
సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో పీకలదాకా మునిగిపోయి, పోలీసు కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాపై బీజేపీ నేత రామ్ కదం ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. ఒక మోడల్‌ని శారీరకంగా వేధించడమేకాకుండా, ఆన్‌లైన్ గేమ్ పేరుతో దాదాపు 3 వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆన్‌లైన్ గేమ్‌తో లక్షలాది మంది ప్రజలను మోసగించారని, దీని ప్రమోషన్ కోసం నటి శిల్పా శెట్టిని వాడుకున్నాడంటూ ఆయన మండిపడ్డారు.
ముంబైలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదం మాట్లాడుతూ, ఈఏడాది ఏప్రిల్ 14 న జుహు పోలీస్ స్టేషన్‌లో రాజ్‌కుంద్రాపై ప్రముఖ మోడల్, కమ్-నటి శారీరక వేధింపుల ఫిర్యాదు చేసిందనీ, పోలీసులు కేసు నమోదు చేయక పోగా, ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆమెపై ఒత్తిడి తెచ్చింది ఎవరు, కుంద్రాపై చర్యలు ఎందుకు తీసుకోలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ‘గేమ్ ఆఫ్ డాట్’అనే ఆన్‌లైన్ గేమ్‌ను ప్రారంభించి, సామాన్య జనంనుంచి వేల కోట్లు వసూలు చేసిందని రామ్ ఆరోపించారు. భార్య, నటి శిల్పా శెట్టి ఫోటో ద్వారా ఆన్‌లైన్ గేమ్ కోసం జనాన్ని ఆకర్షించాడని విమర్శించారు. ప్రభుత్వం గుర్తింపున్న ఆన్‌లైన్ గేమ్ అని చెప్పి వయాన్ ఇండస్ట్రీస్ రూ .2500 నుండి 3000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్నారు. ఇలా దేశవ్యాప్తంగా అనేకమంది మోసపోయారన్నారు. డిస్ట్రిబ్యూటర్లు అనేకమంది రూ. 30 లక్షలు, మరికొందరు 10 లక్షలు వరకు నష్టపోయారని పేర్కొన్నారు. దీన్ని ప్రశ్నించిన వారిపై దాడి చేశారని బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేశారని రామ్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయం కోసం తాము హోంమంత్రి, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగరాలేను కలుస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment