సాక్షి, హైదరాబాద్: మోతాదుకు మించి మద్యంతాగి బస్తీల్లో అదుపుతప్పిన వేగంతో కారును నడుపుతూ రోడ్డు పక్కన వాహనాలను ఢీకొట్టిన ఘటనలో సినీనటుడు దాసరి అరుణ్‌కుమార్(47)పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–71లో నివసించే దాసరి అరుణ్‌కుమార్ బుధవారం సాయంత్రం తన మారుతి స్విఫ్ట్ కారులో ఫిలింనగర్ క్లబ్‌కు షటిల్ ఆడేందుకు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్నేహితుడు ప్రశాంత్ మరొకరితో కలిసి రాత్రి 11 గంటల వరకు మద్యం సేవించాడు.
కొంతకాలంగా మద్యం సేవించిన అనంతరం మత్తులో తన ఇంటిదారి మరిచిపోతున్నాడని కుటుంబ సభ్యులు తెలుపడంతో స్నేహితులు రాత్రి మద్యం తాగిన తర్వాత అరుణ్‌కుమార్ కారు ఎక్కగానే వెనుకాల అనుసరిస్తూ వెళ్లారు. అయితే కొద్దిదూరం వెళ్లేసరికి అరుణ్‌కుమార్ కారును స్పీడ్‌గా బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 వైపు పోనిచ్చాడు. వెనుకాల స్నేహితులు గుర్తించే లోపే కారును అదుపుతప్పిన వేగంతో తీసుకెళ్తూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 కమాన్‌లోపల సయ్యద్‌నగర్ బస్తీలోకి వెళ్లాడు. 11.20 గంటల ప్రాంతంలో సయ్యద్‌నగర్‌బస్తీలో రోడ్డు పక్కన ఆపిన ఐదు వాహనాలను ఢీకొట్టాడు. ఒక్కసారిగా అధిక శబ్ధం, వాహనాలను ఢీకొడుతున్న శబ్ధాలతో స్థానికులు అక్కడికి పరుగులు తీసి చాకచక్యంగా అరుణ్ నడుపుతున్న కారును ఆపారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు అరుణ్ ప్రయత్నించగా స్థానికులంతా చుట్టుముట్టి కారును ఆపారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు నడుపుతున్న వ్యక్తి సినీహీరో దాసరి అరుణ్‌గా గుర్తించారు. అదే రాత్రి అరుణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కారు సీజ్ చేశారు. వెంటనే మద్యం మోతాదు పరీక్షలు నిర్వహించగా 405 బీఏసీగా తేలింది. బాధితులు సయ్యద్ అఫ్జల్‌అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 279, 336, ఎంవీ యాక్ట్ 185 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అట్రాసిటీకేసుపై విచారణ
దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గత ఏడాది ఆగస్టు 16వ తేదీన నమోదైంది. ఈ కేసులో విచారణ నిమిత్తం గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల పాటు ఆ కేసుకు సంబంధించి విచారణ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment