
రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. ఒకే ఒక షాట్‌తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు.
‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్‌చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లింప్స్‌తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట.
అయితే ఈ డీల్‌లో కొన్ని కండీషన్స్ ఉన్నాయట. రూ. 105 కోట్లు తొలుత అందజేసి.. సినిమా రిజల్ట్‌ని బట్టి మరింత పెంచేస్తామని నెట్‌ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందట. తెలుగు లో ఆడితే ఇంత.. హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే మరింత..అని ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి రూ. 105 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది.
షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉన్న పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది.