బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులేంటో చెప్పి, వారి ఆట తీరు ఎలా ఉంది? ఎలా మార్చుకుంటే బాగుంటుంది? తదితర విషయాలను చెప్పడానికి బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. హోస్ట్‌గా తనకున్న అనుభవంతో 21 మంది ఆట తీరును చక్కగా వివరించాడు.అంతేకాకుండా వారి లోపాలను తనదైన శైలీలో ఎత్తిచూపాడు. ఎలిమినేషన్‌లో ఉన్న ఏడుగురి ఇంటి సభ్యుల నుంచి ఇద్దరిని సేఫ్ చేశాడు కూడా. ఆ ఇద్దరు ఎవరు? ఇంటి సభ్యులను నాగ్ ఇచ్చిన సలహాలు ఏంటి? ఎవరికి మెచ్చుకున్నాడు? ఎవరిని తిట్టాడు? ఏడో ఎపిసోడ్ హైలెట్స్‌లో చదివేయండి
హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకు రాగానే ఆనందం వ్యక్తం చేశాడు. దానికి కారణంగా ఈ సారి బిగ్‌బాస్ వీకెండ్ షోకి ఆడియన్స్ కూడా వచ్చారు. కరోనా కాలంగా గతేడాది ఆడియన్స్‌ని తీసుకురాలేకపోయామని, ఈ సారి రావడం చలా హ్యాపీగా ఉందని చెప్పాడు. అలాగే గీతూని జైలు పెట్టడం కరెక్టేనా అని ఆడియన్స్ ఒపినియన్ అడిగాడు. వారిలో ఎక్కువ శాతం ఇంటి సభ్యులు చేసిన పని మంచిదేనని చెప్పారు. ఇక కంటెస్టెంట్స్‌ని పలకరించిన నాగ్..ఒక్కొక్కరి ఆట తీరు, చేసిన తప్పులు వివరిస్తూనే... ఆటను ఇంకెలా మెరుగుపరుచుకోవాలో పలు సూచనలు ఇచ్చాడు.
సింగర్ రేవంత్ ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నాడని, వాటిని తగ్గించుకోవాలని చెప్పాడు. అలాగే మెచ్యూర్డ్‌గా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక గలాట గీతు ఆట తీరును మెచ్చుకుంటూనే.. ఆమె మాట తీరును తప్పుపట్టాడు. ముఖ్యంగా బాత్రూంలోని హెయిర్ గురించి గీతూ చేసిన గోలను తప్పుపట్టాడు. నువ్వు చెప్పిన విషయం మంచిదే కానీ విధానం మంచిగా లేదన్నాడు.‘పదే పదే ఇనయాను తిక్కదానా? అనడం బాగా లేదు. నువ్ అలా పదే పదే తిక్కల్దానా అని అంటే.. నువ్ తిక్కల్దానివి అని జనాలు అనుకుంటారు’ అని నవ్వుతూనే చెప్పాల్సిన విషయం చెప్పేశాడు. అయితే గీతూ మాత్రం ఆ విషయాలను పెద్ద సీరియస్‌గా పట్టించుకోకపోవడమే కాకుండా...అవును సర్ నాకు కాస్త తిక్క ఉందిని రివర్స్ కౌంటర్ వేసింది. అప్పుడు నాగార్జున ‘శుభ్రత గురించి అన్ని మాటలు చెప్పావ్ కదా.. టిష్యూలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావ్.. మనం చెప్పే మాటలను మనం పాటించాలి.. సంబంధం లేని విషయంలో దూరితే జైల్లో వేస్తారు’అని అనడంతో ఇంటి సభ్యులంతా ఘోల్లున నవ్వారు.
నిన్న జరిగిన గేమ్‌లో సంచాలకురాలిగా వ్యవహరించిన ఫైమాపై నాగ్ ప్రశంసలు కురిపించారు. ‘ఫస్ట్ వీక్‌లోనే బెస్ట్ సంచాలక్‌గా నిరూపించావు. ప్రతివారం నాతో ఇలాగే ఫేమస్ ఫైమా అనిపించుకోవాలి’ అని చెబుతూనే.. బల్లితో ఆమె పోల్చుకోవడం నచ్చలేదని చెప్పాడు. బిగ్‌బాస్ క్యూట్ కపుల్ రోహిత్, మెరీనాలను ఆట తీరు బాగుందని చెప్పాడు. ఇక రోహిత్ తనతో టైమ్ స్పెండ్ చేస్తలేడని, హగ్ ఇవ్వడం లేదని వాపోతున్న మెరీనా బాధను నాగ్ అర్థం చేసుకొని దగ్గరుండి మరీ హగ్ ఇప్పించాడు.
ఆదిరెడ్డిని రివ్యూలు ఇవ్వడం మానేసి ఆట ఆడమంటూ సలహాలు ఇచ్చాడు. కొరియోగ్రఫీలోనే కాదు ఫ్రెండ్‌షిప్ చేసుకోవడంలోనూ అంతే ఫాస్ట్‌గా ఉండాలని అభినయశ్రీకి చెప్పాడు. కీర్తి భట్ ఆట తీరు బాగుందని, అయితే ఎవరో చెప్పారు కదా అని శ్రీహాన్‌ని బ్రో అని పిలవొద్దని, నీకు నిజంగా అనిపిస్తేనే అలా పిలవమని చెప్పాడు. అర్జున్ కల్యాణ్‌ని బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు. గీతూతో మాట్లాడిన తీరు.. రేవంత్‌ని పక్కకి తీసుకెళ్ల మాట్లాడడం బాగుందని చెప్పాడు. అదే సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఏదైనా ఉంటే వాళ్ల ముందే మాట్లాడలని,వెనకాల వద్దని సలహా ఇచ్చాడు.
ఇక సూర్య గురించి మాట్లాడుతూ.. ‘నీ ఆట తీరు బాగుంది. ఎవరికి ఆకలి వేసినా ఇబ్బంది పడకుండా వండుకొని తీసుకొచ్చి తినిపిస్తున్నావ్. ఇలా ఉండాలి’అని మెచ్చుకున్నాడు.వీరితో పాటు మిగిలిన ఇంటి సభ్యుల తప్పొప్పులను కూడా నాగ్ వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఎలిమినేషన్‌లో ఉన్న ఏడుగురిలో నుంచి మొదటగా శ్రీసత్య, తర్వాత చంటీలను సేవ్ చేశాడు. ఇక మిగిలిన ఐదుగురిలో అంటే..రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయా సుల్తానా, అభినయశ్రీ లలో ఎవరు బయటకు వెళ్తారనేది రేపటి(ఆదివారం) ఎపిసోడ్‌లో తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఓటింగ్ ప్రకారం.. ఆరోహి, ఇనయా సుల్తానా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని, బయటకు వెళ్లేందుకు ఇనయాకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment