Bigg Boss OTT Telugu Non Stop Grand Launch Episode Live Updates Today - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop : ఇదిగో 17 మంది కంటెస్టెంట్స్‌, నాన్‌ స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ షురూ

Published Sat, Feb 26 2022 6:06 PM | Last Updated on Mon, Feb 28 2022 11:58 AM

Bigg Boss OTT Telugu Non Stop Grand Launch Episode Live Updates Today - Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ శనివారం సాయంత్రం ప్రారంభమైంది. 'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌' పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో 24*7 నాన్‌ స్టాప్‌గా ప్రసారం కానునున్న ఈ షో నేటితో మొదలై.. 84 రోజులు పాటు నిరంతరంగా ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో తారాజువ్వల వెలుగులో గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. స్టాప్‌.. దిస్‌ ఈస్‌ బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌ అంటూ స్మాల్‌ స్క్రీన్‌పైకి వచ్చేశాడు. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో వెళ్లి ఇల్లంతా తిరుగుతూ సందడి చేశాడు.

తొలి కంటెస్టెంట్‌గా అషురెడ్డి
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ తొలి కంటెస్టెంట్‌గా అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ.. సాంగ్ తో అదరగొట్టింది అషు రెడ్డి. అషురెడ్డి గేమ్‌ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ.. హౌస్‌లోకి ఎంట్రీఇచ్చింది అషు. 

డబ్‌స్మాష్‌తో ఫేమస్‌..‘బిగ్‌బాస్‌’తో ఊహించని క్రేజ్‌
డబ్‌స్మాష్‌తో ఫేమస్‌.. టిక్‌టాక్‌తో మరింత పాపులర్‌.. బిగ్‌బాస్‌ షోతో ఊహించని క్రేజ్‌.. ఆమె మరెవరో కాదు అషూ రెడ్డి. అభిమానులు ఆమెను ముద్దుగా జూనియర్‌ సమంత అని పిలుచుకుంటారు. నిత్యం ఫొటోషూట్లతో సందడి చేసే ఈ భామ ఛల్‌ మోహనరంగ సినిమాలోనూ మెరిసింది. పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ హోస్ట్‌గానూ మెప్పిస్తోంది. గతంలో బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న అషూ ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగింది. అయితే ఈసారి మాత్రం ఫైనల్స్‌లో కచ్చితంగా అడుగుపెడతానంటోందీ ముద్దుగుమ్మ. ఎలాగో అషూకు బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సపోర్ట్‌ ఉండనే ఉంది. మరి ఈసారి అషూ గేమ్‌ప్లాన్‌ ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనేది మున్ముందు తేలనుంది.

రెండో కంటెస్టెంట్‌గా మహేశ్‌ విట్టా
రెండో కంటెస్టెంట్‌గా నటుడు మహేశ్‌ విట్టా ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా అతని ఏవీ వేసి చూపించారు. చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయన పాటలు వింటూ సినిమాల్లోకి వచ్చానని మహేశ్‌ చెప్పాడు. బిగ్‌బాస్‌ షో వల్ల చిరంజీవిని కలిసే అవకాశం వచ్చిందన్నారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి.. అషురెడ్డితో కలిసి ఇల్లంగా తిరిగి చూశాడు.

ఎవరీ మహేశ్‌ విట్టా?
మహేశ్‌ విట్టా యూట్యూబర్‌, నటుడు, కమెడియన్‌. 2017లో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. యాక్టింగ్‌ టాలెంట్‌తో పలు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న ఆయన బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొన్నాడు. అయితే తన ఫ్రస్టేషన్‌ను పక్కనవారికి చెప్పుకోవడమే అతడి పాలిట శాపంగా మారింది. నారదుడు అన్న బిరుదును అతడికి అంకితమచ్చారు. అయితే అప్పుడొచ్చిన మహేశ్‌ విట్టాకు భయముండేది.కానీ ఇప్పుడొచ్చిన మహేశ్‌ విట్టాకు జల్లికట్టులో ఎద్దు మాదిరిలా గుద్దుకుంటా పోతాడంతే.. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అని చెప్పుకొచ్చాడు మహేశ్‌. బిగ్‌బాస్‌ తర్వాత ఆదాయం పెరిగింది, ఆటిట్యూడ్‌ మారింది, సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టి సినిమా కూడా తీశానని చెప్పుకొచ్చాడు మహేశ్‌. ఊరమాస్‌గా ఎంట్రీ ఇచ్చిన మహేశ్‌ బుల్లితెరపై కూడా నవ్వులు పంచుతూ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంటాడా? అనేది చూడాలి!

మూడో కంటెస్టెంట్‌గా ముమైత్‌ఖాన్‌
మూడో కంటెస్టెంట్ గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్. ‘నా పేరు కనకం’అనే ఐటమ్‌ సాంగ్‌కి స్టెప్పులేస్తూ స్మాల్‌ స్క్రీన్‌పైకి వచ్చింది ముమైత్‌. అనంతరం వచ్చీరాని తెలుగుతో నాగార్జునతో పాటు ప్రేక్షకులను నవ్వించింది. బిగ్‌బాస్‌ షోకి వచ్చిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పింది. తన గురించి తాను బాగా తెలుసుకున్నానని చెప్పింది. అనంతరం ముమైత్‌కి ఓ టాస్క్‌ ఇచ్చి ఇంట్లోకి పంచించాడు. 


ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఐటం సాంగ్స్‌తో కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించింది ముమైత్‌ ఖాన్‌. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియా, బెంగాలీ భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె తక్కువకాలంలోనే స్టార్‌ డ్యాన్సర్‌గా ఎదిగింది. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో అడుగుపెట్టి వివాదాలతో, గొడవలతో సంచలనంగా మారిన ముమైత్‌ మరోసారి ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పటికి, ఇప్పటికి చాలా మారానంటోంది ముమైత్‌. తన ఆలోచనలు, కోపం, అవకాశాలు.. జీవితమే మారిపోయిందని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌ ఓటీటీలోకి డైనమైట్‌గా అడుగుపెట్టిన ముమైత్‌ గేమ్‌ప్లాన్‌ ఈసారి ఎలా ఉండబోతోంది? వచ్చీరాని తెలుగుతో ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుందా? వంటి విషయాలన్నీ త్వరలో తేలిపోనున్నాయి.

నాలుగో కంటెస్టెంట్‌గా కొత్త కుర్రాడు


నాలుగో కంటెస్టెంట్‌గా ఛాలెంజర్ కొత్త కుర్రాడు అజయ్‌ ఎంట్రీ ఇచ్చాడు. డీజే టిల్లు పాటకు స్టెప్పులేస్తూ స్టేజ్‌ మీదకు వచ్చాడు. అనంతరం అతని గురించి చెప్పుకుంటూ.. గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించానని చెప్పాడు. ఇప్పుడు ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటిస్తున్నానని చెప్పారు. ఈ బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ తనకు చాలా ప్లస్ అవుతుందని తెలిపాడు. సంకీగా ( మొండిగా ) వెళ్లిపోతానని ఇంట్లోకి వెళ్లాడు. మరి ఈ జూనియర్‌ సీనియర్స్‌తో ఎలా పోటీపడతాడు, బిగ్‌బాస్‌ ఓటీటీలో ఎన్ని వారాలు ఉంటాడన్నది చూడాలి!

ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్‌ స్రవంతి చొక్కారపు

ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్ స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది. ఎవరికి తెలియని సీక్రెట్‌ ఏదైనా ఉంటే చెప్పమని నాగ్‌ అడగ్గా.. తను రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని, ఒక్కసారి పారిపోయి చేసుకుంటే.. తర్వాత ఇంట్లో వాళ్ల ముందు మళ్లీ అతన్నే చేసుకున్నానని చెప్పింది. తనకు పెళ్లి అయిన విషయం బిగ్‌బాగ్‌ స్టేజ్‌ మీద చెప్పడం సంతోషంగా ఉందని చెప్పింది. నవరసాలతో ఎంటర్‌టైన్‌ చెస్తానని లోనికి వెళ్లిపోయింది. రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చింది యాంకర్‌ స్రవంతి చొక్కారపు. సోషల్‌ మీడియా నుంచి టీవీ దాకా సాగిందామె ప్రయాణం.

ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ ఎంట్రీ ఇచ్చాడు. మొదటగా అతని జర్నీని వీడియో రూపంలో చూపించి, అనంతరం అతన్ని స్టేజ్‌ మీదకు ఆహ్వానించాడు నాగార్జున. స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ అంటూ అతని తల్లిని స్జేజ్‌ మీదకు తీసుకొచ్చాడు నాగ్‌. అలాగే అతనికి ఇష్టమైన చికెన్‌ బర్గర్‌ ఇచ్చి ఇంట్లోకి పంపించేశాడు. 

నోరు తెరిస్తే.. ఆనకట్ట వేయడం కష్టమే
ఈయన నోరు తెరిచాడంటే ఆనకట్ట వేయడం కష్టం. అతడే ఆర్జే చైతూ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అతడు కుటుంబ పోషణ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. విజయవాడకు చెందిన చైతూ హైదరాబాద్‌కు వచ్చి డిగ్రీ చదువుతూ, యానిమేషన్స్‌ చేసుకుంటూనే రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆర్జేగా మారాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. ఇప్పటివరకు ఆరు జాతీయ అవార్డులు అందుకున్నాడు చైతు.

ఏడో కంటెస్టెంట్‌గా అరియానా
ఏడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌-4 ఫేమ్‌ అరియానా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ తర్వాత తన జీవితమే మారిపోయిందని చెప్పిందీ బ్యూటీ. బిగ్‌బాస్‌ 4 తర్వాత.. బిగ్‌బాస్‌ బజ్‌కి హోస్ట్‌గా, ఓటీటీకి మళ్లీ డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌.. ఆట అంటే ఆటే అంటూ ఇంట్లోకి వెళ్లింది అరియానా. 

యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించిన అరియానా పలు టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియోతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయిన ఈ భామకు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పిలుపు రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తన అందచందాలతోనే కాకుండా ఆటతోనూ అభిమానులను కట్టిపడేసిన అరియానా.. తనకు తప్పనిపిస్తే బిగ్‌బాస్‌నేంటి? ఏకంగా నాగార్జునను సైతం నిలదీసింది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన అరియానా థర్డ్‌ రన్నరప్‌గా వెనుదిరిగింది.ఆ తర్వాత ఐదో సీజన్‌ బజ్‌కు హోస్ట్‌గానూ వ్యవహరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొంది.

ఎనిమిదో కంటెస్టెంట్‌గా..నటరాజ్‌ మాస్టర్‌
ఎనిమిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ కంటెస్టెంట్‌ నటరాజ్‌ మాస్టర్‌ సూపర్‌ ఏవీతో ఎంట్రీ ఇచ్చాడు.ఈ సారి మాత్రం గేమ్‌లో తగ్గదేలే అంటూ ఇంట్లోకి వెళ్లాడు నటరాజ్‌. ఇంతకు ముందు భార్య కోసం వచ్చాను.. ఇప్పుడు తన పాప కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్. నటరాజ్ కు తన పాప ఫోటోను గిఫ్ట్ గా ఇచ్చారు నాగ్.

తెలుగులో వస్తున్న డ్యాన్స్‌ రియాలిటీ షోలకు నటరాజ్‌ మాస్టర్‌ ఓరకంగా ఆద్యుడని చెప్పవచ్చు. గతంలో ఉదయభానుతో కలిసి డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ షో చేసిన నటరాజ్‌ పలు షోలకు కొరియోగ్రాఫర్‌గా, మెంటార్‌గా వ్యవహరించాడు. దాదాపు టాప్‌ హీరోలు, దర్శకులందరితోనూ కలిసి పని చేసిన నటరాజ్‌ మాస్టర్‌కు 20 ఏళ్లకు పైనే అనుభవం ఉంది.
కృష్ణా జిల్లాకు చెందిన ఈ కొరియోగ్రాఫర్‌ ఏడు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నప్పుడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో అడుగు పెట్టిన ఆయన బిడ్డ పుట్టిన తర్వాత మరోసారి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు భార్య కోసం, ఇప్పుడు కూతురి కోసం షోలోకి వచ్చానని, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. రోరింగ్‌ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన నటరాజ్‌ మాస్టర్‌ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఏయే జంతువుల పేర్లు పెడతాడు? కోపాన్ని కంట్రోల్‌ చేసుకుని ఎలా ఆడతాడో చూడాలి!

తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీరాపాక
తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ రాపాక. బిగ్ బాస్ తనకు డైమండ్ తో సమానం అని చెప్పింది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే మెడిసిస్‌తో అందరికి వినోదాన్ని అందిస్తానంటూ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లింది.

హీరోయిన్‌ శ్రీరాపాక పుట్టింది తూర్పుగోదావరిలో, పెరిగింది హైదరాబాద్‌లో. ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. కబడ్డీ, కోకో ఆటల్లో జాతీయస్థాయిలో ఆటలు ఆడింది. అయితే ఓ సారి మాత్రం ఆంధ్రా నుంచి వచ్చానని ఆట ఆడనివ్వలేదని, దీంతో ఆ క్షణమే స్పోర్ట్స్‌ వదిలేశానని చెప్పుకొచ్చింది. వెస్ట్రన్‌లో ఉన్న మాస్‌, ట్రెడిషనల్‌లో ఉన్న క్లాస్‌.. రెండూ కలిపి దుమ్ము దులిపేస్తానంటూ రేసుగుర్రం ట్యాగ్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టింది శ్రీరాపాక. తనకు ఎమోషన్స్‌ ఎక్కువంటున్న ఆమె వాటిని నియంత్రించుకోగలుగుతుందా? లేదా? అనేది చూడాలి!

పదో కంటెస్టెంట్‌గా మోడల్‌ అనిల్‌ రాథోడ్‌
పదో కంటెస్టెంట్‌గా మోడల్‌ అనిల్‌ రాథోడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అతనికి లిప్‌ మార్క్‌ ఇచ్చి, అది ఎవరిదో చెప్పాలంటూ.. ఇంట్లోకి పంపించాడు నాగార్జున. ఇక ఇంట్లోకి వెళ్లిన అనిల్‌కు ఘన స్వాగతం పలికారు ఇంటి సభ్యులు. 

ఎవరీ అనిల్‌?
అనిల్‌.. ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరు. ఇతడి తండ్రి, తాత కూడా పోలీసాఫీసర్‌. కానీ అనిల్‌ మాత్రం మోడలింగ్‌ వైపు అడుగులు వేశాడు. మొదట్లో అతడి నిర్ణయాన్ని కుటుంబసభ్యులు వ్యతిరేకించినప్పటికీ అనిల్‌ ఇష్టాన్ని కాదనలేక మోడలింగ్‌కు సరేనన్నారు. దీంతో తక్కువ కాలంలోనే బెస్ట్‌ మోడల్‌గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు అనిల్‌.

11వ కంటెస్టెంట్‌గా నటి మిత్ర శర్మ

11వ కంటెస్టెంట్‌గా నటి మిత్ర శర్మ ఎంట్రీ ఇచ్చింది.  ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మిత్ర ‘తొలి సంధ్యవేళలో’ మూవీలో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కొన్నాళ్ల తర్వాత శ్రీ పిక్చర్స్‌ అనే ప్రొడెక్షన్స్‌ హౌస్‌ని ఓపెన్‌ చేసింది. బాయ్స్‌ అనే సినిమాతో నిర్మాతగా మారింది. 

12వ కెంటెస్టెంట్‌గా తేజస్వీ


12వ కంటెస్టెంట్‌గా నటి తేజస్వీ.. ‘టచ్‌ మీ..టచ్‌ మీ’అనే ఐటమ్‌ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తా అంటుంది.

హీరోయిన్‌ తేజస్వి మదివాడ ఎన్నో కష్టాలు పడింది. చిన్నప్పుడే తల్లి క్యాన్సర్‌ బారిన పడి చనిపోగా తండ్రి ఆర్మీ ఆఫీసర్‌ అయినా మద్యానికి బానిసయ్యాడు. దీంతో తినడానికి కూడా తిండి లేక పస్తులున్న రోజులున్నాయి. అలాంటి దీన స్థితి నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది తేజస్వి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె హార్ట్‌ ఎటాక్‌, లవర్స్‌, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌ వంటి పలు సినిమాల్లో నటించింది.

రామ్‌గోపాల్‌ వర్మ ఐస్‌ క్రీం చిత్రంతో హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అంతంతమాత్రంగానే అవకాశాలు తెచ్చుకుంటున్న తేజస్వి గతంలో బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొంది. తాజాగా బిగ్‌బాస్‌ ఓటీటీలో అడుగు పెట్టిన ఆమె అభిమానులకు ఎంతో రుణపడి ఉన్నానని, ఎంటర్‌టైన్‌ చేస్తూ ఆ రుణాన్ని తీర్చేసుకుంటానంది. మరి ఈసారైనా ఈ రియాలిటీ షో తేజస్వికి కలిసి వస్తుందా? లేదా? చూడాలి!

13వ కంటెస్టెంట్‌గా సరయు


13వ కంటెస్టెంట్‌గా సోషల్‌ మీడియా స్టార్‌ సరయు ఎంట్రీ ఇచ్చింది. ఐదో సీజన్‌లో ఇలా వచ్చి అలా వెళ్లిన సరయు.. ఈ సారి మాత్రం తగ్గేదేలే అంటోంది. సరయు పూర్తి పేరు సరయు రాయ్‌. నిన్నే పెళ్లాడతా సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌లో నటించింది. 7 ఆర్ట్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో అడల్ట్‌ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్‌ అయింది. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరయు మొదటివారంలోనే ఎలిమినేట్‌ అయ్యింది. తన ఆటను చూడకుండా ఒక్కవారానికే ఎలా ఎలిమినేట్‌ చేస్తారని బాధపడిపోయిన సరయు మరోసారి బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టింది. తనేంటో, తన పవరేంటో ఇప్పుడు చూపిస్తానంటోందీ భామ. హౌస్‌లో ఎలా మంటపెడతాన్నో చూడండి అంటూ ఫైర్‌ ట్యాగ్‌తో హౌస్‌లోకి వెళ్లింది సరయు. మరి ఆమె నోటిప్రవాహాన్ని ఇతర కంటెస్టెంట్లు తట్టుకోగలరా? ఆమె బూతుల దండకానికి ఆడియన్స్‌ ఓట్లు గుద్దుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

14వ కంటెస్టెంట్‌గా యాంకర్‌ శివ


14వ కంటెస్టెంట్‌గా యాంకర్‌ శివ ఎంట్రీ ఇచ్చారు. డబ్బులు గెలిచి చెల్లి పెళ్లి చేయడం కోసమే బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నానని శివ చెప్పాడు. యాంకర్‌ శివ విషయానికొస్తే.. యూట్యూబర్లకు బాగా పరిచయమున్న పేరు. వివాదాస్పద ఇంటర్వ్యూలతో సెన్సేషనల్‌ అయ్యాడు శివ. శ్రీకాకుళంలో పుట్టిన అతడు వైజాగ్‌లో విద్యనభ్యసించాడు. సెలబ్రిటీల నుంచి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల దాకా అందరినీ ఇంటర్వ్యూ చేసే ఆయన తాజాగా బిగ్‌బాస్‌ ఓటీటీలో పాల్గొన్నాడు.

15వ కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ బిందు మాధవి


15వ కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ బిందు మాధవి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్‌ కిక్‌ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేస్తూ స్టేజ్‌ మీదకు వచ్చింది బిందు. తెలుగులో ఆవకాయ బిర్యాని, పిల్ల జమిందార్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిందు మాధవి.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వడానికి బిగ్‌బాస్‌లో వచ్చానని చెప్పింది. 

బిందుమాధవి అచ్చ తెలుగు హీరోయిన్‌. 'ఆవకాయ బిర్యానీ', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాల్లో కథానాయికగా నటించిన ఈమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో వాలిపోయిన ఆమెకు అక్కడ అవకాశాలతోపాటు ఆదరణ కూడా బాగానే ఉండటంతో అక్కడే సెటిలైంది. కన్నడ బిగ్‌బాస్‌లోనూ పాల్గొన్న బిందు ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌ ఓటీటీలో పాల్గొంటోంది.

16వ కంటెస్టెంట్‌గా హమిదా


16వ కంటెస్టెంట్‌గా హమిదా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ 5లోకి వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదని,ఈ సారి మాత్రం అందరికి తెలిసిపోతానని హమిదా చెప్పుకొచ్చింది. అనంతరం హమిదాకు ఓ టాస్క్‌ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. ఓ ఐదు కళ్ళను చూపించి ఏ కళ్ళు నచ్చాయో చెప్పమన్నాడు నాగార్జున. ఆమె ఓ ఫోటో సెలెక్ట్‌ చేసుకోగా..ఆ కళ్లు ఎవరివో వచ్చే వారం చెప్పాలంటూ.. హమిదాని హౌస్‌లోకి పంపాడు నాగార్జున.

సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది హమీదా. అందంచందం ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. నటిగా రాణించేందుకు మంచి ఆఫర్‌ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్‌బాస్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇంకేముందీ.. ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసింది. అలా బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.సింగర్‌ శ్రీరామ్‌ను స్నేహితుడి కన్నా ఎక్కువ ప్రేమికుడి కన్నా తక్కువగా ఊహించుకున్న ఆమె అతడికే ఎక్కువ అంకితమైంది. దీంతో హమీదా అసలు గేమ్‌ చూడలేమనుకున్నవాళ్లకోసం మరోసారి బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టిందీ బూరబుగ్గల బ్యూటీ. మరి ఈసారి ఈ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరోయిన్‌ గేమ్‌ ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించనుంది? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

17వ కంటెస్టెంట్‌గా అఖిల్‌ సార్థక్‌


17వ కంటెస్టెంట్‌గా అఖిల్‌ సార్థక్‌ అదిరిపోయే పాట పాడుతూ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అఖిల్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. అఖిల్‌ న‌టించిన సిసింద్రి చిత్రం విడుద‌లైన మరుస‌టి రోజే తాను జ‌న్మించడంతో కుటుంబ స‌భ్యులు త‌న‌కు అఖిల్ అని పేరు పెట్టాడ‌ని గతంలో చెప్పుకొచ్చాడీ మోడల్‌. హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో మూడో స్థానం సంపాదించుకున్న అఖిల్‌ ప‌లు సీరియల్స్‌లోనూ న‌టించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఫైటర్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌ ఈసారి రన్నరప్‌గా కాకుండా కప్‌ గెలుచుకుని విన్నర్‌గా బయటకు వస్తానన్నాడు. మరి అతడు తన కలను నెరవేర్చుకుంటాడా? లేదా? చూడాలి!

సోషల్‌ మీడియాలో లీకైన లిస్టే.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో అంతగా ఉత్కంఠ కనపడలేదు. బిగ్‌బాస్‌ టీమ్‌ కడవరకు సస్పెన్స్‌ మెయింటెన్‌ చేసినా కూడా లీకులు మాత్రం ఆగలేదు. 84 రోజుల పాటు 17 మందితో సాగే ఈ షో.. రేపటి నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో రక్తికట్టించబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement