
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ రంగంలోకి దిగుతోంది. దర్శకుడు అనిల్ ఇప్పటికే స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. ఆపై మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభవ అవుతాయి అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా చిరు-అనిల్ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో చిరు నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం చుట్టనున్నారు. రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమంలో వెంకటేష్‌తో పాటు పలువురు స్టార్స్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి సందడి చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనలోని కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆపై ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు.