ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్‌ను వరించింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్
ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్‌బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్‌కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్‌కు బదులు వేరేవారి పోల్‌కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్‌కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.
నేనే గెలిచా: ప్రేరణ
హౌస్‌మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.
నబీల్‌కు బిగ్‌బాస్ కౌంటర్
చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్‌బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.
అయోమయం.. గందరగోళం
ఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.
నబీల్‌కు ఓట్లు అడిగే ఛాన్స్
టర్ఫ్ వార్ అని బిగ్‌బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో చివరివరకు సర్కిల్‌లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్‌ను సెలక్ట్ చేశారు.
ప్రాణం పోయినా సరేనని..
నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్‌బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్‌క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment