టాప్ 5 ఫైనలిస్టుల్లో గౌతమ్, అవినాష్ జర్నీ వీడియోలు అయిపోయాయి. ఈరోజు మిగతా ముగ్గురి వీడియోలు ప్లే చేశారు. మరి బిగ్‌బాస్ వారిని ఏ రేంజ్‌లో పొగిడారో నేటి (డిసెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
మీ మనసు ఒప్పుకోలేదు
ఒక్క బొట్టుతో మొదలై మహానదిగా మారే నదిలా మీ ప్రయాణం సాగింది. ఎన్నో నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. ఎన్నో బంధాలు మీతో చివరివరకు కలిసి నడవలేకపోయాయి. ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. మీరిద్దరూ ఒకరితో ఒకరు, ఒకరికోసం ఒకరు నిలబడ్డారు, ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటను వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు.
రక్తాన్ని చిందించావ్
మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మనసులోనే దాచుకున్నారు. మీరొక స్మార్ట్ గేమర్. మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్‌గా ఉన్నారు. మీ సత్తాను పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి దూకుడు చూపించారు. మీరు నిజమైన జెంటిల్‌మెన్. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ఇంట్లోకి వచ్చినప్పుడు ఓజీ (పాత కంటెస్టెంట్ల)కోసం లీడర్‌లా నిలబడ్డారు. మీకన్నా ఇంటికోసమే ఎక్కువ ఆలోచించారు.
ఆ లోటు నాకు తెలుసు
సరదాకు మీరేం చేసినా హద్దులు దాటలేదు. మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా మీ మనసులోని ఆ ఒక్క లోటు నాకు తెలుసు. మనసుకు దగ్గరైన ప్రతీది మీకు దక్కాలని కోరుకుంటున్నా అంటూ అతడి ప్రియురాలు కావ్య తిరిగి అతడితో కలిసిపోవాలని పరోక్షంగా కోరుకున్నాడు. తర్వాత జర్నీ వీడియోలో నిఖిల్‌కు రాఖీ భాయ్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనన్న నిఖిల్. ఎవరినీ ఆడుకుని, వాడుకుని ఇక్కడిదాకా రాలేదని కుండబద్ధలు కొట్టి చెప్పాడు.
ఆ పట్టుదల వల్లే..
తర్వాత ప్రేరణ వంతు రాగా.. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే ఈ స్థాయిలో నిలబెట్టింది. పసిపాపలాంటి అమాయకత్వం అందరికీ దగ్గర చేసింది. ఓటమిని ఒప్పుకోని తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచులవరకూ తీసుకెళ్లింది. ఆ పట్టుదల వల్లే మెగా చీఫ్ అయ్యారు. కానీ అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తనమన బేధం లేకుండా మెగా చీఫ్‌గా వ్యవహరించారు. కానీ ఇంటిసభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ అయ్యారు.
మనసారా ఏడ్చేసిన ప్రేరణ
అయితే బిగ్‌బాస్ దృష్టిలో మాత్రం మీరు బెస్ట్ మెగా చీఫ్. తప్పు జరిగితే స్నేహితుల్నైనా నామినేట్ చేసేందుకు వెనుకాడలేదు. మీలోని మొండిఘటం మిమ్మల్ని ప్రశ్నించినవారికి చెమటలు పట్టించింది. ఆ లక్షణమే టాప్ 5కు తీసుకొచ్చింది. వివాహితలు కూడా ఎంతో సాధించివచ్చని, మీ ప్రయాణంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారని భావిస్తున్నా.. అంటూ బిగ్‌బాస్ తన జర్నీ వీడియో చూపించాడు. దీన్నంతటినీ ఆస్వాదిస్తూనే మనసారా ఏడ్చేసింది ప్రేరణ.
వరంగల్ కా షేర్ నబీల్
అనంతరం నబీల్ అఫ్రిది గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. వరంగల్ కా షేర్ నబీల్ అన్న పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సుపరిచితం. మీ టాలెంట్, వ్యక్తిత్వాన్ని కోట్లమందికి తెలియజేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేసి ఉన్నతంగా ఆలోచించే గుణానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. మీరు సెల్ఫ్ మేడ్. అందుకే ఆత్మగౌరవం కూడా ఎక్కువే. దాన్ని ప్రశ్నించినవారికి ఆటతోనే ధీటుగా జవాబిచ్చారు.
బలహీనత కాదు బలం
ఈ ఇంటి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు. మీలో ఫైర్ తగ్గిందన్నప్పుడు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించుకున్నారు. మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకుల మధ్య ఒక సామాన్యుడిలా ఒంటరై నిల్చున్నట్లు మీకనిపించింది. కానీ అది మీ బలహీనత కాదు మీ బలం అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసి నబీల్ ఓపక్క సంతోషిస్తూనే మరోపక్క కంటతడి పెట్టుకున్నాడు. మొత్తానికి అందరి జర్నీ వీడియోలు పూర్తయ్యాయి. ఇక విన్నర్‌ను తేల్చడం మాత్రమే మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment