ఈ వేసవి అంతా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సరైన సినిమా పడలేదు. అలాంటిది ఈ వారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అందరి దృష్టి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పైనే ఉంది. కానీ యూవీ క్రియేషన్స్ తీసిన 'భజే వాయువేగం' కూడా ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)
కథేంటి?
వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. అనాథగా మారిన ఇతడిని, తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్)లానే వెంకట్‌ని కూడా పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ.. ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు. అందులో గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు. దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? వెంకట్ తాను అనుకున్నది సాధించాడా? లేదా? ఇతడితో డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి సంబంధమేంటి? అనేదే మెయిన్ స్టోరీ.
ఎలా ఉందంటే?
'భజే వాయు వేగం' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్‌లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఊహించని విధంగా కెరీర్, వ్యక్తిగత, రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కుని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ. ఓవరాల్‌గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథ పరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే బాగుంది. పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్‌కి తగ్గ న్యాయం చేశాయి.
ఫస్టాప్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్‌లో హీరో అరెస్ట్ అయి ఉండే సీన్‌తో మూవీ మొదలైంది. ఆ తర్వాత ఏడాది వెనక్కి వెళ్లి.. హీరో గతమేంటి? అతడి చుట్టూ ఉండే వాతావరణం ఏంటనేది చూపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్ అంతా ఉపయోగించుకున్నారు. కానీ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ పరమ రొటీన్‌గా అనిపించింది. రెండు పాటలు ఓకే గానీ హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు. ఓ మాదిరిగా వెళ్తున్న మూవీ కాస్త ఇంటర్వెల్ వచ్చేసరికి ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి చివరివరకు చాలా బాగా తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో ముగించారు. అది కాస్త అసంతృప్తిగా అనిపించింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ఎవరెలా చేశారు?
'ఆర్ఎక్స్ 100'తో చాలా ఫేమ్ తెచ్చుకున్న కార్తికేయ.. ఆ తర్వాత మాత్రం సరైన హిట్ పడక ఎదురుచూపులు చూస్తున్నాడు. 'భజే వాయువేగం' అతడికి హిట్ ఇచ్చినట్లే! బాధ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు. హీరోయిన్ ఐశ్వర్య మేనన్ యాక్టింగ్ చేసేంత స్కోప్ ఈ మూవీలో దక్కలేదు. కాకపోతే ఈమె పాత్రని కూడా కథలో భాగం చేయడం కొంత ఉపశమనం. ఇక హీరోతో పాటు సరిసమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైనస్.. న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. విలన్‌గా చేసిన రవిశంకర్ యధావిధిగా అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ ఉన్నప్పటికీ ఆయన తగ్గ సీన్స్ పడలేదు. మిగిలిన పాత్రధారులు ఓకే.
టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు. తొలి మూవీనే కమర్షియల్‌గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'భజే వాయువేగం'.. మరీ సూపర్‌గా కాకపోయినా మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment