Chiranjeevi Birthday Special Story: Lesser Known Facts About Megastar Movies In 1990s In Telugu - Sakshi
Sakshi News home page

Chiranjeevi Birthday Special 1990s Movies Story: 1990లో డిజాస్టర్‌లు చుట్టుముట్టినా మెగాస్టార్‌గా ఎలా నిలబడ్డాడో తెలుసా?

Published Sat, Aug 19 2023 12:54 PM | Last Updated on Tue, Aug 22 2023 9:43 AM

Chiranjeevi Birthday Special 1990s Story - Sakshi

మెగాస్టార్ చిరంజీవి  68వ పుట్టినరోజును నేడు (ఆగష్టు 22) జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌కు ఇది పండుగరోజు. కానీ ఈ మధ్యే చిరంజీవి కాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరగడం. అదీ కాకుండా చిరంజీవి నటించిన 'భోళాశంకర్' సినిమా పెద్ద డిజాస్టర్‌గా మిగలడం వంటి చేదు గుర్తుల నుంచి వారు బయటపడేందుకు మెగస్టార్‌ పుట్టినరోజు ఒక టానిక్‌లా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు ఆయన కొత్త సినిమా ప్రకటన కూడా ఉండటంతో వారు మరింత జోష్‌లో ఉన్నారు.

ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోస్ చిరంజీవినే ఇన్స్‌ఫరేషన్‌ తీసుకుంటారు. ఎందుకంటే మిగిలిన హీరోలతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం  చాలా భిన్నంగా ఉంటుంది. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ,వాల్తేరు వీరయ్య మినహా మిగిలిన ఏ సినిమా అంతగా ఆకట్టుకోలేదు... సైరా సినిమాలో ఆయన నటన మెప్పించినా కలెక్షన్స్‌ పరంగా నష్టాలే తెచ్చిందని చెప్పవచ్చు ఒకరకంగా చిరంజీవి 1990 నాటి సమయంలో తన సినీ కెరీర్‌లో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఎలా మళ్లీ నిలదొక్కుకున్నాడంటే...

1990 దశకంలో ఏం జరిగింది
1990 సమయంలో కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమసింహం, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్‌ లీడర్‌, ఘరానామొగుడు వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వరుసగా వచ్చాయి. ఇవన్నీ ఒక సునామిలా భారీ కలెక్షన్స్‌తో ఇండస్ట్రీలో దుమ్మురేపాయి. కానీ 1993లో వచ్చిన 'ముఠామేస్త్రి' తర్వాత చిరంజీవి కెరియర్‌ కొంచెం తటపటాయించింది.

ఆ పాట కోసం 500 మంది డ్యాన్సర్లు
ఆ సమయంలో 'మెకానిక్‌ అల్లుడు' సినిమా లాంచ్‌​ అయ్యింది. చిరంజీవిపై అభిమానంతో కనీసం కథ కూడా వినకుండా అక్కినేని నాగేశ్వరావు మెకానిక్‌ అల్లుడులో చేశారు. అలా వారిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో సినిమా అనేసరికి అభిమానులు విపరీతంగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు అల్లు అరవింద్‌ నిర్మాత కాగా బి గోపాల్‌ డైరెక్షన్‌ చేశారు. ఈ సినిమాలో 'ఝుమ్మని తుమ్మెద వేట' సాంగ్‌ కోసం అప్పట్లో రూ.25 లక్షలు ఖర్చు పెట్టారు. అప్పట్లో అదో రికార్డు.  7 రోజుల షూటింగ్‌... 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. ఇన్నీ హంగు ఆర్భాటాలు ఉన్నా కూడా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఆ పోలీస్‌ రియల్‌ లైఫ్‌ స్టోరీనే ఈ సినిమా
ఆ తర్వాత  అంజనా ప్రొడక్షన్స్ నుంచి తొలి సినిమా 'ముగ్గురు మొనగాళ్లు' వచ్చింది. అందులో చిరంజీవి త్రిపాత్రాభినయం చేశారు. దీనికి  రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, నగ్మా, రోజా వంటి క్రేజీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆయనకు భారీగా నష్టాన్ని తెచ్చింది.   ఆ తర్వాత ఎస్పీ 'పరుశురాం' సినిమా రిలీజ్‌ అయింది. తమిళనాడులో ఉండే వాల్టర్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌ రియల్‌ లైఫ్‌ ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం అప్పట్లో బాలీవుడ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న శ్రీదేవిని పిలిపించి అందుకు గాను భారీగా రెమ్యునరేషన్‌ ఇచ్చి చేపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా డిజాస్టర్‌ సొంతం చేసుకుంది.

 

ఆ సినిమా చుట్టూ ఎన్నో విమర్శలు
అలా బ్యాక్‌ టూ బ్యాక్‌గా చిరంజీవికి డిజాస్టర్‌ సినిమాలు వస్తున్న సమయంలో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో మాస్‌ మసాలా ఎంటర్టైనర్‌ 'అల్లుడా మజాకా' వచ్చింది. సినిమా రిలీజ్‌ సమయంలో ఎన్నో  విమర్శలను ఎదుర్కొంది. సినిమాలో బోల్డ్‌ సీన్లు ఉన్నాయని, సెన్సార్‌ వాళ్లు దీనిని పూర్తిగా నిషేధించాలని పలువురు కోరారు. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న చిరంజీవికి ఇది మరో దెబ్బ . అలాంటి సమయంలో చిరంజీవి అభిమానులు చాలా చోట్ల రోడ్డు మీదకి వచ్చి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పట్టుబట్టి ఎదోలా సినిమా రిలీజ్‌ అయ్యేలా చేసుకున్నారు.

చిరంజీవి మార్కెట్‌  ఏంటో గుర్తుచేసిన సినిమా ఇదే
మొత్తానికి 'అల్లుడా మజాకా' సినిమా థియేటర్లో పడింది. ఆపై విజయఢంకా మోగించింది. అప్పటి వరకు సుమారు 3 ఏళ్లకు పైగా ప్లాపుల్లో ఉన్న చిరంజీవి సినిమా మార్కెట్‌పై అంచనాలు తగ్గాయి. ఈ సినిమా విడుదలతో ఆయన  మార్కెట్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ సినిమా భారీ కలెక్షన్స్‌తో పాటు పలు రికార్డులను కూడా క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత 1995లో మళ్లీ  బిగ్‌బాస్‌,  రిక్షావోడు రెండూ భారీ డిజాస్టర్‌లే చిరుకు దక్కాయి. తెలుగులో ఫస్ట్ డాల్బీ సిస్టమ్‌ ఆడియో ఉన్న సినిమా రిక్షావోడు.

చిరు కెరీర్‌లో సినిమాలకు దూరంగా
ఈ సినిమాతోనే 'రూప్ తేరా మస్తానా' తెలుగులో మొదటి ర్యాప్‌ సాంగ్‌ను ఇండస్ట్రీకి చిరంజీవి పరిచయం చేశారు. ఈ సినిమా కోసం డ్యాన్స్‌, నటన విషయంలో ఎంతో కష్టపడి సినిమా తీస్తే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అప్పట్లో ఈ సినిమా ఫలితాన్ని ఏ మాత్రం ఊహించలేదని చిరంజీవి కూడా చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే మెగాస్టార్‌ మొట్టమొదటిసారి తన కెరీర్లో బ్రేక్‌ తీసుకున్నారు. ఏ సినిమా షూటింగ్‌కు వెళ్లకుండా .. కనీసం కథ కూడా వినకుండా సుమారు సంవత్సరం పాటు ఉన్నారు.

ఈ  సినిమాతో వెంటనే బ్లాక్‌బస్టర్‌ కొట్టిన చిరు
అప్పటి వరకు సంవత్సరానికి 3 లేదా 4 సినిమాలు తీసే చిరంజీవి 1996లో మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ఆ తర్వాత 1997లో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ నుంచి 'హిట్లర్‌'గా మెగాస్టార్‌ తిరిగొచ్చారు. ఒకరకంగా ఆయనకు ఇదీ కం బ్యాక్‌ సినిమా అని చెప్పవచ్చు. 49 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్‌ వచ్చిపడ్డాయి. ఆ వెంటనే రజనీ కాంత్‌  'భాషా' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సురేష్‌ కృష్ణతో చిరంజీవి 'మాస్టర్‌' సినిమాను ఒప్పుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెలుగులో మొట్టమొదటి డిటిఎస్ సౌండ్ సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.

పడిలేచిన కెరటం
'ముగ్గురు మొనగాళ్లు' సినిమాతో  అంజన ప్రొడక్షన్స్ అందుకున్న డిజాస్టర్‌ను చిరంజీవి మరిచిపోలేదు. 1998లో  అదే ప్రొడక్షన్‌లో 'బావగారు బాగున్నారా' సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో 54 సెంటర్లలో 100రోజులు ఆడింది. అలా ఆయన పడిలేచిన కెరటంలా తన జర్నీని కొనసాగించారు. అందుకే చాలామంది యంగ్‌ హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్తు ఉంటారు. వరుస డిజాస్టర్‌ల తర్వాత హిట్లర్‌, మాస్టర్‌, బావగారు బాగున్నారా,చూడాలని ఉంది,స్నేహం కోసం,అన్నయ్య వంటి చిత్రాలు వచ్చాయి.

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమాలు అంతగా ప్రేక్షకాధరణ పొందలేదనే చెప్పవచ్చు. ఇండస్ట్రీలో స్టామినా ఉన్న హీరోకు ఒక్క హిట్‌ సినిమా పడితే చాలు రికార్డులన్నీ గల్లంతు అవుతాయని చెప్పడానికి. రాబోయే రోజుల్లో ఆయన నుంచి అలాంటి హిట్‌ సినిమా తప్పకుండా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి ఆయన ఎప్పటికీ మెగాస్టారే...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement