Bharti Singh: ఇండస్ట్రీలో అన్ని రకాల వ్యక్తులూ ఉంటారని, కొంతమంది ప్రతిదానికి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తుంటారని కమెడియన్ భారతీ సింగ్ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తన తల్లి ఎన్నో క్లిష్ట పరిస్థితులను చవిచూసిందని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ బుల్లితెర షోకు హాజరైన భారతీ తన తల్లి ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడింది.
'కొన్ని ఈవెంట్ల నిర్వాహకులు నీచంగా ప్రవర్తిస్తుంటారు. చేతులతో ఎక్కడెకక్కడో తాకడానికి ప్రయత్నిస్తుంటారు. అది నాకస్సలు నచ్చేది కాదు, కానీ నేనే అనవసరంగా తప్పుగా అనుకుంటున్నానేమోనని నన్ను నేను సముదాయించుకునేదాన్ని. అయితే ఇదంతా నా చిన్నతనంలో జరిగింది. కానీ ఇప్పుడు దానికోసం ఆలోచిస్తే అది ముమ్మాటికీ తప్పే అనిపిస్తోంది. అలాంటివారితో ఫైట్ చేయాలనుంది. అసలేమనుకుంటున్నారు? ఏంటి, ఎక్కడ చూస్తున్నారు? మీ పిచ్చి చేష్టలను మేం చూస్తూ ఊరుకోం, ఇక్కడినుంచి వెళ్లిపోండి అని గట్టిగా చెప్పాలనుంది. ఇప్పుడు ఈ మాటలను నిర్మొహమాటంగా అనగలను, కానీ నా బాల్యంలో నాకంత ధైర్యం లేకపోయింది.
ఇది నా చిన్నతనంలో జరిగిన సంఘటన. అప్పుడు మా అమ్మకు 24 ఏళ్లు. మాకు అప్పిచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి అమ్మ చేయి పట్టుకునేవారు, కొందరైతే ఆమె భుజం మీద చేయేసి మాట్లాడేవారు. నాకు భర్త లేడు, చిన్న పిల్లలున్నారు, మీకు సిగ్గుగా అనిపించడం లేదా? నాతో ఇలా నీచంగా ప్రవర్తిస్తారా? అని అమ్మ వాళ్లను తిరిగి ప్రశ్నించేది. వాళ్లు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని నాకప్పుడు అర్థం కాలేదు' అంటూ ఎమోషనల్ అయింది భారతీ సింగ్. కాగా ఆమె కపిల్ శర్మ కామెడీ షోతో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment