సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఎంతో ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు. తమలో ఉన్న టాలెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆ టాలెంట్‌తో నెట్టింట చెలరేగి పోతున్నారు. అలా జనాలకు పరిచయమైన వ్యక్తి పల్లవి ప్రశాంత్. అన్నా.. మళ్లొచ్చిన అంటూ వీడియోలు చేసుకునే ఇతడు రైతుబిడ్డగా ఫేమస్ అయ్యాడు. రైతు కష్టాలు చెప్తూ, పొలం పని చేస్తూ తీసిన వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి.
కేసులో ఇరుక్కున్న రైతుబిడ్డ
అంతే కాదు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లోనూ అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతో, మాటతో ప్రేక్షకులను మెప్పించి.. బిగ్‌బాస్ 7 టైటిల్ విజేతగా నిలిచాడు. కానీ విజయానందంలో పోలీసులు చెప్పిన మాట వినకుండా రభస జరుగుతున్న చోటే ర్యాలీ చేసి జైలుపాలయ్యాడు. తర్వాత భోలె షావళి చొరవ తీసుకుని లాయర్‌ను మాట్లాడి మరీ ఈ కేసు నుంచి ప్రశాంత్‌ను బయటకు తీసుకువచ్చాడు. అయితే ప్రశాంత్‌కు హీరోగా అవకాశాలు వచ్చాయని చెప్తున్నాడు సింగర్ భోలె.
హీరోగా సినిమా ఛాన్సులు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ప్రశాంత్‌కు సినిమా అవకాశాలు వచ్చాయి. మధ్యలో ఈ పోలీస్ కేసు లాంటిది లేకపోయుంటే ఈపాటికే కొన్ని సినిమాలకు సంతకం చేసేవాడు. తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొందరు లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. రైతుబిడ్డ హీరోగా చేస్తాడా? అని కొందరు నా దగ్గరకు వచ్చి అడిగారు. అతడి సినిమాకు నేను సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. తప్పకుండా చేస్తానన్నాను. కాకపోతే ఇంతలోనే ఈ రచ్చ అంతా జరిగింది. నిజంగా ఆ సమయంలో మేము అండగా లేకపోయుంటే తను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేవాడు.
బిగ్‌బాస్‌కు వెళ్లకపోయినా బాగుండు
పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉంటే బాగుండేదని బాధపడ్డాడు. ప్రశాంతే ఈ విషయాలను నాతో స్వయంగా చెప్పాడు. కానీ బయటకు వచ్చాక జనం తనమీద పెట్టుకున్న నమ్మకం చూసి సంతోషించాడు. నన్ను కూడా చాలామంది హీరోగా అడుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించాలన్నది నా కల. ఇటు హీరోగా కూడా చేస్తా. ఆల్‌రౌండర్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాను' అంటున్నాడు భోలె షావళి.
NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment