చాలా ఏళ్ళ క్రితం తెలుగు శాటిలైట్ టెలివిజన్ చరిత్రలో ఓ వార్తా ఛానల్ వచ్చింది. అందరి కంటే తాము విభిన్నంగా కనిపించాలని వాళ్ళు ఓ వినూత్న ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం వల్ల వాళ్ళు లబ్ధి కూడా పొందారు. అదెలాగంటారా అప్పట్లో ఒక రోజు వున్న అన్ని ఛానళ్ళలో ఓ వార్త ఇలా వుంది.. ఫలానా మంత్రి ఫలాన చోట నడుచుకుంటూ వచ్చారు. కాని ఈ కొత్త ఛానల్ వాళ్ళు ఇచ్చిన వార్త ఏంటంటే...ఫలానా మంత్రి ఫలాన చోట నడుచుకుంటూ తడబడ్డారు. ఇంకేముంది వార్తను చూడనివాళ్ళు కూడా ఆ ఛానల్‌ను ఎగబడి చూశారు. దానితో ఆ ఛానల్ వాళ్ళు దానినే వాళ్ళ సంప్రదాయంగా పెట్టుకుని తమ ఛానల్‌ని లాభాలపాట పట్టిస్తున్నారు.
ఎప్పుడైనా రోడ్డులో ఏదైనా మూల ఓ గొడవ జరిగితే ఆగి చూసే కుతూహలం వున్న మన సమాజం దాన్ని ఆపే ప్రయత్నం ఏ మాత్రం చేయదు సరికదా ఇంకా ఏం జరుగుతుందో అని వేచి చూసే మనస్తత్వం మన ప్రస్తుత సమాజంది. సరిగ్గా దీన్నే మంత్రంగా మలచుకొని బిగ్ బాస్ కార్యక్రమం రూపకల్పన జరిగిందని చెప్పవచ్చు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఎంత రచ్చ జరిగితే అంత వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దానికి నిదర్శనమే ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్. మణికంఠ అనే కంటెస్టెంట్ వీక్షకుల దృష్టిలో ఇంకా హౌస్ లోనే వుండాలి అనే ఓటేస్తే, నాకు ఈ హౌస్ వద్దు, టార్చర్ అంతకన్నా వద్దు అని తానే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు.
అర కొర బట్టలతో, అసభ్య పద దూషణలతో ప్రతిరోజు చూసే ప్రేక్షకుడికి కనువిందు చేస్తూ లోపల వున్న కంటెస్టెంట్స్ తమలో తాము మధనపడుతూ ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నారంటే వారికి నిజంగా హాట్సాఫ్. అలా అని బిగ్ బాస్ కార్యక్రమం మొత్తమ్మీద చెడు అనట్లేదు, మన పండుగల్లో భాగంగా మన సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ కంటెస్టెంట్స్ తో పండుగ ఆచారాలను ప్రేక్షకులకు తెలియజేసేలా చేస్తున్నారు. మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు తెర తీయనిందో ఈ బిగ్ బాస్ విపరీత వినోద వ్యాపారం వేచి చూడాలి. ఏదేమైనా చెడు గ్రహించినంతగా మంచిని చూడలేని ఈ సమాజానికి ఇంతటి భావావేశాలు అవసరమా బిగ్ బాస్ ఆలోచించు.
- ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment