బైక్‌పై వేగంగా వస్తూ అదుపు తప్పి కిందపడిన సాయిధరమ్‌తేజ్ (సీసీ టీవీ దృశ్యాలు)
రాయదుర్గం/బంజారాహిల్స్(హైదరాబాద్): హీరో సాయిధరమ్‌తేజ్ స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా, అదుపుతప్పి కిందపడి గాయాలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఐటీ కారిడార్ ప్రాంతంలో ఈ ప్రమా దం చోటు చేసుకుంది. రాయదుర్గం, మాదాపూర్ పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి సాయిధరమ్‌తేజ్ జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు స్పోర్ట్స్ బైక్‌పై బయలుదేరారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐటీసీ కోహినూర్ హోటల్ ముందు నుంచి ఐకియా వైపు వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో కంటి భాగం, కడుపు, ఛాతీపై గాయాలయ్యాయి. వెంటనే కొందరు వాహనదారులు 108కు సమాచారమిచ్చారు. గాయపడిన సాయి ధరమ్‌తేజ్‌ను 108 సిబ్బంది మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలిస్తూ పోలీసులకు ఫోన్ చేశారు.
ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు అతన్ని సాయిధరమ్‌తేజ్‌గా గుర్తించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయి ధరమ్‌తేజ్ హెల్మెట్ ధరించడంతో తలకు బలమైన గాయాలేవీ కాలేదని వారు వెల్లడించారు.
సాయి ధరమ్‌తేజ్ నడిపిన బైక్ ఇదే..
ఇసుక మేటతోనే ప్రమాదం.....
రోడ్డుపై ఇసుక మేట వేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఎప్పుడూ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లపై మట్టి, ఇతర వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఉదయం పూట ఊడుస్తున్నా.. మరుసటిరోజు తెల్లవారేలోగా మళ్లీ మట్టి, దుమ్ము, వర్షం వస్తే ఇసుక మేట వేస్తుంది. ఇసుక మేట కారణంగానే బైక్ అదుపుతప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
తేజ్ బైక్(టిఎస్ 07 జీజే 1258)ను స్వాధీనం చేసుకుని, ఐపీసీ 336, 279 సెక్షన్, 279 మోటార్ వెహికిల్ యాక్ట్ 184 కింద.. నిర్లక్ష్యం, అతివేగంగా బైక్ నడినందుకు కేసును నమోదు చేశారు. అయితే బైక్ (‘ట్రంప్’–1160 సీసీ) అనిల్‌కుమార్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలిసింది. సాయిధరమ్‌తేజ్, మరో నటుడి కుమారుడు, మరో ఇద్దరు ఆర్టిస్టులు వీకెండ్ పార్టీకి వెళుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
నిలకడగా ఆరోగ్యం...
సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఛాతీ, కడుపు, కన్ను ప్రాంతాల్లో గాయాలైనట్లు గుర్తించారు. కాలర్‌బోన్ ఫ్రాక్చర్ అయినట్లు పరీక్షలో తేలింది. మిగిలిన గాయాలు ప్రమాదకరమైనవి కావని, అంతర్గతంగానూ ఎలాంటి గాయాలు లేవని వైద్యులు పేర్కొంటున్నారు. కాలర్‌బోన్ శస్త్ర చికిత్సపై మరో రోజు గడిచిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఇదిలాఉండగా శనివారం ఉదయం చిరంజీవి దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆస్పత్రికి వచ్చి అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీరేగాక హీరో రామ్‌చరణ్‌తేజ్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, మంచు లక్ష్మి తదితరులు ఆస్పత్రికి వచ్చి తేజ్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
అతివేగంతో నడిపారు..
అనుమతించదగిన వేగ పరిమితుల్లో తేజ్ వాహనాన్ని నడిపి, హెల్మెట్ సరిగ్గా పెట్టుకొని ఉంటే దురదృష్టకర సంఘటన జరిగేది కాదని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాల్సిన ప్రమాద ప్రాంతంలో 75 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపారని చెప్పారు.
దుర్గంచెరువు వంతెనపై ఈ వేగం 100 కిలోమీటర్లుగా ఉందని తేలిందన్నారు. బైక్ నడుపుతూ ఇతర వాహనాలను నిర్లక్ష్యంగా అధిగమించినట్లు సీసీ కెమెరా ఆధారాల ద్వారా గుర్తించామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment