
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

హీరోగా నబీల్
నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్‌లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్‌ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్‌తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్‌లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.

సీత హీరో, మణి జీరో
ఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్‌కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్‌ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్‌లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు.

చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?
నా ఆట నేనే ఆడతా
సోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్‌ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్‌ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్‌ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్‌లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.

నాగ్‌తో వాదించిన సోనియా
అందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్‌నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్‌లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్‌లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది.

ఇది జోక్ కాదు
విష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.

యష్మిపై ఫైర్
అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్‌పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్‌గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!








Comments
Please login to add a commentAdd a comment