ప్రైజ్‌మనీ గెలిస్తే ఏం చేస్తావ్? ప్రతి సీజన్‌లో అడిగినట్లే ఈ సీజన్‌లోనూ టాప్ 6 కంటెస్టెంట్లను ఇదే ప్రశ్న అడిగాడు నాగార్జున. ముందుగా అవినాష్.. మా అన్నయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన గొప్ప ఆలోచనను బయటపెట్టాడు. మరి మిగతావారు ఏమేం అన్నారు? విష్ణు వెళ్లేముందు ఏం చెప్పిందో తెలియాలంటే నేటి (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!
అందరికీ పంచిపెడతానన్న విష్ణు
నబీల్ ప్రైజ్‌మనీ గెలిస్తే తన కెరీర్‌పై ఇన్వెస్ట్ చేస్తానని, మంచి సినిమా తీస్తానని చెప్పాడు. ప్రేరణ.. నా పేరెంట్స్‌కు ఉన్న అప్పులు తీర్చేస్తా.. మిగిలిన డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడతా అని తెలిపింది. విష్ణుప్రియ.. అభయ్ నవీన్ ఫారిన్ ట్రిప్‌కు రూ.2 లక్షలు, మణికంఠ కారుకు రూ.1.5 లక్ష, గంగవ్వ ఇంటికోసం రూ.5 లక్షలు, పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇలా అందరికీ పంచాలనుకుంటున్నాను అని చెప్పింది.
ప్రైజ్‌మనీతో ఏం చేస్తానంటే?
నిఖిల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నా.. అమ్మానాన్నలకు ఓ ఇల్లు కట్టాలి. ఇప్పటిదాకా నాకోసం ఎంతో ఖర్చుపెట్టిన మా అన్న, తమ్ముడి కోసం ఈ డబ్బు ఉపయోగిస్తాను అన్నాడు. గౌతమ్.. మా అమ్మానాన్న రిటైర్‌మెంట్ కోసం ప్రైజ్‌మనీ వాడతాను. అలాగే గంగవ్వ తన కూతురికి కట్టివ్వాలనుకున్న ఇంటి కోసం రూ.10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను అని తెలిపాడు.
మీ వాడిగా స్వీకరించారు: నిఖిల్
అనంతరం నాగార్జున నిఖిల్‌ను సెకండ్ ఫైనలిస్ట్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా నిఖిల్.. నేను ఆర్టిస్టుగా ఇక్కడికి వచ్చినప్పుడు బయటివాడిని అని కామెంట్స్ చేశారు. కానీ మీరు అది తప్పని రుజువు చేశారు. నన్ను మీ వాడిగా స్వీకరించారు అని ఎమోషనలయ్యాడు. మూడో ఫైనలిస్ట్‌గా గౌతమ్‌ను ప్రకటించాడు. నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రేరణను ప్రకటించగానే ఆమె షాకై, ఆ వెంటనే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.
నిఖిల్‌కు ముద్దుపెట్టిన గౌతమ్
ఈ సీజన్‌లో ఎవరికైనా థాంక్యూ, సారీ చెప్పాలనుకుంటే చెప్పేయమన్నాడు నాగ్. విష్ణుప్రియ.. తనతో స్నేహం చేసిన సీతకు థాంక్యూ.. తెలిసీతెలియకుండా కొన్నిసార్లు బాధపెట్టినందుకు రోహిణికి సారీ చెప్పింది. నబీల్.. ఏదున్నా మణికంఠకు షేర్‌తో చేసుకునేవాడినంటూ అతడికి థాంక్యూ.. ప్రేరణను నామినేట్ చేసినందుకు సారీ చెప్పాడు. నిఖిల్.. నేనెలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేసినందుకు పృథ్వీకి థ్యాంక్స్.. గౌతమ్‌పై నోరు జారినందుకు క్షమించమన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్.. నిఖిల్‌కు బుగ్గపై ముద్దు పెట్టాడు.
థాంక్స్, సారీ.. రెండూ నిఖిల్‌కు చెప్పిన గౌతమ్
అవినాష్.. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన నబీల్‌కు థాంక్స్.. నా ఫ్రెండ్ అయిన విష్ణును నామినేట్ చేసినందుకు సారీ అన్నాడు. గౌతమ్ వంతు రాగా.. ఇప్పటివరకు జరిగిన అన్నింటికీ సారీ అంటూ నిఖిల్‌ను హత్తుకున్నాడు. అలాగే అందరికీ వండిపెట్టినందుకు అతడికి థాంక్యూ చెప్పాడు. ప్రేరణ.. ప్రతీది నబీల్‌కు చెప్పుకుంటానని అతడికి థాంక్యూ చెప్పింది. విష్ణుపై నోరు జారినందుకు క్షమాపణలు తెలిపింది. చివరగా నాగ్.. నబీల్‌ను ఐదో ఫైనలిస్ట్‌గా పేర్కొంటూ విష్ణు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.
గౌతమ్‌పై విష్ణు సెటైర్లు
ఎప్పుడూ గ్రహాలు అంటూ వేదాంతం మాట్లాడే విష్ణుతో అందుకు సంబంధించిన గేమ్ ఆడించాడు నాగ్. ట్రోఫీ అనే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం/ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు. దీంతో విష్ణు.. గౌతమ్ ఆట ఇప్పటికీ తెలియట్లేదు.. అర్జంట్‌గా నువ్వేం ఆడావో చూసేయాలంటూ అతడిని ఐదో స్థానంలో పెట్టింది. అవినాష్‌ను నాలుగు, నబీల్‌ను మూడో స్థానంలో ఉంచింది. ప్రేరణ గెలవాలంటూనే ఆమెను రెండో స్థానంలో పెట్టింది.
డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే
ట్రోఫీకి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నిఖిల్ అంటూ అతడికి విన్నర్ స్థానంలో కూర్చోబెట్టింది. ఈ పిచ్చిపిల్లను, నత్తిబుర్రను ఇన్నాళ్లు భరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు తీసుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే అని ప్రకటించిన నాగార్జున.. ఎపిసోడ్ అయిపోయిన క్షణం నుంచి శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయన్నాడు. మరి నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు గెలవాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేసేయండి.
Comments
Please login to add a commentAdd a comment