Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది: నిఖిల్‌ | Bigg Boss Telugu 8 Sep 10th Full Episode Review | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది: నిఖిల్‌

Published Wed, Sep 11 2024 7:41 AM | Last Updated on Wed, Sep 11 2024 10:28 AM

Bigg Boss Telugu 8 Sep 10th Full Episode Review

బిగ్‍బాస్ 8 సీజన్‍లో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కానీ, పసలేని పాయింట్లతో ఒకరినొకరు నామినేషన్‌ చేసుకున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అన్నీ సిల్లీ పాయింట్లను తీసుకొచ్చి చిరాకు పుట్టించేలా వారి కారణాలు ఉన్నాయి. బిగ్‌బాస్‌లో ఎంతోకొంత కామెడీ చేసే భాషాని కూడా కామెడీ చేయొద్దని నామినేట్ చేస్తున్నారంటే వారి కారణాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎపిసోడ్‌ చివర్లో కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్‌ షాకిచ్చాడు. ఇంతకూ హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో (సెప్టెంబర్‌ 10) నాటి ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి.

నామినేషన్లతో చిరాకు
బిగ్‌బాస్‌లో రెండు రోజులపాటు నామినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. మొదటిరోజు కొంతమంది లిస్ట్‌లో చేరగా నేటి ఎపిసోడ్‌లో మరికొంతమంది చేరారు. తాజా ఎపిసోడ్‌లో ప్రేరణతో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఫుడ్‌ ప్రిపేర్‌ చేయలేదని పాత టాపిక్‌నే సాగదీస్తూ నిఖిల్‌ని నామినేషన్‌ చేసింది. ఆ తర్వాత సీతను ప్రేరణ నామినేషన్‌ చేసింది. డస్ట్‌బిన్‌ టాపిక్‌నే మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన ప్రేరణ పసలేని వాదానలతో ముగించింది. అయితే, ప్రేరణ లేవనెత్తిన పాయింట్లను సక్సెస్‌ఫుల్‌గా సీత తిప్పికొట్టిందని చెప్పవచ్చు.  ఆ వెంటనే పృథ్వీ నామినేషన్‌ చేసే సమయం వస్తుంది. అతను కూడా సరైన పాయింట్లు లేకుండానే నామినేషన్‌ ముగించాడు. మణికంఠ,నైనికాను పృథ్వీ నామినేషన్‌ చేస్తాడు. అలా హౌస్‌లో అందరూ కూడా చెత్త కారణాలతో నామినేషన్‌ చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించారని చెప్పవచ్చు.

 నేను వెళ్లిపోతా: నిఖిల్‌
నామినేషన్స్‌ ప్రక్రియలో నిఖిల్‌ని నబి నామినేషన్‌ చేస్తాడు. అయితే, నిఖిల్‌ మాత్రం ప్రేరణతో పాటు పృథ్వీని నామినేషన్‌ చేస్తాడు. దీంతో స్నేహితులుగా ఉన్న నిఖిల్‌, పృథ్వీ మధ్య కాస్త వాగ్వాదం పెరుగుతుంది. వాస్తవంగా బిగ్‌బాస్‌లో నిఖిల్‌, పృథ్వీ,సోనియా, అభయ్‌ నవీన్‌ ఒక బ్యాచ్‌గా ఉంటారు. కానీ, నామినేషన్‌లో భాగంగా ఈ బ్యాచ్‌లో కాస్త అలజడి రేగుతుంది. ఈ క్రమంలో నిఖిల్‌ బాదపడ్డారు. తాను తనలానే ఉంటానని, ఎలిమిట్ అయినా సరే తనలో ఎలాంటి మార్పులు రావని చెప్పుకొచ్చాడు. హౌస్‍ నుంచి క్విట్‌ చేసి బయటికి వెళ్లాలనిపిస్తోందని కూడా ఆయన అన్నాడు. కానీ, అలా చేస్తే తనది తప్పు అని అంగీకరించినట్టు అవుతుందని మణికంఠ వద్ద నిఖిల్ చెప్తాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనను తనలా ఉండనివ్వడం లేదని పరోక్షంగా తన బ్యాచ్‌లో ఉండే వారి గురించి నిఖిల్‌ ప్రస్తావిస్తాడు. ఒకప్పుడు తన వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వారే ఇప్పుడు ఫేక్ అంటుంటూ చాలా బాధగా ఉందని నిఖిల్ అంటాడు.  

తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని, డబ్బు అవసరం ఉండటం వల్లే  బిగ్‍బాస్‍కు వచ్చినట్లు చెప్పుకొస్తాడు. అలా అని డబ్బు కోసం ఇలాంటి మాటలు పడాలంటే కాస్త ఇబ్బందిగా ఉందంటాడు. హౌస్‍ నుంచి వెళ్లిపోదామనుకుంటే తనదే తప్పు అనుకుంటారని అందుకే ఆ నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నాడు. 'నిఖిల్ అనే వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వాళ్లు కూడా ఇప్పడు గేమ్ కోసం విమర్శిస్తుంటే బాధగా ఉంది' అని స్టేట్‌మెంట్‌ ఇస్తాడు. సోనియా,పృథ్వీలను ఉద్దేశించే నిఖిల్‌ ఈ కామెంట్లు చేశాడని అర్థం అవుతుంది.

రెండో వారం నామినేషన్‌  లిస్ట్‌లో ఎవరున్నారంటే
బిగ్‍బాస్ 8 రెండో వారం ఎలిమినేషన్ గండంలో  పృథ్విరాజ్,నిఖిల్, మణికంఠ,కిర్రాక్ సీత,విష్ణుప్రియ, పృథ్విరాజ్, ఆదిత్య ఓం, శేఖర్ బాషా ఉన్నారు. అయితే,  పెద్ద క్లాన్‍కు చీఫ్‍గా ఉన్న యష్మికి బిగ్‌బాస్‌ ఒక ఆఫర్‌ ఇస్తాడు. ఎలిమినేషన్‌ లిస్ట్‌లో ఉన్న వారి నుంచి ఒకరిని కాపాడి.. సేవ్‌ అయిన వారిలో ఒకరిని నామినేషన్‌ చేయమని కోరతాడు. దీంతో ప్రేరణను యష్మి కాపాడుతుంది. అప్పటి వరకు సేవ్‌ అయి ఉన్న విష్ణుప్రియ నేరుగా నామినేట్ అయింది. కేవలం యష్మి వల్ల ప్రేరణ సేవ్‌ అయితే.. విష్ణుప్రియ ఎలిమినేషన్‌ గండంలో చిక్కుకుంది.

ఫుడ్‌తో  షాకిచ్చిన బిగ్‌బాస్‌
హౌస్‍లో నామినేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్‌కు బిగ్‍బాస్ షాకింగ్‌ న్యూస్‌ చెప్తాడు.  రేషన్‍తో సహా ఇంటిలోని ఆహార పదార్థాలు అన్నీ స్టోర్‌ రూమ్‌లో ఉంచాలని చెప్తాడు. ఇక నుంచి ఫుడ్‌ కావాలంటే మీరే సంపాదించుకోవాలని సూచిస్తాడు. దీంతో కంటెస్టెంట్స్‌ అంతా నిట్టూర్చారు. అలాంటి సమయంలో కొన్ని నిమిషాల పాటు వారికి ఇష్టమైన ఆహారం తినొచ్చు అని బిగ్‌బాస్‌ ఆఫర్‌ ఇస్తాడు. దీంతో వారికి నచ్చిన ఆహారం అందరూ తినేస్తారు. కానీ, ఆదిత్య ఓం మాత్రం ఏం తినకుండా సోఫాలో కూర్చోని ఉండిపోతాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement