
Bigg Boss Contestant Gangavva House Warming: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. సొంతిల్లు కట్టుకోవాలన్న ఆమె కోరిక నెరవేరింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
పల్లెటూరి యాస, కామెడీ టైమింగుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న గంగవ్వ సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే అనారోగ్య కారణాల వల్ల అయిదో వారంలోనే హౌస్ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ఆమె కల కలగానే మిగిలిపోకూడదన్న భావనతో హీరో నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. చెప్పినట్లుగానే ఆమెకు రూ.7లక్షల రూపాయలు సహాయం చేశాడు. బిగ్‌బాస్ షో ద్వారా రూ.11లక్షలు సమకూరడంతోపాటు మరో రూ.3లక్షల వరకు అప్పుచేసిన గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది.
ఎట్టకేలకు తన కల నెరవేరినందుకు గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్ షో టీం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. గంగవ్వ కల నెరవేరినందుకు పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment