ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రెటీలు ఏపీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ప్రకాశం జిల్లాలోని కారంచేడులో తన సోదరి పూరందేశ్వరి ఇంట్లో బంధువులతో కలిసి సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక నిన్న(శుక్రవారం) మెగాస్టార్ చిరంజీవి కృష్ణా జిల్లా డోకిపర్రుకి మెగాస్టార్ సతీసమేతంగా వచ్చారు.
భోగి సందర్భంగా డోకిపర్రులోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో చిరు ఆయన భార్య సురేఖ దంపతులు పాల్గొన్నారు. ఆలయ వర్గాలు, వేదపండితులు చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. వేదపండితులు, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి పూర్ణకుంభంతో చిరు దంపతులకు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన కొత్త సంవత్సరపు క్యాలెండర్, డైరీలను చిరంజీవి ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదాదేవి కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని, తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణం అనంత్సరం చిరంజీవి,సురేఖ దంపతులు డోకిపర్రు గ్రామంలో బస చేశారు. ఈ రోజు ఉదయం (శనివారం) ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment