బిగ్‌బాస్ ఇంటిని కాపాడుకోవడం వచ్చో తెలీదో కానీ హౌస్‌ను చెడగొట్టమంటే మాత్రం క్షణాల్లో చేసి చూపించారు కంటెస్టెంట్లు. రాక్షసులు కూడా ఇంత క్రూరత్వంగా ప్రవర్తించరేమో అనిపించారు. మంచి మనుషులకు ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించారు. అయినా సరే వాటిని ఓపికగా భరిస్తూ సహనంతో ఒక్కో టాస్కు పూర్తి చేస్తూ వస్తున్న మనుషులు విజయానికి కేవలం ఓ అడుగు దూరంలో ఉన్నారు. ఇంతకీ వాళ్లు చేసిన టాస్కులేంటి? ఏయే రాక్షసులను మంచిగా మార్చారనేది చదివేయండి..
మంచి మనుషుల సహనానికి అగ్ని పరీక్ష
బిగ్‌బాస్ "కొంటె రాక్షసుడు- మంచి మనుషులు" అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌పురం రాజ్యంలో అరియానా, అవినాష్, అఖిల్, మెహబూబ్, హారిక రాక్షసుల టీమ్‌లో ఉండగా, మిగతావారు మంచి మనుషుల టీమ్‌లో ఉన్నారు. ఒక్కో రాక్షసుడిని మంచి మనిషిగా మార్చిన ప్రతీసారి రావణుడి బొమ్మలోని పది తలల్లో రెండింటిని పగలగొట్టాల్సి ఉంటుంది. అలా ముగ్గురు రాక్షసులనైనా మార్చితేనే మనుషుల టీమ్ గెలిచినట్లు లెక్క. కానీ మంచి మనుషుల పనులకు కొంటె రాక్షసుల ఆటంకం కలిగిస్తూ ఉంటారు. అయినా సరే వాళ్లు సహనాన్ని వీడకూడదు. (చదవండి: తొలిసారి అవినాష్.. సోహైల్ రిక్వెస్ట్)
తన ప్రతాపం చూపించిన అరియానా
టాస్కు ప్రారంభం అవగానే అరియానా నిజమైన రాక్షసిలా మారిపోయింది. నోయల్‌పై గుడ్డు పగలగొట్టినా అతడు కిక్కురుమనలేదు. అవినాస్ రావణుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి డైలాగులు వల్లించాడు. మెహబూబ్ సోహైల్‌ను బతికుండగానే మమ్మీలా మార్చాడు. హారిక మనుషులను క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇలా నానారకాలుగా చిత్ర చిత్ర హింసలు పెడుతూ వారిపై ముప్పేట దాడి చేశారు. ఇక మంచి మనుషుల టీమ్‌లోని నోయల్ రాక్షసులను మార్చేందుకు సూక్తులు చెప్తూ నానా యత్నాలు చేశాడు. రాక్షసుల ఆవేశాన్ని చల్లార్చేందుకు మాస్టర్ శాంతి శాంతి అంటూ మొత్తుకుంటున్నా ఆ మాట చెవినెక్కించుకునేవాళ్లే కరువయ్యారు. డ్రెస్సు లోపల ఐస్ గడ్డలు వేసినా మాస్టర్ శాంతి జపం వదల్లేదు. అవినాష్ వీరావేశంతో అరుంధతి డైలాగ్ చెప్పేయడంతో మోనాల్ అతడిని హత్తుకుంది.
మంచి మనిషిగా మారిన రాక్షసుడు అఖిల్
కొంటె రాక్షసులను మంచిగా మార్చేందుకు బిగ్‌బాస్ మంచి మనుషులకు ఓ టాస్క్ ఇచ్చాడు. స్విమ్మింగ్ ఫూల్‌లోని పూలతో 50 దండాలు అల్లాల్సి ఉంటుందని తెలిపాడు. కానీ అల్లిన దండలను రాక్షసులు పారేస్తూ మెడలో చుట్టుకుంటూ సర్వనాశనం చేశారు. అయినా సరే మంచి మనుషులు ఎట్టకేలకు టాస్క్‌ను పూర్తి చేసి రాక్షసుడి రెండు తలలు పగలగొట్టారు. రాక్షసుడిగా ఉన్న అఖిల్‌ను వాళ్ల టీమ్‌లో కలిపేసుకున్నారు. అనంతరం మంచి మనుషులకు క్లేతో 100 ప్రమిదలను తయారు చేయాలని బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. కానీ వాళ్లు దీపాలు తయారు చేయడం మొదలు పెట్టగానే రాక్షసులు క్లేలను దొంగిలించారు. (చదవండి: పాపం..మోనాల్‌ను మళ్లీ టార్గెట్ చేశారు)
గుట్టు చప్పుడు కాకుండా పని చేసిన నోయల్
నోయల్ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టకుని మరీ దీపాలు చేస్తుండటంతో మెహబూబ్, అవినాష్ ఆ రూమ్‌లోకి చొరబడి మరీ వాటిని దొంగిలించారు. మరోవైపు సోహైల్ హారికను ఆపేందుకు పట్టుకోగా ఆమె అతడిని పంటితో గాటు పెట్టడంతో కేకలు పెట్టాడు. ఇక లాస్య వాళ్లు కష్టపడి మాస్టర్ దగ్గర దీపాలు దాచిపెట్టగా మిగతావారు అతడి దగ్గరి నుంచి లేపేశారు. అయినా సరే 160 దీపాలు తయారు చేసి విజయం సాధించడంతో మంచి మనుషుల టీమ్ ఆనందం పట్టలేక ఇది ఫన్ అంటూ గెంతులేశారు. (చదవండి: నాన్న ఇస్త్రీ పని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్: నోయల్)
తన పేరు ముందు చెప్పలేదని ఫీలైన హారిక
అయితే మంచి మనుషుల జాబితాలో కలిపేస్తారన్న భయంతో రాక్షసులు అరియానా, మెహబూబ్, అవినాష్ ఒక్క బాత్రూమ్‌లోనే దూరిపోయారు. ఇక అప్పటికే మెహబూబ్ పేరు చెప్పినప్పటికీ అతడి జాడ దొరక్కపోవడంతో చేతికి చిక్కిన హారికను మంచి మనిషిగా మార్చారు. నిజానికి హారికకు మనిషిగా మారడం ఇష్టమే అయినప్పటికీ మొదట తన పేరు చెప్పలేదని ఫీలయింది. అలాంటప్పుడు తాను మనిషిగా మారినా వారికి ఎలాంటి సాయం చేయను అంటూ ఏడుస్తూ కెమెరాలతో చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: సోహైల్‌నే ఏడిపించిన అవినాష్!)
Comments
Please login to add a commentAdd a comment