బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు వారి రహస్యాల గుట్టును బయటపెట్టగా లేఖలు అందుకుని ఎమోషనల్ అయ్యారు. అయితే ఇద్దరికి మాత్రం అఖిల్ లేఖలు పంపలేదు. వాళ్లకు లెటర్స్ ఎందుకు పంపలేదు? కంటెస్టెంట్లు ఏయే సీక్రెట్‌లను వెల్లడించారో చదివేయండి..బిగ్‌బాస్ లైఫ్ చూపిస్తుంది అని అఖిల్‌కు బోధపడింది. మరోవైపు అఖిల్ గురించి అభిజిత్ అతడి స్నేహితులతో మాట్లాడాడు. మళ్లీ లోపలికి పంపిస్తారన్న నమ్మకంతోనే కదా.. అందరూ అతడి పేరు చెప్పగానే ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు అని చెప్పుకొచ్చాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ ఈ మాటలను పూర్తిగా వ్యతిరేకించాడు. అయితే ఇదంతా ఏదో స్క్రిప్టెడ్ అని అభికి లోపల బలమైన అనుమానమే ఉంది. ఇక మటన్ చెడిపోవడంతో రేషన్ మేనేజర్ అవినాష్ మీద అందరూ గరమయ్యారు. దీంతో ఒక్క కిలో మటన్ పంపమని అతడు కెమెరాల ముందు వేడుకున్నాడు. అయినా సరే శాంతించని సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్‌ను చితకబాదారు. అతడిని స్విమ్మింగ్ పూల్‌లో నిమజ్జనం చేశారు.
లాఠీలతో కొట్టి స్టేషన్‌లో వేశారు: మెహబూబ్
అనంతరం ఇంటిసభ్యుల కోసం వారి ఆప్తులు లేఖలు పంపించారు. వాటిని హౌస్‌మేట్స్‌కు ఇవ్వాలా? వద్దా? అనేది అఖిల్ నిర్ణయానికి వదిలేశారు. మరోవైపు హౌస్‌లో ఉన్న ఇంటిసభ్యులు ఇప్పటికీ ఎవరితోనూ పంచుకోని అతిపెద్ద రహస్యాన్ని చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అప్పుడే వారికి లేఖలు అందుతాయని స్పష్టం చేశాడు. మొదట కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన మెహబూబ్ మాట్లాడుతూ.. "నా బెస్ట్ ఫ్రెండ్‌ను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాను. ఆమె కోసం టికెట్ తీసుకోడానికి లోపలకు వెళ్లాను. అయితే హడావుడిలో రాంగ్ ప్లేస్‌లో బండి పార్క్ చేశాను. దీంతో అక్కడ పోలీసులు ఆమ్మాయిని అనుమానిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేను వెళ్లేసరికి ఆమె ఏడుస్తుండటంతో పోలీసుల మీదకు తిరగబడ్డాను. అప్పుడు వాళ్లు నా కాలర్ పట్టుకుని లాఠీలతో కొట్టారు. నన్ను, అమ్మాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అమ్మాయిని వెంటనే వదిలేశారు. కానీ నన్ను మాత్రం రెండు రోజుల వరకు పోలీస్ స్టేషన్ నుంచి పంపించలేదు" అని చెప్పుకొచ్చాడు. దీంతో అఖిల్ అతడికి లేఖ పంపించాడు.
అవమానాలను గెలుపుగా మార్చుకున్న దేత్తడి
హారిక మాట్లాడుతూ.. "అమ్మ దగ్గర దాచిన ఏకైక రహస్యం ఇది. ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్తున్నా. హారికను చూసి నేర్చుకోండి. లవ్వుల జోలికే వెళ్లదు అని నన్ను ఆదర్శంగా తీసుకోమని అందరికీ చెప్పేదానివి. సారీ అమ్మా.. నాలుగన్నరేళ్లు ఓ అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నాను. ఇది రెండేళ్ల క్రితం ముచ్చట. ఎక్కువ కేరింగ్ చూపించేసరికి అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు బ్రేకప్ అయింది" అని చెప్పుకొచ్చింది. దీంతో హారికకు కూడా లేఖ అందింది. అవమానాలను గెలుపుగా మార్చుకున్నావు తల్లీ అంటూ ఆమె అన్నయ్య రాసిన ఒక్కో వాక్యం చదువుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. (ఇప్పటికిప్పుడు హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు)
సినిమా ఛాన్స్ అనగానే రూ.80 వేలు ఇచ్చాను
అవినాష్ మాట్లాడుతూ.. "సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే కిరాణ షాపులో, తర్వాత ఓ కంపెనీలో ఆఫీసు బాయ్‌గా పని చేశాను. ఓసారి ఆడిషన్ కోసం మణికొండ వెళ్లాను. రూ.80 వేలు ఇస్తే లీడ్ క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు. సినిమా పిచ్చితో నేను మా నాన్నను అడిగితే ఆయన అప్పు చేసి మరీ తెచ్చారు. దాన్ని తీసుకెళ్లి నిర్మాత చేతిలో పెట్టాను. నువ్విక్కడే ఉండు, రెండు రోజుల్లో ఖమ్మం షూటింగ్ వెళ్తున్నాం అని చెప్పి జంప్ అయ్యారు. మొదటిసారి అలా మోసపోయాను. ఇప్పటికీ ఇది మా తల్లిదండ్రులకు తెలీదు" అని చెప్పాడు. అయితే ఈ విషయం తనతో చెప్పాడని అఖిల్ అతడి లేఖను చించేశాడు. కానీ అవినాష్ మాత్రం చించిన లేఖ ముక్కలను ఒకచోట చేర్చి చదివే ప్రయత్నం చేశాడు. (జబర్దస్త్‌లోకి మళ్లీ తీసుకుంటారు: అవినాష్ తమ్ముళ్లు)
నా భర్త నాకంటే ఓ ఏడాది చిన్న: లాస్య
లాస్య మాట్లాడుతూ.. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లయింది. నేను పెళ్లాడిన వ్యక్తి పేదవాడు, నాకన్నా ఒక ఏడాది చిన్న. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఈ షోకు వచ్చాక అమ్మకు షాకుల మీద షాకులిస్తున్నా. వయసు చిన్నదే అయినా మనసు గొప్పది" అని లాస్య కన్నీళ్లతో చెప్పుకొచ్చింది. ఆమెకు లేఖ అందగా దాన్ని చదువుకుంటూ మరోసారి కంటతడి పెట్టుకుంది. అభిజిత్ మాట్లాడుతూ.. "మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌లో ఓ రెస్టారెంటుకు వెళ్లాను. ఆర్డర్ ఇచ్చాను. అక్కడున్న ఓ వ్యక్తి నీకోసం నేను డ్రింక్ తీసుకోవచ్చా అని అడిగాడు. ఇదేదో బాగుందని సరే అన్నాను. ఇద్దరం ఒకరి గురించి ఒకరం మాట్లాడుకున్నాం. నెంబర్ అడిగాడు. అనుమానపడుతూనే ఇచ్చాను. ఆ తర్వాత అతడు మీదమీదకొస్తుంటే ఏం చేస్తున్నావు అని అడిగితే ఇది గే బార్ అని చెప్పాడు. అప్పుడు నేను బయటకు వెళ్లి బోర్డు చదివాను" అని సీక్రెట్‌ను వెల్లడించాడు. అఖికి అందిన లేఖ చదవడం పూర్తవగానే హారిక వెళ్లి అతడికి హగ్గిచ్చింది.
అర్ధరాత్రి కారు యాక్సిడెంట్..
అరియానా మాట్లాడుతూ.. "ఈ జూలై 13కు నాతో పాటు నలుగురు చనిపోయి ఒక సంవత్సరం అయ్యేది. మా ఊరుకు వెళ్దాం అని అర్ధరాత్రి కారులో బయలుదేరాం.. ఒక మనిషి బైకు మీద అడ్డు వచ్చాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక కిలోమీటర్ వరకు కారు దూసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్‌ను గుద్దింది. కారు నుజ్జయ్యింది. బయటకు వస్తే వైరులు తగిలి షాక్ కొట్టేది. ఆ ప్రమాదం నుంచి బయట పడకుండే ఈ రోజు నేనిక్కడ ఉండేదాన్నే కాదు" అని ఎమోషనల్ అయింది. ఇది సీక్రెట్ కాదని అఖిల్ ఆమె లెటర్ చించేశాడు. (మొదటి బిడ్డను చంపుకున్నా: లాస్య కన్నీళ్లు)
కుటుంబం కోసం చదువు త్యాగం చేశా: మోనాల్
మోనాల్ మాట్లాడుతూ.. "పన్నెండో తరగతి పూర్తయ్యాక నాకు బ్యాంక్‌లో జాబ్ వచ్చింది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ చదవాలనుకున్నాను. కానీ కాలేజీ టైమింగ్, జాబ్ టైమింగ్ సెట్ కాలేదు. దీంతో ఫైనలియర్ డ్రాప్ అవుట్ అయ్యాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం చదువు త్యాగం చేశాను. ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు" అని ఏడ్చేసింది. దీంతో అఖిల్ ఆమెకు లేఖ పంపించాడు. అది చదువుతున్న మోనాల్ కన్నీటిని సోహైల్ తుడుస్తూ దగ్గరకు తీసుకున్నాడు. (బిగ్‌బాస్: సోహైల్‌కు గట్టి షాక్ ఇచ్చిన మెహబూబ్)
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 102 రీడింగ్ వచ్చింది: సోహైల్
సోహైల్ మాట్లాడుతూ.. "ఇప్పుడు మందు మానేశాను. కానీ కొన్నేళ్ల క్రితం ఓసారి పబ్బు నుంచి తాగొస్తున్నా. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 102 రీడింగ్ వచ్చింది. కారు తీసుకుపోయారు. తర్వాతి రోజు స్టేషన్‌కు వెళ్లి చలానా కట్టిన. అప్పుడు కోర్టు స్లాట్ తీసుకోమన్నారు. తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. డూప్లికేట్ పేరెంట్స్‌ను మాట్లాడిన. కానీ మా ఫ్రెండ్ అట్లా నడవదని చెప్పిండు. కోర్టుకు వెళ్లాక ప్రతి ఒక్కడూ పదో తరగతి రిజల్ట్ వచ్చినట్టు నీ రీడింగ్ ఎంత అని అడుగుతూనే ఉన్నారు. ఆఖరికి మా తమ్ముడిని పిలిపించిన. ఇది అమ్మావాళ్లకు తెల్వదు" అని సీక్రెట్ బయటపెట్టాడు.
బిగ్‌బాస్‌ను అర్థిస్తున్న అఖిల్
మా తమ్ముడు ఈ రహస్యం నాకు కూడా చెప్పలేదని అఖిల్ అతడికి లేఖను అందించాడు. అందులో మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, అఖిల్, మెహబూబ్ నిన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పినప్పుడు సంతోషంగా అనిపించింది అని అతని తండ్రి రాసుకొచ్చాడు. లేఖను చదివి సోహైల్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. అఖిల్ గుర్తొచ్చి బాధపడ్డాడు. మరోవైపు అఖిల్ తనకు లెటర్ కావాలని బిగ్‌బాస్‌ను ప్రాధేయపడుతున్నాడు. మరి అతనికి లేఖ అందిందా? లేదా? అనేది రేపు తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment