‘యాస’కు సై అంటున్న టాలీవుడ్‌ స్టార్స్‌ | Chiranjeevi To Adivi Sesh Tollywood Stars Focus On Accent | Sakshi
Sakshi News home page

‘యాస’కు సై అంటున్న టాలీవుడ్‌ స్టార్స్‌

May 30 2025 3:11 PM | Updated on May 30 2025 3:28 PM

Chiranjeevi To Adivi Sesh Tollywood Stars Focus On Accent

తెలుగు చిత్ర పరిశ్రమలో యాస మారుతోంది. గతంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్‌ ఆర్టిస్ట్స్‌ కూడా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేలా సాధారణ యాసలో డైలాగులు చెప్పేవారు.  కానీ, ఇప్పుడు అలా కాదు. చిత్రకథ ఏ ప్రాంతీయ నేపథ్యంలో సాగుతుందో అక్కడి యాసని పలికేందుకు నటీనటులు సై అంటున్నారు.  రాయలసీమ, కోస్తా, తెలంగాణ, ఆంధ్ర... ఇలా ప్రాంతం ఏదైనా అక్కడి నేటివిటీకి తగ్గట్టు యాస నేర్చుకుని, తమదైన శైలిలో డైలాగులు చెబుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నారు. ఇలాంటి చిత్రాలని ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటంతో మేకర్స్‌ కూడా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మన హీరోలు  పలుకుతున్న యాస విశేషాలేంటో చూద్దాం...  

రాయలసీమ నేపథ్యంలో...  
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుండగానే ‘మెగా 157’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాకి శ్రీకారం చుట్టారు చిరంజీవి. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను ఖరారు చేశారు మేకర్స్‌. అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్‌ హ్యూమరస్‌ రోల్‌లో కనిపించనున్నారనీ యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఇందులో రాయలసీమ నేపథ్యం ఉంటుందని సమాచారం. చిరంజీవి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ ఉంటుందని తెలుస్తోంది. సో... చిరంజీవి రాయలసీమ యాసలో అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్‌’ వంటి చిత్రాల తర్వాత చిరంజీవి– నయనతార కలిసి మూడవసారి నటిస్తున్న చిత్రం ‘మెగా 157’. 2026 సంక్రాంతి కానుకగా ‘మెగా 157’ విడుదల కానుంది.  

పుడతాం ఏటి మళ్లీ...  
రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్‌ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో.. ‘ఓటే పని చేసే నాకి, ఒకేనాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్‌చరణ్‌ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన వచ్చింది. 

మల్టీస్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్‌ శివార్లలో వేసిన ఓ భారీ విలేజ్‌ సెట్‌లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర తారాగణంపై భారీ యాక్షన్‌  సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే 30 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ తాజా షెడ్యూల్‌తో సుమారు 50 శాతం పూర్తవుతుందని టాక్‌. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండటం విశేషం. 2026 మార్చి 27న ‘పెద్ది’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.

బ్రిటీష్‌ పాలన నేపథ్యంలో...  
విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్‌ టైటిల్‌). రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్‌ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. బ్రిటీష్‌ పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. 

ఈ సినిమాతో తొలిసారి రాయలసీమ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నారు విజయ్‌ దేవరకొండ. తెలంగాణకి చెందిన విజయ్‌ ‘వీడీ 14’లో తన పాత్ర కోసం మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. ఆ యాసని పర్ఫెక్ట్‌గా పలికేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో దేశభక్తి అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో ఓ యోధుడిగా కనిపించనున్నారట విజయ్‌ దేవరకొండ. 

ఇదిలా ఉంటే... విజయ్‌ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్‌ రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించనున్న ఈ సినిమా కథ కూడా రాయలసీమ నేపథ్యంలో పొలిటికల్‌ యాక్షన్‌  డ్రామాగా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్‌ ఖరారు చేశారని తెలిసింది. ఇదిలా ఉంటే... విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్‌’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా  జూలై 4న విడుదల కానుంది.

కదిరి నరసింహ సామి సాచ్చిగా...  
వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ మూవీ ఫేమ్‌ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్‌ హీరోయిన్‌. యువీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇండో–కొరియన్‌ హారర్‌ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రం అనంతపురం నేపథ్యంలో కొనసాగుతుంది. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అంటూ ఇటీవల వరుణ్‌ తేజ్‌ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం స్పష్టమైంది. అందులో భాగంగానే ఈ సినిమా తాజా షెడ్యూల్‌ అనంతపురంలో జరిపారు మేకర్స్‌. 

అనంతపురంలోని ప్రముఖ కార్ల కంపెనీ కియా గ్రౌండ్స్‌తో పాటు అక్కడి అందమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఇటీవలే ఈ షెడ్యూల్‌ ముగిసినట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో, ద్వితీయ షెడ్యూల్‌ అనంతపురంలో విజయవంతంగా పూర్తి చేసింది యూనిట్‌. మూడో షెడ్యూల్‌ కొరియాలో ప్రారంభం కానుంది. థ్రిల్లింగ్‌ సన్నివేశాలతో పాటు తనదైన పంచ్‌ హ్యూమర్‌తో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు మేర్లపాక గాంధీ. ‘వీటీ 15’ కోసం అనంతపురం యాసలో మాట్లాడనున్నారు వరుణ్‌ తేజ్‌. ఈ సినిమాకి ‘కొరియన్‌  కనకరాజు’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట.

ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...
అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం రాయలసీమలోని చిత్తూరు నేపథ్యంలో సాగనుంది. 

ఏప్రిల్‌ 8న అఖిల్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అక్కినేని అఖిల్‌ చెప్పిన ఇంటెన్స్‌ డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్‌. ఇందుకోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఆయన మేకోవర్‌ అయ్యారు. హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత కొత్త షెడ్యూల్‌ చిత్తూరు జిల్లాలో కొనసాగనున్నట్లు తెలిసింది.

ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా...
‘విరూపాక్ష, బ్రో’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ తర్వాత సాయి దుర్గా తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘హనుమాన్‌ ’ వంటి బ్లాక్‌బస్టర్‌ పాన్‌ ఇండియన్‌ మూవీ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం భారతదేశానికి స్వాతంత్య్రం రాక మునుపు జరిగే కథతో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా.. ఈ తూరి నరికినానంటే అరపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోనుంచొచ్చాది’ అంటూ రాయలసీమ యాసలో సాయి దుర్గాతేజ్‌ చెప్పిన డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. 

పైగా ఫస్ట్‌ లుక్స్, టీజర్‌ చూసిన వారికి తన కెరీర్‌లోనే పూర్తి స్థాయి మాస్‌ లుక్‌లో, బలమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలు స్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం పూర్తి మేకోవర్‌ అయ్యారు తేజ్‌. ఈ చిత్రం షూటింగ్‌ ఏకధాటిగా 120 రోజుల పాటు కొనసాగింది. ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో కలుపుకుని 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

మదనపల్లె యాసలో...  
‘మేజర్, హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ వంటి హిట్‌ సినిమాల తర్వాత అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్‌’. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షానియల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌ ఇండియన్‌ థ్రిల్లర్‌ మూవీగా ‘డెకాయిట్‌’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌ చూస్తే.. ఇంటన్స్‌ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్‌తో అద్భుతంగా అనిపించింది. ఈ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. 

రాయలసీమలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె యాసలో అడివి శేష్‌ పలికిన డైలాగ్స్, ఆయన వాయిస్‌ మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ తెరకెక్కుతోంది. హిందీ వెర్షన్‌కు కూడా అడివి శేష్‌ సొంతంగా డబ్బింగ్‌ చెబుతుండటం విశేషం. ‘డెకాయిట్‌’ సినిమా క్రిస్మస్‌ కానుకగా తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్‌ 25న విడుదల కానుంది.  
   – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement