ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సింగమ్ ఎగైన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మన ఇతిహాసాలలో గొప్ప విలువలతో కూడుకున్న కథ రామాయణం. నాటి రామాయణాన్ని నేటి నేటివిటీతో ప్రస్తుత ప్రముఖ నటీనటులతో మళ్లీ మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ఇదే ప్రయత్నాన్ని గతంలో చాలా మందే చేసినా యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘సింగమ్’ సిరీస్ చిత్రానికి ఈ తరహా ప్రయోగం చేయడం మొదటిసారి. అందులోనూ బాలీవుడ్‌లో భారీ తారాగణంతో ఇలాంటి అంశంతో కూడిన కథ తీయడమనేది నిజంగా సాహసమనే చెప్పాలి. ముందుగా ‘సింగమ్’ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం ‘సింగమ్ ఎగైన్’. సిరీస్‌లో ఈ భాగం ప్రేక్షకుల ముందు రావడా నికి దాదాపు పదేళ్లు పట్టింది. 2011లో ‘సింగమ్’ మొదటి చిత్రం రాగా 2014లో రెండో భాగంగా ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైంది. ఆ తరువాత మూడో భాగం 2024లో ‘సింగమ్ ఎగైన్’గా వచ్చింది.
అన్ని సిరీస్‌లలో కథానాయకుడిగా ప్రముఖ స్టార్ అజయ్ దేవగన్ నటించారు. ఇకపోతే ప్రస్తుత ‘సింగమ్ అగైన్’ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు కరీనా కపూర్, దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ తదితర ప్రముఖ నటులు నటించారు. రామాయణ కథనే ఇతివృత్తంగా అల్లుకున్న కథ ఇది. రామాయణంలోని పాత్రలను రిలేట్ చేస్తూ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ స్క్రీన్‌ప్లే కొనసాగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమాలో రామాయణ కథను టీవీ షో రూపంలో చూపిస్తూ కథను నడిపిస్తారు. అప్పటి రామాయణ కథ చరిత్రతో మనకు పరిచయం.
అందుకే అది రమణీయ కావ్యం. కానీ ఇప్పటి ‘సింగమ్ ఎగైన్’ రణరంగమే ప్రధాన సూత్రంగా నడిచిన కథ. ఆఖరుగా ఒక్క మాట... రామాయణ కథను నేటి తరానికి మళ్లీ చెప్పడమనేది మంచిదే కానీ, ఎన్నో భావావేశాలున్న రామాయణ మూల కథలోంచి ఒక్క శౌర్య, వీర రసం మాత్రం తీసుకుని సినిమా రూ΄పొందించడం ఏమాత్రం సమంజసమో సినిమా తీసిన దర్శక–నిర్మాతలు, చూస్తున్న మనలాంటి ప్రేక్షకులు ఆలోచించాల్సిందే. ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మీరు కూడా చూసి ఆలోచించడం మొదలు పెట్టండి. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment