
చెన్నై: పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని నటి చాందిని మాజీ మంత్రి మణికంఠన్‌పై శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మణికంఠన్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్ల పాటు తనతో సహజీవనం చేసినట్లు తెలిపారు. తాను గర్భం దాల్చగా దానిని తొలగించమని బలవంతం చేసినట్లు చెప్పారు. అలా మూడుసార్లు గర్భాన్ని తీయించుకున్నట్లు తెలిపారు. తాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తన కుటుంబంపైనా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మణికంఠన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని..ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆమె ఎవరో నాకు తెలియదు– మాజీ మంత్రి
నటి చాందిని ఫిర్యాదుపై మాజీ మంత్రి మణికంఠన్ స్పందించారు. చాందిని ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది తనను కలిశారన్నారు. అదే విధంగా నటి చాందిని కూడా తనను కలిసి ఉండొచ్చని తెలిపారు. అప్పుడు తనతో తీసుకున్న ఫొటోలు చూపించి తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులే చాందినిని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనిచేయిస్తున్నారని అన్నారు. మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి చాందినితో కలిసున్న ఫొటోలు తమ వద్ద ఉన్నాయని.. ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. అందుకు తాను అంగీకరించలేదన్నారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు.
చదవండి: గర్భవతిని చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ
Comments
Please login to add a commentAdd a comment