క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉంది. అలాగే రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది.
అమాయక జనాలను మోసం చేసి
బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు.
ఇప్పటికీ తనవద్దే బిట్‌కాయిన్లు
ఈ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ మోసం వెనక ఉన్న మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్(ఈయన 2022లోనే చనిపోయారు) గతంలో రాజ్‌కుంద్రాకు 285 బిట్‌కాయిన్లు ఇచ్చాడు. దీనితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావించాడు. ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, దాని విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను జప్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment