శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించి కాసులను సొమ్ము చేసుకుంటాయి. మరికొన్ని ఫ్లాపులను మూటగట్టుకొని పోతాయి. అందుకే శుక్రవారం నిర్మాతకు టెన్షన్ డేగా మారుతుంది. గత వారం టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు.. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్, లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ శుక్రవారం (మార్చి 19)కూడా పలు భారీ చిత్రాలు విడుదల కాబోతుంది. మంచు విష్ణు ’మోసగాళ్ళు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, ఆది సాయికుమార్ ‘శశి’ తో పాటు ‘ఇదే మా కథ’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’లాంటి చిన్న సినిమా కూడా శుక్రవారం విడుదల అవుతున్నాయి.
ఐటి స్కామ్ నేపథ్యంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మోసగాళ్లు’. ఇందులో కాజల్, మంచు విష్ణు అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించి ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల అవుతుంది.
యంగ్ హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా’. గీతాఆర్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్త కోల్పోయిన వితంతువుగా కనిపిస్తోంది. హీరో కార్తికేయ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తుంటారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఒక విచిత్రమైన ప్రేమకథా నేపథ్యంలో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కుతోంది.
ప్రేమ కావాలి ఫేమ్ ఆది హీరోగా నటించిన చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు రూపొందించిన ఈ చిత్రంలో ఆది సరసన సురభి నటిస్తున్నారు. ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్ ఎలా మారతాయి? అనే అంశాలతో ‘శశి’ సినిమా తెరకెక్కింది. మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment