గత కొన్నిరోజులుగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఫైనలిస్టులను చివరిసారి ఏడిపించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. మీ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకోమని చెప్పడంతో అందరూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. మరి ఎవరెవరు ఏమేం చెప్పారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణ
షో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని కలవకూడదనుకుంటున్నారో చెప్పమంటూ ఫాలో- బ్లాక్ గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. దాదపు అందరితోనూ కలవాలనుకుంటున్న చెప్పారు టాప్ 5 కంటెస్టెంట్లు. ఎవరిని కలవకూడదన్న విషయానికి వస్తే.. సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ తనను బ్లాక్ చేస్తానంది ప్రేరణ. తక్కువ పరిచయం వల్ల పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేశాడు గౌతమ్. నబీల్.. హరితేజ, సోనియాను బ్లాక్ చేస్తానన్నాడు. నిఖిల్.. బేబక్క, సీతను బ్లాక్ చేశాడు. అవినాష్.. పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేస్తానన్నాడు.
మూడేళ్లు ఇంట్లో ఖాళీగా..
తర్వాత చలిమంట వేసిన బిగ్‌బాస్.. జీవితంలోని బెస్ట్, వరస్ట్ సంఘటనలను పంచుకోమన్నాడు. నబీల్ మాట్లాడుతూ.. బైక్ యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్‌పాలయ్యాను. అదే నా చేదు జ్ఞాపకం అన్నాడు. నిఖిల్ మాట్లాడుతూ.. నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది. చదువు మధ్యలోనే వదిలేశాను. మూడేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. నువ్వు ఇంటికి భారమయ్యావు, నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అని తిట్టింది.
తెలుగు ఇండస్ట్రీకి వచ్చాకే..
తర్వాత కన్నడ సీరియల్‌లో ఆఫర్ వచ్చింది. రోజుకు రూ.2500 ఇస్తామన్నారు. అంటే నెలకు రూ.75వేలు వస్తాయనుకున్నాను. కానీ పదిరోజులే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత తెలుగు సీరియల్ చేశాను. అప్పటినుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాడు. ప్రేరణ నానమ్మ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసింది.
ఏ పాపం చేశానో..
గౌతమ్ మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. కానీ నాతోపాటు నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేస్తే ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయాను అన్నాడు. అవినాష్ మాట్లాడుతూ.. నేను, నా భార్య అను ఎన్నో కలలు కన్నాం. ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పురిటిలోనే చనిపోయాడు. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
యష్మిపై ఫీలింగ్స్?
తర్వాత యాంకర్ సుమ వచ్చి సరదా టాస్కులు ఆడించింది. అలాగే ప్రేక్షకుల మనసులోని ప్రశ్నలను ఫైనలిస్టులను అడిగేసింది. కావాలని స్ట్రాటజీతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకుంటారా? అని గౌతమ్‌ను అడగ్గా అలా ఏం లేదని, దేనికైనా హర్ట్ అయితేనే గొడవపడతానన్నాడు. యష్మిపై నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా లవ్ యాంగిల్ కోసం వేసిన స్ట్రాటజీయా? అని అడగ్గా మొదట్లో కొంచెం ఫీల్ ఉండేది కానీ ఒకసారి అక్క అన్నాక అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.
ఫైర్ తగ్గలేదన్న నబీల్
రాయల్స్(వైల్డ్ కార్డ్స్) వచ్చాక నీలో ఎందుకు ఫైర్ తగ్గింది? అని నబీల్‌ను అడగ్గా.. తనలో ఫైర్ ఎక్కడా తగ్గలేదని, కాకపోతే కొన్నిసార్లు కనిపించకపోయుండొచ్చన్నాడు. పృథ్వీ కాకుండా ఈ ఇంట్లో ఎవరిని ఎక్కువ నమ్ముతారు? అని నిఖిల్‌ను అడగ్గా ఆ రేంజ్‌లో ఎవరినీ నమ్మలేనన్నాడు. సీజన్ 4 లేదా సీజన్ 8లో ఏది బెస్ట్ అని ప్రశ్నించగా అవినాష్ క్షణం ఆలోచించుకోకుండా నాలుగో సీజన్ అని చెప్పాడు.
అక్కడే అసలు గొడవ
నిఖిల్, గౌతమ్.. మీరిద్దరూ ఎందుకు ఎప్పుడూ గొడవపడతారు? అన్న ప్రశ్నకు అభిప్రాయబేధాలు అని ఇద్దరూ బదులిచ్చారు. తర్వాత ఓ టాస్క్‌లో నిఖిల్ గెలవడంతో అతడి తమ్ముడి వీడియో సందేశాన్ని చూపించాడు. అనంతరం ప్రేరణ గెలవడంతో తనకు ఓ ఫోటోఫ్రేమ్ ఇచ్చారు. అలా ఎమోషన్స్, ఆటపాటలతో ఎపిసోడ్ పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment