హిందీ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా అరుదు. తెలుగు దర్శకులు హిందీకి వెళ్లడం కూడా అరుదే. అయితే ఇప్పుడు ఒకేసారి ఐదుగురు దర్శకులు హిందీ చిత్రాలు చేస్తున్నారు. హిందీ పరిశ్రమ మనవాళ్లకు ‘స్వాగ్ సే స్వాగత్’ పలికింది. అంటే... ఆత్మీయ స్వాగతం పలికింది. ఆ ఆహ్వానం అందుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం.
తెలుగులో వీవీ వినాయక్ స్టార్ డైరెక్టర్. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. తొలి సినిమా ‘ఆది’ (2002)తోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్న వీవీ వినాయక్ ఆ తర్వాత ‘దిల్’(2003), ‘ఠాగూర్’(2003), ‘బన్నీ’(2005), ‘కృష్ణ’ (2008) ‘అదుర్స్’ (2010), ‘ఖైదీ నంబరు 150’ (2017) వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు హిందీ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ఆయన దర్శకుడిగా బీ టౌన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఇటు సాయి శ్రీనివాస్‌కు కూడా హిందీలో ‘ఛత్రపతి’యే తొలి సినిమా కావడం విశేషం.
ఇక ‘అర్జున్‌రెడ్డి’ (2017) సక్సెస్‌తో డైరెక్టర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కభీర్ సింగ్’ (2019)గా రీమేక్ చేసి, బాలీవుడ్‌లోనూ నిరూపించుకున్నారు. ఇప్పుడు హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు సందీప్.
మరోవైపు తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సాధించి ఇండస్ట్రీ దృష్టిని వెంటనే తన వైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా బీ టౌన్ దర్శకుల లిస్ట్‌లో చేరారు. విద్యుత్ జమాల్ హీరోగా‘ఐబీ 71’ అనే స్పై థ్రిల్లర్‌ను తీయనున్నారు సంకల్ప్. జాతీయ అవార్డు సాధించిన మరో తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా హిందీకి హాయ్ చెబుతున్నారు.
‘మళ్ళీ రావా’(2017) వంటి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల మెప్పు పొందిన గౌతమ్ 2019లో నానీతో తీసిన ‘జెర్సీ’కి జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరియే దర్శకుడు. ఈ ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వక్ సేన్ ‘హిట్’ (2020) చిత్రంతో దర్శకుడిగా హిట్టయ్యారు శైలేష్ కొలను. తెలుగు ప్రేక్షకులు ‘హిట్’ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు.
ఈ సినిమాకు శైలేష్ కొలనుయే డైరెక్టర్. ఇందులో రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. ప్రముఖ సంగీత దర్శకులు యం.యం. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా పరిచయమైన చిత్రం ‘మత్తువదలరా’ (2019)తో దర్శకుడిగా పరిచయమయ్యారు రితేష్ రాణా. ఈ చిత్రం హిందీ రీమేక్‌తో దర్శకుడుగా రితేష్ బీ టౌన్‌లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్‌కు డైరెక్షన్ మార్చారు. ఇదిలా ఉంటే.. ఈ దర్శకులందరూ హిందీలో డైరెక్ట్ సినిమా ద్వారా పరిచయమవుతుంటే, ప్యాన్ ఇండియన్ సినిమాల ద్వారా మరికొందరు హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment