Bigg Boss 5 Telugu Winner VJ Sunny: బిగ్‌బాస్ షో మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ బుట్టలో వేసుకున్నాడు సన్నీ. దోస్తానాకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే అతడు ప్రేమొస్తే అందరివాడిలా కోపమొస్తే అర్జున్‌రెడ్డిలా మారిపోయేవాడు. కానీ హోస్ట్ నాగార్జున పెట్టిన చీవాట్లతో తనను తాను సరిచేసుకున్నాడు. నాగ్‌కు ఇచ్చిన మాట మేరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరో కొత్త సన్నీని చూపించాడు.
ఇక రియాలిటీ షోలో ప్రధానంగా కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. మొదటి రోజు నుంచి 106వ రోజు వరకు వినోదాన్ని పంచడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హోటల్ టాస్క్‌ను వన్ మ్యాన్ షోలా నడిపించాడు. లోబో వెళ్లిపోయాక తనే ఎంటర్‌టైనర్‌గా మారి అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ప్రేక్షకులను సైతం కడుపుబ్బా నవ్వించాడు. తన పంచ్‌లకు, ఎక్స్‌ప్రెషన్స్‌కు, కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. నవ్వడం ఒక భోగమైతే నవ్వించడం ఒక యోగం.. అందరినీ నవ్వించే శక్తి సన్నీలో ఉంది. ఇదే అతడిని గెలుపు తీరాలకు చేర్చిందంటారు ఆయన ఫ్యాన్స్.
టాస్కుల్లో విజృంభించి ఆడే సన్నీ మొదట్లో అందరి మాటలను తేలికగా నమ్మేసేవాడు. ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాడు. కానీ రానురానూ ఎవరేంటో తెలుసుకుని గేమ్‌ను తన స్టైల్‌లో ఆడటం మొదలు పెట్టాడు. ఎవరితో గొడవపెట్టుకున్నా వెంటనే దాన్ని పరిష్కరించుకుని కలిసిపోవాలనుకోవడం అతడిలోని మంచితనానికి దర్పణం పట్టాయి. పైగా సిరి, ప్రియలతో జరిగిన గొడవల వల్ల ప్రేక్షకుల్లో నెగెటివిటీకి బదులుగా అతడిపై సానుభూతి పెరగడం విశేషం.
అయితే సన్నీలో కూడా కొన్ని మైనస్‌లు ఉన్నాయి. ఏ టాస్క్ అయినా తనే గెలవాలనుకునేవాడు. గెలవాలనుకోవడంలో తప్పులేదు కానీ ఇతరులు గెలిస్తే వాళ్లేదో తొండి ఆట ఆడారని, నిజానికి తాను గెలవాల్సిందంటూ పంచాయితీ పెట్టుకునేవాడు. ఓటమిని అంత ఈజీగా స్వీకరించకపోయేవాడు. కోపంలో ఎదుటివ్యక్తిని ఇమిటేట్ చేసేవాడు. ఆవేశంలో నోరు జారేవాడు. కానీ తనకున్న ఎన్నో ప్లస్‌ల ముందు ఈ మైనస్‌లు కొట్టుకుపోయాయి. సన్నీ మచ్చా మనవాడన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అదే అతడిని విన్నర్‌గా నిలబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment