Bigg Boss Telugu 5, Episode 06: అన్ని విషయాల్లో తలదూర్చే కాజల్ పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాదూ, కూడదని మొండికేస్తోంది. ముఖ్యంగా కిచెన్ తనవల్లకాదని చెప్తోంది. హౌస్‌లో పనులు విభజించిన సమయంలో కాజల్‌ను కిచెన్ టీమ్‌లో అడ్జస్ట్ చేయాలని చూడగా ఆమె మాత్రం వంట చేయను, గిన్నెలు కూడా శుభ్రం చేయను అని తేల్చి చెప్పేసింది. దీంతో అందరూ ఆమె మీదకు ఒంటికాలిపై లేచారు. మరోవైపు 'నువ్వు కెప్టెన్ అయ్యాకే ఈ ఫ్లవర్ నా చేతికివ్వు' అంటూ మానస్ ఇచ్చిన పువ్వును అతడికే తిరిగిచ్చేసింది ప్రియాంక సింగ్. ఒకవేళ ఈ పువ్వు వేరే ఎవరి దగ్గర చూసినా అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది. దీనికి మానస్ సరేనంటూ బుద్ధిగా తలూపాడు.
ఒకరిని కాదు ఇద్దరినైనా లేపుతా, మాస్టర్ రచ్చ
ఇక తర్వాతి రోజు బిగ్‌బాస్ హౌస్‌లో వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో హౌస్‌మేట్స్ అందరూ అందంగా ముస్తాబయ్యారు. కానీ ఈసారి తమ ఫ్యామిలీస్‌తో లేనందుకు కొంత ఎమోషనల్ అయ్యారు. గణపతి పూజ అనంతరం బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు పాల్గొనాల్సి ఉండగా హౌస్‌మేట్స్ విశ్వ, శ్రీరామచంద్ర పేర్లను సూచించారు. ఈ నిర్ణయంపై నటరాజ్ మాస్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక్కడ బలం చూడాలి కానీ కండలు కాదంటూ విశ్వను సెలక్ట్ చేయడాన్ని తప్పు పట్టాడు. తాను ఒక్కరిని కాదు, ఇద్దరినైనా లేపుతానంటూ రభస చేయగా యాంకర్ రవి ఆయనకు నచ్చజెప్పాడు. మొత్తానికి విశ్వ, శ్రీరామచంద్ర ఈ టాస్క్‌లో పాల్గొని విజయవంతంగా తమకు కావాల్సిన సరుకులను తెచ్చుకున్నారు.
రవి టాస్క్‌ను జోక్‌గా తీసుకున్నాడు..
అనంతరం ఈవారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్‌లను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. మొదటగా రవి.. అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్న లోబో బెస్ట్ పర్ఫామర్ అని, కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకున్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని పేర్కొన్నాడు. లోబో.. కిచెన్‌లో ఎలాంటి సమస్యలు తేనందుకు యానీ మాస్టర్ బెస్ట్ అని.. తెలిసో, తెలియకో తప్పులు చేస్తూ, నోరు జారుతున్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు. అనంతరం జెస్సీ వంతురాగా.. సిరిని బెస్ట్, టాస్క్‌ను జోక్‌గా తీసుకున్నాడంటూ రవిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేశాడు. శ్వేత వర్మ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వ బెస్ట్, పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్న ఉమాదేవి వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది.
ప్రతి ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ఆమె బెస్ట్ పర్ఫామర్
ఉమాదేవి.. విశ్వ బెస్ట్‌గా, కాజల్ వరస్ట్‌గా ఆడుతున్నారని సింపుల్‌గా తేల్చేసింది. సిరి.. నటరాజ్ మాస్టర్ బెస్ట్, ఉమాదేవి ప్రవర్తన వల్ల కొందరు ఇబ్బందిపడుతున్నారని, అందువల్ల ఆవిడే వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. విశ్వ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ప్రేమను పంచుతున్న ప్రియాంక సింగ్ బెస్ట్ అని చెప్పడంతో పింకీ ఎమోషనల్ అయింది. ఇక పనులు రావని చెప్పి తప్పించుకునే కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా సూచించాడు. లహరి.. విశ్వ బెస్ట్ పర్ఫామర్ అని, కెప్టెన్ అయింది సిరి కానీ, అలా వ్యవహరిస్తుంది మాత్రం కాజల్ అంటూ ఆమెను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పుకొచ్చింది.
నీతో మాట్లాడటమే వేస్ట్..: ఉమాదేవి
తన జీవితం ముళ్ల పాన్పు అంటూ మొదలెట్టిన ప్రియాంక సింగ్ 14 ఏళ్లకే ఇంటి బాధ్యతలు తీసుకున్నానంది. గత కొన్నేళ్లుగా నవ్వడమే మర్చిపోయిన తనను మనసారా నవ్వించిన లోబో బెస్ట్ పర్ఫామర్ అంది. ఇక పెద్దావిడగా మంచీ చెడ్డలు చెప్పాల్సిన ఉమాదేవి మనిషులను చులకనగా చూస్తూ, అమర్యాదగా మాట్లాడతారని పేర్కొంది. ఆమె ప్రవర్తన రూడ్ అని చెప్తూ ఉమాదేవిని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడింది. అయితే ఆమె మాటలతో ఏకీభవించని ఉమా.. నీతో మాట్లాడటమే వేస్ట్ అంది. ఈ మాటతో ఆవేశపడ్డ పింకీ.. మీలా మనుషులను చీప్‌గా తీసిపడేయలేను అని ధీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే రాజుకుంది. ఒకరి మీదకు ఒకరు దూసుకు వెళ్లడమే కాక పింకీ షటప్ అంటూ ఆమెకు వేలు చూపించడంతో ఉమాదేవి కాళికావతారం ఎత్తింది. అయితే కొన్ని క్షణాల తర్వాత నోరుజారానని తెలుసుకున్న పింకీ తాను కోపంలో షటప్ అనేశానని ఉమాకు సారీ చెప్పి ఏడ్చేసింది.
ఆమెను ఎగతాళి చేస్తూనే ఉన్నారు: సరయూ
ఇక ఉమాదేవిని ఎవరో ఒకరు ఎగతాళి చేస్తూనే ఉన్నారని సరయూ తెగ ఫీలై ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత యానీ మాస్టర్.. పింకీ బెస్ట్, జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. సరయూ.. లోబోను బెస్ట్ పర్ఫామర్‌గా సూచించింది. 'జెస్సీ చిన్నపిల్లాడు కాదు, అతడికి ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏ పనీ చేయడు. ఓన్లీ టాయిలెట్‌కు వెళ్లడమే నువ్వు చేసే పనా?' అని ప్రశ్నిస్తూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా సూచించింది.
వరస్ట్ పర్ఫామర్‌గా జెస్సీ.. జైల్లో బందీ
19 మంది కంటెస్టెంట్లు వారి అభిప్రాయాలు తెలిపిన అనంతరం.. ఎక్కువ ఓట్లతో విశ్వ బెస్ట్ పర్ఫామర్‌గా, జెస్సీని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. బిగ్‌బాస్ ఆదేశం మేరకు వరస్ట్ పర్ఫామర్ అయిన జెస్సీని జైల్లో బందీ చేశారు. తనకు పట్టిన దుస్థితికి అతడు లోలోపలే కుమిలిపోయాడు. అతడి బాధ అర్థమైన హౌస్‌మేట్స్.. అందరం నీ వెనకాలే ఉంటామంటూ ఓదార్చారు. చూస్తుండగానే తొలి వారాంతం వచ్చేసింది.. రేపటి ఎపిసోడ్‌లో నాగ్ ఎవరెవరిని సేవ్ చేస్తాడో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment