అసలే నామినేషన్ ప్రక్రియతో మంట మీదున్న కంటెస్టెంట్లు నేటి టాస్క్‌లో తమ సత్తా ఏంటో చూపించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఫిజికల్ టాస్క్ గొడవలకు దారి తీసింది. దేవీ, మెహబూబ్ మధ్య మాటామాటా పెరగడంతో ఇంటి సభ్యులు కల్పించుకుని సర్ది చెప్పాల్సి వచ్చింది. ఫిజికల్ టాస్క్ ఆడగలుగుతుందా అన్న అనుమానాన్ని గంగవ్వ పటాపంచలు చేసింది. రోబో వేషం కట్టిన అవ్వ ప్రత్యర్థులను దగ్గరికి కూడా రానీయలేదు. ఇక తెలుగు మాట్లాడటమే కష్టంగా ఉండే మోనాల్ ఏకంగా తెలుగు పద్యాలను అప్పజెప్పింది. ఇన్ని విశేషాలు చోటు చేసుకున్న నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ పూర్తి వివరాలు చదివేసేయండి..
కెప్టెన్సీ పోటీకి ఈ టాస్కే కీలకం
మోనాల్ ఇంటి సభ్యులకు బావా బావా పన్నీరు పద్యం నేర్పించింది. కానీ ఇది లాఫింగ్ థెరపీలా మారిపోయింది. 'ప్రేమించాను నిన్నే..' అంటూ అవినాష్ మోనాల్ కోసం పాట పాడుతూ ఆమె ముందు కుప్పిగంతులు వేశాడు. మరోవైపు నిన్నటి నామినేషన్ ప్రక్రియ నుంచి గంగవ్వ ఇంకా బయటపడలేదు. ఫొటోలు మంటల్లో వేయడం తనకు నచ్చలేదని బాధపడింది. అనంతరం బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు "ఉక్కు హృదయం" టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న సిల్వర్ బాల్‌ను మనుషులు పగలగొడితే ఓ రోబో చనిపోయినట్లు. అలా అన్ని రోబోలను చంపేస్తే మనుషుల టీమ్ గెలిచినట్లు లెక్క. ఒక్క రోబో బతికున్నా రోబోల టీమ్ గెలిచినట్లే. ఇక్కడో ట్విస్ట్ ఉంది. గెలిచిన టీమ్ సభ్యులు మాత్రమే కెప్టెన్ పోటీకి అర్హులు. (చదవండి:అతి త్వరలోనే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ)
పాజిటివ్‌గా మాట్లాడని అభి
మనుషుల టీమ్‌లో అఖిల్, అమ్మ రాజశేఖర్, దివి, నోయల్, సోహైల్, సుజాత,ఉన్నారు. రోబోల టీమ్‌లో దేవి, అరియానా, కుమార్ సాయి, లాస్య,అవినాష్, అభిజిత్, గంగవ్వ, హారిక ఉన్నారు. బజర్ మోగకముందే అత్యుత్సాహంతో ఇరు టీమ్‌లు ఆట మొదలెట్టేశారు. కిచెన్‌లో ఉన్న ఆహారాన్నంతా మనుషులు కోతుల్లా దోచుకుంటూ తీసుకువెళ్లడంతో రేషన్ మేనేజర్ అభి వారిపై సీరియస్ అయ్యాడు. మనుషుల టీమ్‌ను మనం ఆపలేమని తన రోబో టీమ్ మెంబర్స్‌లో నిరుత్సాహాన్ని నింపాడు. మనం ఏం చేయలేమని ఆట కూడా సరిగా ఆడలేదు. జోష్‌తో ఆడుతున్న మనుషుల టీమ్‌పై దేవి మండిపడింది. ఏంటీ పిచ్చి గేమ్ అని అరిచింది. దీంతో ఆమెనే టార్గెట్ చేసిన ప్రత్యర్థి గేమ్ మొదట దేవినే చంపేసింది. (చదవండి:బిగ్‌బాస్: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?)
గెలుపు కోసం కష్టపడుతున్న మనుషుల టీమ్
కాసేపటివరకు రోబోలు మనుషుల్ని ఆడుకోగా తర్వాత వీళ్ల వంతు రావడంతో ఇంటి లోపల ఉన్న రోబోలను డ్యాన్సుతో ఉడికించారు. పైగా లోన ఉన్న రోబోలు పుష్టిగా భోజనం చేస్తే బయట ఉన్న మనుషులు మాత్రం తినకుండా మాడిపోయారు, కనీసం వాష్ రూమ్ ఉపయోగించుకోడానికి కూడా లేదు. దీంతో అందరూ దుప్పటి అడ్డుపెట్టడంతో సుజాత వాష్‌రూమ్‌కు వెళ్లింది. వీరి తెగింపును చూసి రోబోలు షాక్‌కు లోనయ్యారు. అయితే కెమెరాలకు అడ్డుగా నిలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బిగ్‌బాస్ హెచ్చరించాడు. తర్వాత అవినాష్ బర్త్‌డేను మనుషుల టీమ్ సెలబ్రేట్ చేశారు. (చదవండి: హీరో- జీరో గేమ్‌తో విలన్‌గా మారిన లాస్య)
అవినాష్ బర్త్‌డే వేడుకలు
బర్త్‌డే పాట పాడుతూ ప్రోటీన్ పౌడర్‌ను కేక్‌గా ఊహించుకోమని అతడికి తినిపించారు. కాగా ఏదేమైనా గెలవాలన్న కసి మీద మనుషులు ఉన్నారు. కానీ వారిని ఓడించాలన్న పట్టుదల మాత్రం అందరు రోబోలలో కనిపించలేదు. ముఖ్యంగా టీమ్ సభ్యులను ఎంకరేజ్ చేయాల్సింది అభి వారిని నీరుగార్చే పనిలో ఉన్నాడు. దీంతో అరియానా పోరాడి ఓడిపోదామని చెప్పినప్పటికీ అతడు వినిపించుకోలేదు. ఆమె చెప్పే సలహాను కూడా చిల్లర ప్రయత్నాలు అని, ఇది నీ క్యారెక్టర్ అని నోరు జారుతూ తక్కువ చేసి మాట్లాడాడు. అభి ప్రవర్తన చూస్తుంటే అసలు రోబోల టీమ్‌కు అభి కట్టప్పలా తయారైనట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment