేవలం వంటింటికే పరిమితం చేయొద్దనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు.
ఆపదలో ఉన్న ముంబై కోర్టు న్యాయమూర్తి ఫ్యామిలీకి ఓ వ్యక్తి ‘భగవంత్ కేసరి’ కథ చెప్పే సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రధాన పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ భారీ ఫైట్ సీన్‌తో హీరో ఇంట్రడక్షన్.. ఆ తర్వాత జైలర్ శ్రీకాంత్.. భగవంత్ కేసరిని కలవడం.. అతని కూతురు విజ్జికి భగవంత్‌తో మంచి బాండింగ్ ఏర్పడటం చూపించారు.
అయితే ఇదంతా సాగదీతగా, రొటీన్‌గా అనిపిస్తాయి. జైలర్ శ్రీకాంత్ చనిపోయిన తర్వాత కథ కాస్త ఎమోషనల్‌గా టర్న్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే ‘ఉయ్యాలో ఉయ్యాల..’ సాంగ్ ఆడియన్స్‌కి రిలీఫ్ ఇస్తుంది. విలన్ మనుషులు విజ్జి పాప వెనుక పడడానికి గల కారణాన్ని కన్విన్సింగ్‌గా చూపించారు. అక్కడి నుంచి కథలో వేగం పెంచుకుంటుంది.
ఫస్టాఫ్ స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అనిల్ రావిపూడి కామెడీ టచ్‌తో బస్‌లో బాలయ్య చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే స్కూల్‌లో బాలయ్య ఇచ్చే స్పీచ్ సందేశాత్మకంగా ఉంటుంది. విలన్ ఇంటికి వెళ్లి హీరో వార్నింగ్ ఇచ్చే సీన్ సినిమాటిక్‌గా అనిపించినా.. అక్కడ హీరో బాలయ్య కాబట్టి పర్వాలేదనిపిస్తుంది. హెలికాఫ్టర్లతో జాన్ విజయ్ వచ్చి కేసరికి సహాయం చేసే ఎపిసోడ్స్.. క్లైమాక్స్‌లో శ్రీలీల చేసే యాక్షన్ సీన్ థ్రిలింగ్‌గా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడు. పెప్పర్ అండ్ సాల్ట్ లుక్‌లో తెరపై కొత్తగా కనిపించాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ తర్వాత బాగా పండిన పాత్ర శ్రీలీలది. విజ్జి పాప పాత్రలో ఆమె ఒదిగిపోయింది.
తెరపై సరికొత్త శ్రీలీలను చూస్తాం. ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్స్ సన్నివేశంలో కూడా అదరగొట్టేసింది. కాజల్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆమె పాత్రను పెట్టినట్లుగా అనిపిస్తుంది. అర్జున్ రాంపాల్ విలనిజం అంతగా పండలేదు. శరత్ కుమార్, ఆడుకాలం నరేన్, వీటీవీ నగేష్, మురళీధర్ గౌడ్, రఘుబాబు, జయచిత్ర, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment