తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది.
ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది.
ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్‌లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.
ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు.
1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.
2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.
3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.
4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.
5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్వర్క్‌లను బలోపేతం చేయడం.
ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..
సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.
స్వీయ అవగాహన (Self-Awareness)
మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.
స్వీయ నియంత్రణ (Self-Regulation)
పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు.
దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.
సహానుభూతి (Empathy)
నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.
సామాజిక నైపుణ్యాలు (Social Skills)
ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్‌లెస్', 'యూజ్‌లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.
ప్రేరణ (Motivation)
అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.
ఎవరు ఎలిమినేట్ కావచ్చు?
ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.
నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment