పరమ బోరింగ్‌గా మారిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్కు ముగియడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారం అన్ని హత్యలు చేస్తూనే ఏమీ ఎరగనట్టు తెగ నటించేసింది. దీంతో టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. కానీ హత్యలన్నీ జరిగిపోయాక సోహైల్ హంతకురాలు హారిక అని తీర్పు చెప్పడంతో లాభం లేకపోయింది. ఇక ఇంటిసభ్యులు వారు చేసిన త్యాగం, సాయాలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు. యాంకర్‌గా వెలుగు వెలిగిన లాస్య తన జీవితంలో చీకటి రోజులను మరోసారి గుర్తు చేసి కంటతడి పెట్టించింది. మరి నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి..
తిండి దగ్గరే టాస్క్ ఆపేస్తారు: అరియానా ఆగ్రహం
తనకు ఆమ్లెట్ కావాలని అరియానా కోరగా కుదరదని అభిజిత్ చెప్పాడు. దీంతో ప్రతిసారి ఆహారం దగ్గరే టాస్క్ ఆపేస్తారు అని అరియానా మండిపడింది. ఇందుకే, నీ గేమ్ నచ్చదని అభిజిత్‌ను ముఖం పట్టుకుని అనేసింది. దీంతో తిక్క లేచిన అభి.. నాన్సెన్స్, తెలుసుకుని మాట్లాడు అంటూ సీరియస్ అయ్యాడు. ఇక అరియానా ఆకలి బాధ చూడలేక మాస్టర్ కిచెన్‌లో దూరాడు. అతడు చెప్పినదానికి వారు తలూపకపోవడంతో మోనాల్ ప్లేటులో పట్టుకున్న ఫుడ్డును పాడు చేసి వెళ్లిపోయాడు. తర్వాత సీక్రెట్ టాస్క్‌లో భాగంగా హారిక అవినాష్‌ను రెచ్చగొట్టింది. కానీ అసలు గొడవ మాత్రం మెహబూబ్, అఖిల్ మధ్య రాజుకోవడం గమనార్హం. ఆ వెంటనే గ్రామంలో మరో హత్య జరిగిందని బిగ్‌బాస్ ప్రకటించగా అమ్మ రాజశేఖరే ఈ హత్యలు చేస్తున్నాడని అందరూ అనుమానించారు. (చదవండి: అఖిల్, నన్ను బే అనకు: సోహైల్ వార్నింగ్)
సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన హారిక
'వెనక నుంచి హత్య చేయడమేంటి? మనిషా, దున్నాపోతా? ఛీ, తూ..' అంటూ అవినాష్ నానా మాటలు అన్నాడు. మరోవైపు హారిక మాత్రం హౌస్ లోపల అద్దంపై లిప్‌స్టిక్‌తో మెహబూబ్ చనిపోయాడు అని రాయడంతో ఆఖరు హత్య కూడా జరిగిపోయింది. తర్వాత పంచాయితీలో కూడా గ్రామపెద్ద సోహైల్ హారికే హంతకురాలని తీర్పు చెప్పాడు. కానీ అప్పటికే హత్యలు జరిగిపోవడంతో లాభం లేకపోయింది. ఇంటిసభ్యులందరూ మంటను మాత్రం చివరి వరకు ఆర్పకుండా కాపాడగలిగారు. ఇంతటితో టాస్క్ ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. నాగార్జున చెప్పినదాని ప్రకారం మాస్టర్, సీక్రెట్ టాస్క్ గెలిచి హారిక, కెప్టెన్ అరియానా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.
నా గురించి మాట్లాడకు అరియానా: అవినాష్
టాస్కులో అనవసరంగా కోపానికి వస్తున్నావు అని అరియానా అవినాష్‌తో చెప్పుకొచ్చింది. టాస్కులో వరస్ట్ పర్ఫామెన్స్ అడిగితే నీ పేరే చెప్పేదాన్ని అనడంతో అవినాష్ హర్ట్ అయ్యాడు. 'నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అది నాకు నచ్చట్లేదు, నా గురించి నువ్వు మాట్లాడకపోతేనే బెటర్' అని సలహా ఇచ్చాడు. అనంతరం ఇంటిసభ్యులు సమాజం కోసం కానీ, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను కానీ చెప్పాల్సి ఉంటుంది. ఎవరు చెప్పింది అందరినీ కదిలించివేస్తుందో వారిని బెస్ట్‌గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్‌బాస్: సోహైల్, అఖిల్ మళ్లీ గొడవపడ్డారు!)
అర్ధరాత్రి అర్జంటుగా డబ్బులు కావాలన్నాడు: సోహైల్
మొదట సోహైల్ మాట్లాడుతూ.. "నా స్నేహితుడి భార్యకు అప్పటికే రెండుసార్లు గర్భస్రావం అయ్యింది. మూడోసారి గర్భం దాల్చిన సమయంలో ఓ రోజు నాకు వాడు అర్ధరాత్రి ఫోన్ చేశాడు. అర్జంట్‌గా డబ్బులు కావాలన్నాడు. సమయానికి నా దగ్గర లేకపోయేసరికి మా వాళ్లను అడిగి 15 వేలు ఇచ్చాను. కానీ తర్వాతి రోజే 10 లక్షలు అవుతుందన్నారు. సోషల్ మీడియాలో సాయం కోసం పోస్టు పెట్టి 10 లక్షలు సమకూర్చాను. వాడు ఎమోషనలై.. జీవితాంతం నీకు, సమాజానికి రుణపడి ఉంటానని నాతో అన్నాడు నాకు కూడా గర్వంగా అనిపించింది" అని చెప్పుకొచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్ : ‘అమ్మ’బాబోయ్.. ఊహించని ట్విస్ట్ ఇది)
జున్ను వచ్చాక నా లైఫ్ మారిపోయింది: లాస్య
లాస్య మాట్లాడుతూ.. "2010లో నాకు పెళ్లి అయింది. 2012లో కలిసి ఉన్నాం. 2014 జనవరిలో నాన్న దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. ముందు సెటిల్ అవండి. తర్వాత వాళ్లే స్వయంగా పెళ్లి చేస్తాం అన్నారు. అది చూసి హ్యాపీగా ఫీలయ్యాను. కానీ అదే వారం నేను ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్తే గర్భవతిని అని చెప్పారు. కానీ ఫ్యామిలీకి చెప్పుకోలేక అబార్షన్ చేసుకున్నాను. 2017లో మళ్లీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకే నేను మళ్లీ గర్భవతినయ్యా. కానీ నిలవలేదు. 2018లో నా పొట్టలోకి జున్ను వచ్చాడు. ఆ తర్వాత నా లైఫ్ మారిపోయింది. కానీ నా మొదటి బిడ్డను నేనే చంపేసుకున్నాను అన్న బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది" అని ఏడ్చేసింది. అందరూ లాస్య చెప్పిన ఘటనతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె చెప్పిన సంఘటనే అందరి వాటిలో ది బెస్ట్ అనిపించడంతో ఆమెకు ఒప్పో దివాళి ఎడిషన్ ఫోన్‌ను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment