పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని బాంబు పేల్చిన బిగ్‌బాస్.. వాటిని వీలైనంతవరకు తగ్గించవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు. కానీ అందులో మూడు మాత్రమే గెలవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్యను తొమ్మిది వరకే నరుక్కుంటూ రాగలిగారు. ఈ ఛాలెంజ్‌ల మధ్యలో బోలెడు గొడవలు. అవేంటో నేటి (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
అదుర్స్ అనిపించిన నబీల్, పృథ్వీ
వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు బిగ్‌బాస్ మూడో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో నబీల్, పృథ్వి పోటీపడ్డారు. పావుగంటసేపు బెలూన్ పగలకుండా చూసుకోమంటే వీళ్లు ఏకంగా మూడుగంటలకుపైగా అలానే ధ్వజస్థంభాల్లా నిలబడి ఔరా అనిపించారు. ఈ గేమ్‌లో పృథ్వి (శక్తి) టీమ్ విజయం సాధించడంతో 11 మందిలో ఒక వైల్డ్‌కార్డ్ ఎంట్రీని అరికట్టారు. అంతేకాదు, అవతలి టీమ్‌లో నుంచి ఒకరిని గేమ్‌లో నుంచి తీసేసే పవర్‌ను శక్తి టీమ్‌కు ఇచ్చాడు.
చిల్లర గేమ్..
దొరికిందే ఛాన్స్ అనుకున్న శక్తి క్లాన్.. కాంతార టీమ్‌లో నుంచి నబీల్‌ను అవుట్ చేసింది. బాగా ఆడే వ్యక్తిని ఎలా గేమ్‌లో నుంచి తీసేస్తారని కాంతార టీమ్ ఉడికిపోయింది. చిల్లర గేమ్ ఆడుతున్నారని ప్రేరణ మండిపడింది. సీత అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కలిసి ఆపుదామనుకున్నాక మళ్లీ నీ టీమ్ కోసం స్వార్థంగా ఆలోచించావని నిఖిల్‌ను తప్పుపట్టింది. విష్ణుప్రియ అయితే.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువైంది.. అలా అని ఆడవాళ్లను తక్కువ చేయట్లేదు అంటూనే నిఖిల్ మీద సెటైర్లు వేసింది.
బలవంతమైన త్యాగం!
అసలు శక్తి టీమ్‌లో మణిని ఎలా సైడ్ చేశారన్న డౌట్ ప్రేరణకు వచ్చింది. అదే ప్రశ్నను ముక్కుసూటిగా అడగ్గా మణికంఠయే స్వయంగా త్యాగం చేశాడని సోనియా అంది. అందుకు మణి.. అది నిజం కాదంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో శక్తి టీమ్ బిక్కముఖం వేసింది. మన టీమ్‌లోని ముగ్గురు నేను సైడ్ అవ్వాలని కోరుకున్నారు. అందుకే నేను కూడా పక్కకు తప్పుకున్నానే తప్ప నా అంతట నేనుగా త్యాగం చేయాలనుకోలేదని మణి క్లారిటీ ఇచ్చాడు.
కన్నీళ్లు పెట్టుకున్న మణికంఠ
అయినా వెనక్కు తగ్గని సోనియా, యష్మి .. అప్పటిదాకా త్యాగం అని చెప్పి ఇప్పుడేమో మాట మార్చేశాడంటూ నోరేసుకుని పడిపోయారు. నీ వయసెంత? చిన్నపిల్లాడిలా ప్రవర్తించకు. ఎవర్నీ బ్యాడ్ చేయొద్దంటూ యష్మి వార్నింగే ఇచ్చింది. దీంతో ఎమోషనలైన మణి.. తప్పంతా నాదే! ఇకమీదట నోరు మూసుకుని కూర్చుంటాను అంటూ ఎమోషనలయ్యాడు. వీళ్ల అరుపులతో పసిపిల్లాడిలా భయపడిపోయిన మణికంఠ.. మాట్లాడాలంటేనే భయమేస్తోందంటూ ఏడ్చేశాడు.
ధైర్యం నూరిపోసిన నబీల్
అతడి బాధను అర్థం చేసుకున్న నబీల్.. ఎవరికీ భయపడాల్సిన పని లేదు, నీకు మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడాలంతే. అని తనకు ధైర్యం చెప్పాడు. ఇక బిగ్‌బాస్ రంగురంగుల పజిళ్లు అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో ఏ టీమ్ గెలవకలేకపోయింది. నచ్చిన స్టెప్పులేసుకోండి అంటూ ఐదో ఛాలెంజ్ ఇవ్వగా ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలుపొందింది. దీంతో 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కాస్తా తొమ్మిదికి చేరాయి.
9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా..
అప్పుడే బిగ్‌బాస్ ఓ బాంబు పేల్చాడు. ఇంతటితో ఛాలెంజ్‌లు పూర్తయ్యాయని, ఇప్పటివరకు మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మాత్రమే ఆపగలిగారని చెప్పాడు. అంటే ఇంకా తొమ్మిదిమంది హౌస్‌లోకి వచ్చేస్తున్నారని హౌస్‌మేట్స్ గుండెల్లో గుబులు పుట్టించాడు. వీరిలో ఆరేడుగురు మాజీ కంటెస్టెంట్లు కాగా మరో ఇద్దరు ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయినవారితో రీఎంట్రీ ప్లాన్ చేయిస్తున్నట్లు టాక్!
Comments
Please login to add a commentAdd a comment