బీబీ ఇంటికి దారేది టాస్కులో కొట్లాటలు పుష్కలంగా ఉన్నాయి. అన్నింటికీ మించి కన్నడ టీమ్ మధ్యలోనే ఎక్కువ పోట్లాటలు జరుగుతూ ఉండటం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
పానీపట్టు యుద్ధం గెలిచిందెవరంటే?
బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో భాగంగా ఇచ్చిన పానీపట్టు యుద్ధం టాస్క్ కొనసాంగిపుతో ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ గేమ్‌లో బ్లూ టీమ్ సైడ్ అవగా తర్వాత రెడ్ టీమ్ ఓడిపోయింది. చివరి రౌండ్‌లో ఎల్లో టీమ్‌పై గ్రీన్ టీమ్ విజయం సాధించింది. వీరు బ్లూ టీమ్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ టీమ్ లీడర్ నబీల్ రెండుసార్లు డైస్ వేసి ఒక పాయింట్‌ను తేజకు, మూడు పాయింట్లను తనకు ఇచ్చుకున్నాడు.
నిఖిల్‌తో యష్మి వాదన
పానీపట్టు యుద్ధం గేమ్‌లో తనను విసిరేయడాన్ని గుర్తు చేస్తూ నిఖిల్‌తో గొడవకు దిగింది యష్మి. సంచాలకుడు ఆపేయమని చెప్తున్నా నువ్వు నన్ను వదిలేయలేదు.. అక్కడ నీ శక్తి వాడాల్సిన అవసరం లేదు అని గద్దించి చెప్పింది. దీంతో చిరాకు పడ్డ నిఖిల్.. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయాడు. కానీ ఆ కోపం కాసేపటికే బాధగా కరిగిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండు
యష్మి హగ్ చేసుకోవడానికి వస్తే కూడా నిరాకరించాడు. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఉన్నన్ని రోజులు నేను సోలోగానే ఆడతా.. త్వరగా వెళ్లిపోతే బాగుండనిపిస్తోంది. రిలేషన్‌షిప్ ఏదైనా ఉంటే బయటకు వెళ్లాక చూసుకుందాం అని కఠినంగా చెప్తూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి మాటలకు బాధపడ్డ యష్మి సారీ చెప్పి ఒక్కసారిగా ఏడ్చేసింది.
నా కన్నా నువ్వే ముఖ్యం
మరోవైపు అన్నీ తెలిసిన పృథ్వీ.. నన్నెందుకు నామినేట్ చేయవు అని విష్ణును అడిగాడు. అందుకామె.. నా దృష్టిలో నాకన్నా నువ్వే ఎక్కువ అని బదులిచ్చింది. మరి నేనెందుకు నిన్ను నామినేట్ చేయను? అని అడిగాడు. నువ్వు చేయగలవు, ఎందుకంటే నీకు నువ్వే ముఖ్యం, నేను కాదు.. అని విష్ణు తెలిపింది. అందుకతడు అవునని తలాడిస్తూనే అయినా నేను ఇప్పటికీ నిన్ను నామినేట్ చేయలేదని నవ్వాడు. అందుకు విష్ణు.. అది నీ గ్రేట్ పర్సనాలిటీ అని పొగడ్తలతో ముంచెత్తింది.
మళ్లీ ఏడ్చేసిన నయని
తర్వాత బిగ్‌బాస్ స్లీపింగ్ రేస్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో గెలిచిన బ్లూ టీమ్ గ్రీన్ టీమ్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చింది. హరితేజ డైస్ వేయగా వచ్చిన ఐదు పాయింట్లను నిఖిల్‌కు, మూడు పాయింట్లను అవినాష్‌కు ఇచ్చాడు. ఇకపోతే స్లీపింగ్ రేస్‌లో ఫౌల్ గేమ్ ఆడావంటూ నయనిని పక్కకు తీసుకెళ్లి చెప్పింది రోహిణి. మన టీమ్‌వాళ్లే ఇలా మాట్లాడితే బాధగా ఉంటుందంటూ వెంటనే కన్నీళ్ల ట్యాప్ ఓపెన్ చేసింది.
తేజపై విష్ణు చిరాకు
ఆమె రియాక్షన్ చూశాక రోహిణి.. ఇదంతా కావాలని చేస్తున్నట్లుందని అభిప్రాయపడగా.. ఏదో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం చేస్తోందని ప్రేరణ కూడబలికింది. ఇక అవినాష్, తేజ సరదాగా పొట్టతో గేమ్ ఆడుతుంటే అందుకు విష్ణు ఒప్పుకోలేదు. ఇలాంటి గేమ్స్ వల్ల తేజ ఎనర్జీ పోతుందని, అయినా వినకుండా ఆడతానంటే నెక్స్ట్ గేమ్‌లో తేజను పంపించనని చెప్పింది. సరదాగా ఆడుకుంటే అందులో తప్పేముంది? అంత పెద్ద మాటలనాల్సిన అవసరమేంటని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు.
గంగవ్వ అవుట్
బిగ్‌బాస్ పాయిజన్ యాపిల్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలుపొందింది. వీరికి బిగ్‌బాస్ రెండు ఎల్లో కార్డ్స్ ఇవ్వగా ఆ రెండింటినీ బ్లూ టీమ్‌కు ఇచ్చారు. దీంతో వాళ్లు తమ టీమ్‌లోని గంగవ్వను రేసులో నుంచి తీసేశారు. ఇక యష్మి డైస్ వేయగా వచ్చిన ఒక పాయింట్‌ను గౌతమ్‌కు, రెండు పాయింట్లను ప్రేరణకు ఇచ్చింది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment