రాజధాని ‘ఫెయిల్స్‌’.. బాబు ‘భ్రమరావతి’ | ChandraBabu Naidu Promoting Rajdhani Files, But No Response From Audience | Sakshi
Sakshi News home page

రాజధాని ‘ఫెయిల్స్‌’.. బాబు భ్రమరావతి

Published Sat, Feb 17 2024 2:39 PM | Last Updated on Sun, Feb 18 2024 7:12 AM

ChandraBabu Naidu Promoting Rajdhani Files, But No Response From Audience - Sakshi

ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు... అని చెబుతున్నట్లే రియాలిటీకి ఏ మాత్రం సంబంధం లేకుండా వచ్చిన రాజధాని ఫైల్స్‌ను చంద్రబాబు భుజానికి ఎత్తుకుంటున్నాడు. కనీసం అమరావతికి దగ్గర్లో ఉన్న గుంటూరు థియేటర్స్‌కు కూడా ప్రేక్షకులు పోవడం లేదు. సినిమా రన్‌ కాగానే ఎంతమంది ఉన్నారో చూస్తే పట్టుమని పదిమంది కూడా థియేటర్‌లో కనిపించడం లేదు. ఈ సినిమా తెలుగుదేశం తమ్ముళ్లకే కాదు కనీసం అమరావతి రైతులకు కూడా కనెక్ట్ కాలేదని దీంతోనే తేలిపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు తాజాగా ఈ ఫెయిల్స్‌ సినిమా చూడండి. అందులో మన హరికథలు బాగా చెప్పామంటూ డైరెక్ట్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 

అమరావతి భూముల ఇష్యూలో నిత్యం పచ్చ మీడియాలో వచ్చే కథనాలే ఒక చోటుకు చేర్చి ప్రజల మీదికి ఈ సినిమాను వదిలాడు చంద్రబాబు.  వాస్తవాలను మరచి అసత్యాలు, అబద్దాలను చేర్చి  వెండితెర సాక్షిగా సరికొత్త విషప్రయోగాన్ని చంద్రబాబు ప్రయోగించాడు. అమరావతి రైతులు నష్టపోయిందే చంద్రబాబు వల్ల.. ఆ విషయాన్ని దాచి అమరావతిలోని తన పెత్తందార్లతో ఉద్యమాన్ని నడిపించాడు.  అమరావతి ప్రాంతంలో  చంద్రబాబు, ఆయన బ్యాచ్‌ పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిందని, రాజధాని ప్రకటన సమాచారం ముందే తెలుసుకుని భూములు కొనుగోలు చేసి అక్రమాలకు తెగించారని రాష్ట్రం అంతటా తెలుసు. మరీ ఈ ఫెయిల్స్‌ సినిమాలో ఇవి ఎందుకు కనిపించలేదు చంద్రబాబు..? ఒకసారి ఆ జ్ఞానం లేని డైరెక్టర్‌ గారిని అడగాల్సింది. అసలు భూముల పేరుతో అమరావతిలో కుట్రలకు, దారుణాలకు తెర లేపింది చంద్రబాబు కాదా..? ఎల్లో మీడియాలో రోజూ వచ్చే కథనాలే నిజం అనేలా ఇలా మళ్లీ సినిమా పేరుతో ప్రజలపై రుద్దడం ఎందుకు.

♦ వాస్తవానికి  ఈ సినిమా చుట్టూ రైతుల భూముల గురించే ఉంది. కానీ రాజధాని నిర్మాణ వైఫల్యంపై ఎందుకు ఫోకస్ చేయలేదు. అలా చే​​​​స్తే అది చంద్రబాబుకూ వ్యతిరేకం అవుతుంది కాబట్టి.. చంద్రబాబు 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్‌లతో కాలం గడిపి అమరావతిలో తనకు సంబంధించిన వారికే భూములు కట్టబెట్టి తన చూట్టూ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు మాదిరి ఒక కోటరీనే ఏర్పరుచుకున్నాడు. ఇవన్నీ తెలుసుకున్న జనాలు ఆయన్ను ఓడగొట్టడంతో ఆ కోట​ కాస్త బద్దలైంది. అప్పటి నుంచి అమరావతి భూములపై ఎల్లో మీడియా చెప్పే కథలే ఈ రాజధాని ‘ఫెయిల్స్‌’లో అతుకులబొంతలా ఉన్నాయి.

♦ అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్‌ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టింది టీడీపీ పెద్దలే అన్న విషయం ఈ ఫెయిల్స్‌ సినిమా డైరెక్టర్‌కు గుర్తుకు రాలేదేమో...  చంద్రబాబుతో మొదలు పెడితే లోకేశ్‌,నారాయణ  , గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఇలా చాంతాడంత లిస్ట్‌ ఉంది.​ అమరావతి ప్రకటనకు ముందు వీళ్లకు అక్కడ భూములు ఉన్నాయా..? ఉన్నాయని ఒక్కరైతుతో అయిన చెప్పించగలరా..? అమరావతి పేద రైతుల ఆశలపై నీళ్లు చల్లింది చంద్రబాబు అని అక్కడున్న వారందరికీ తెలుసు. అమరావతి పేద రైతులను చంద్రబాబు మంచి చేసి ఉంటే అదే ప్రాంతంలో నారా లోకేష్‌ ఎందుకు దారుణంగా ఓడిపోతాడు.. మళ్లీ ఈసారి ఎక్కడ పోటీ చేస్తాడో ఆయనకే క్లారిటీ లేదు. వీళ్ల మోసాల గురించి ప్రతి అమరావతి పేద రైతుకు తెలుసు.. అందుకే వారి వెంట పెత్తందార్లు మాత్రమే ఉద్యమం పేరుతో నడిచారు. ఇవన్నీ ఈ రాజధాని ఫెయిల్స్‌ సినిమాలో ఎందుకు లేవో చెప్పగలరా..?

టీడీపీ సర్కార్‌ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన లీకుల మేరకు ఆయన, ఆయన బినామీలు, మంత్రుల బినామీల ద్వారా రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కాజేశారు. జూన్‌ 1, 2014 నుంచి డిసెంబర్‌ 31, 2014 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్‌లు పరిశీలించాక.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా 4,069.94 ఎకరాలను కొల్లగొట్టారు. ఇదంతా ఎలా జరిగిందో సినిమాలో చూపించాల్సింది.

♦ మాజీ మంత్రి నారాయణ.. తన వద్ద పనిచేసే అవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల, కోతపు వరుణ్‌కుమార్‌ల పేర్లతో 55.27 ఎకరాల భూమిని కొన్నారు. నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్‌ పేరిట 38.84 ఎకరాల భూమి.., అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తన బినామీ సంస్థ అభినందన హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరు రవికుమార్‌ ప్రసాద్‌ ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, గోష్పాద గ్రీన్‌ ఫీల్డ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ ట్రెండ్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ పేరిట 62.77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. భూసమీకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూముల కేటాయింపులోనూ టీడీపీ సర్కార్‌ అక్రమాలకు పాల్పడింది. రాజధాని ప్రాంతంలో 850 ఎకరాల భూములను సన్నిహితుల సంస్థలకు చంద్రబాబు ధారాదత్తం చేసినట్లు లెక్కలున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే.

♦ రాజాధాని ఫైల్స్‌లో శివరామకృష్ణ కమిటీతో పాటు కాగ్‌ ప్రస్తావనే లేదు.. కానీ వారికి నచ్చిన నారాయణ కమిటీ రిపోర్ట్‌ను మాత్రం కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్‌.. అసలు అమరావతి గురించి శివరామకృష్ణ కమిటీ కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. వాటిని పట్టించుకోకుండా బాబుగారి ఇన్నర్‌ గేమ్‌ను వెండితెరపై చూపించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డాడు డైరెక్టర్‌.

రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ గుదిబండే అని కాగ్‌ హెచ్చరించింది. అంతేకాకుండా అమరావతిలో పేదలు, రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ అక్రమాల జరిగాయని గుర్తించింది. అంతేకాకుండా అమరావతి విషయంలో శివరామకృష్ణ కమిటీ కీలంకంగా వ్యవహరించింది. ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదని శివరామకృష్ణ కమిటీ తేల్చింది. ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని తెలిపింది. విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలని కోరింది. రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. ఇవన్నీ సినిమాలో చూపించకుండా నారాయణ కమిటీ గురించి మాత్రమే చెబితే ఎలా డైరెక్టర్‌ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

♦ అమరావతి గ్రామాలలో అసైన్డ్‌ భూముల కుంభకోణం జరిగిందన్నది పచ్చి నిజం. ఈ విషయం చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. ఇంతటి దారుణమైన పాపానికి ఒడిగట్టిన చంద్రబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి సూపర్‌ హిట్‌ భాగాన్ని సినిమా కథలో ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు హయాంలో దళితుల నుంచి అసైన్డ్‌ భూములను వారికి కొంత ధర చెల్లించో, భయపెట్టో, లేక రకరకాల సందేహాలు రేపి దళితేతరులు స్వాధీనం చేసుకున్నారన్నది నిఖార్సైన వాస్తవం. 2015 ప్రారంభం నుంచి రాజధాని నిర్మాణం పేరుతో భూసమీకరణ  ప్రారంభించారు. అప్పుడు పట్టా భూములకే పరిమితం అయ్యారు. కానీ 2016 ఫిబ్రవరిలో అసైన్డ్‌ భూములను కూడా తీసుకుంటామని జీఓ 41 తెచ్చారు.

ఈ మధ్యకాలంలోనే పలువురు టీడీపీ నేతలు, ఇతర వ్యక్తులు ఈ భూములను 95 శాతం వరకు కొనుగోలు చేశారు. వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నది నిజం కాదా..? సినిమాలో ఇవన్నీ ఎందుకు లేవు. ఇలా అమరావతి భూముల విషయంలో చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ చేసిన మోసాల గురించి చెప్పుకుంటూ పోతే 100 అసలైన రాజధాని ఫైల్స్‌ సినిమాలు తీయవచ్చు అనేది నిజం. సినిమా పేరుతో అసలు నిజాలు దాచి వదిలితే నమ్మే రోజులు పోయాయని ఈ ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి తెలిసినట్లు లేదు.  అందుకే ఇప్పుడు ఆ సినిమాను నెటిజన్లు ట్రోల్‌ చేస్తూ నవ్వుకుంటున్నారు. 

డైరెక్టర్‌ భానుతో పాటు చంద్రబాబుకు వీటికి సమాధానం చెప్పగలరా?

►అసలు రాజధాని ఎక్కడ పెట్టమని కేంద్రం చెప్పింది?

►ప్రభుత్వ భూములు ప్రకాశం జిల్లాలో ఉన్నాయని చెప్పినా.. బాబు ఎందుకు వినలేదు?

►కృష్ణా నది తీరం పంటలకు అనువైన భూమి, రాజధాని కట్టడం వల్ల కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతుందని చెప్పినా పెడచెవిన ఎందుకు పెట్టారు?

►కృష్ణా నదిని ఆక్రమించి కట్టిన కరకట్ట ఇంట్లో బాబు ఎందుకు ఉంటున్నాడు?

►క్విడ్‌ ప్రో కోలా ఎక్కడ రాజధాని వస్తుందో ముందే తన పార్టీ నేతలకు చెప్పించి భూములు ఎలా కొనిపించాడు?

►పొలాలు ఇవ్వని రైతుల పంటలు తగులబెట్టిందెవరు?

►ఇంత చేస్తే బాహుబలి సినిమాలోలా గ్రాఫిక్స్‌ భ్రమరావతిని ఎందుకు చూపించారు?

►ఇంకెన్నాళ్లు రాజధాని పేరు చెప్పి మోసం చేస్తారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement