‘‘నాలుగైదు పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన ఇండస్ట్రీ ఓహో అన్నట్లు కాదు. చిన్న సినిమాలు కూడా ఆడాలి. చిన్న, పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ కళకళలాడాలి అనుకునే మాలాంటి వాళ్లకి, నాకు ఒకరకమైన బెరుకు వచ్చింది. కరోనా తర్వాత ఏ సినిమాలు చేయాలి? ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి? అని. కానీ, అవన్నీ కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడూ తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదు అంటే అది వేదికపై ఉన్న మా అందరిదే తప్పు.. ప్రేక్షకుల తప్పు కానే కాదు’’ అని హీరో చిరంజీవి అన్నారు.
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ట్యాగ్‌లైన్ . ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. పద్మజ ఫిల్మ్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘2024 ‘హను–మాన్’ సినిమాతో శుభారంభం అయింది.
అది తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా సినిమా అయిపోయింది. అక్కడి నుంచి చిన్న సినిమాల పట్ల ప్రారంభమైన ఈ ఆదరణ నిæ పెద్ద సినిమాల స్థాయికి మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు ‘కమిటీ కుర్రోళ్లు’, ‘టిల్లు స్క్వేర్, ఆయ్, మత్తు వదలరా 2’ ఇలా వరుసగా హిట్లు వచ్చాయి. మొన్న దీపావళికి వచ్చిన ‘అమరన్, క, లక్కీ భాస్కర్’ సినిమాలు ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాలో స్టార్లు లేరు.. పెద్ద డైరెక్టర్లు లేరు.. కోట్ల బడ్జెట్ లేదు. కానీ, కంటెంట్ ఉంది. అది సినిమాలకి ఆయువుపట్టు. కంటెంట్ బాగుండి, వినోదాన్ని అందించగలిగితే ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు.
‘జీబ్రా’లో కూడా మంచి కంటెంట్, వినోదం, ఫ్యామిలీ అంశాలతో పాటు భావోద్వేగాలు.. అద్భుతమైన నటీనటులు ఉన్నారు. కచ్చితంగా ‘జీబ్రా’ సూపర్‌హిట్టు అవుతుంది.. అవ్వాలి.. అవుతుంది’’ అని చెప్పారు. సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘కెరీర్ పరంగా ఇండస్ట్రీలో నేను చాలా లోగా ఉన్నప్పుడు చిరంజీవి అన్నయ్యగారు పిలిచి ‘గాడ్ ఫాదర్’లో విలన్‌గా అవకాశం ఇచ్చారు. నా జీవితంలో పెద్ద హై ఇచ్చిన సినిమా అది. నా కెరీర్‌లో ‘జీబ్రా’ చాలా పెద్ద సినిమా. ఈ సినిమాని అన్నయ్యకి అంకితం ఇస్తున్నా’’ అన్నారు.
‘‘వాల్తేరు వీరయ్య’ లో బాబీ చేసిన క్యారెక్టర్‌ని నేను చేయాల్సింది. కానీ, మిస్ అయ్యాను’’ అని తెలిపారు డాలీ ధనంజయ. ‘‘జీబ్రా’ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఈశ్వర్ కార్తీక్, ఎస్‌ఎన్ రెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి కథ ఉన్న సినిమాల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మా చిత్రం కూడా చాలా మంచి కంటెంట్‌తో రూపొందింది’’ అని దినేష్ సుందరం, బాల సుందరం చెప్పారు.
ఈ వేడుకలో నిర్మాత వై.రవి శంకర్, డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా, కెమెరామేన్ సత్య పొన్మార్, సంగీత దర్శకుడు రవి బస్రూర్, నటీమణులు అమృత అయ్యంగార్, జెన్నీఫర్ పిక్కినాటో, ఎడిటర్ అనిల్ క్రిష్, లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment