బిగ్‌బాస్ సీజన్ 6ను రసవత్తరంగా మార్చడంలో కంటెస్టెంట్లు సఫలం కాలేదని వారి మీద కక్ష గట్టినట్టున్నాడు బిగ్‌బాస్. విన్నర్ క్వాలిటీస్ ఏ ఒక్కరికీ సరిగా లేవనుకున్నాడో, లేదా వారికి రూ.50 లక్షలు అనవసరం అనుకున్నాడో ఏమో కానీ ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టడం మొదలు పెట్టాడు. సండే రోజు నాగార్జున విజేత రూ.50 లక్షలు గెలుచుకుంటాడని ప్రకటించాడు. అంతలోనే అనేక ట్విస్టుల మధ్య ఈ ప్రైజ్‌మనీ రూ. 44,00,300కు పడిపోయింది. ఈ ఊచకోత ఇంకా జరిగేట్లు కనిపిస్తోంది.
ఇకపోతే ఇంటిసభ్యులకు డబ్బెందుకు అవసరం? వారు డబ్బు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వారికి ప్రైజ్‌మనీ ఎందుకు అవసరం? అనేది చెప్పాలన్నాడు. మొదటగా ఫైమా మాట్లాడుతూ.. 'మా అమ్మకు మేము నలుగురం ఆడపిల్లలం.. చిన్నప్పటినుంచి చాలా కష్టాలు పడ్డాం. రోజూ పొలం పనికి వెళ్లి ఆ డబ్బుతో నిత్యావసరాలు తెచ్చుకునేవాళ్లం. ఊర్లో ఎన్నో కిరాయి ఇళ్లు తిరిగాం, ఎన్నో అవమానాలు పడ్డాం. ఒకసారైతే మాకంటే వేరేవాళ్ల అద్దె ఎక్కువ ఇస్తామన్నారని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారు. కానీ ఎంత తిరిగినా ఉండటానికి ఇల్లు దొరకలేదు. మా అమ్మకు మంచి ఇల్లు కట్టివ్వాలన్నదే నా కోరిక' అని చెప్పింది.
ఆదిరెడ్డి వంతు రాగా.. 'మా నాన్న సరిగా పనిచేయకపోవడం వల్ల అమ్మ ఎన్నో కష్టాలు పడింది. ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నెత్తిన గడ్డిమోపు వేసుకుని పని చేసేది. నాకిప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. కానీ మా ఆవిడకు ఇల్లంటే ఇష్టం. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీతో సొంతిల్లు కొనాలన్నదే నా డ్రీమ్' అన్నాడు.
శ్రీసత్య మాట్లాడుతూ.. 'అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటూ తెలియకుండా పెంచారు. కష్టమనేదే లేకుండా చూసుకున్నారు. కానీ ఒకానొక సమయంలో ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి మా కుటుంబమంతా మూడు రోజులు తిండి లేక పస్తులున్నాం. డబ్బు లేకపోతే మన ముఖం కూడా ఎవరూ చూడరు. అమ్మకు వైద్యం చేయించేందుకు ఇల్లు కూడా అమ్మేశాం. నేను సంపాదించేదంతా అమ్మ వైద్యానికే అవుతుంది. బిగ్‌బాస్ విన్నింగ్ ప్రైజ్‌మనీతో మా అమ్మ కోలుకునేలా మంచి వైద్యం చేయించడంతో పాటు సొంతిల్లు కొనాలనుంది' అని చెప్పుకొచ్చింది. కీర్తి మాట్లాడుతూ.. నాకు సొంతంగా ఏదీ కొనాలని లేదు. కానీ నాలాంటి అనాధల కోసం ఒక ఆశ్రమం పెట్టాలని ఉందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment