‘‘సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ)లో కొంత డబ్బు మిగిలే ఉంది. ఈ నగదును సినీ కార్మికులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించేందుకు వినియోగించాలనుకుంటున్నాం. 24శాఖల యూనియన్స్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు చిరంజీవి. గత ఏడాది కరోనా టైమ్‌లో చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఆరంభమైంది. విరాళాలు సేకరించి, సినీ పేద కార్మికులకు నిత్యావసరాలు అందజేసిన విషయం తెలిసిందే.
‘‘మంచి విషయాన్ని పది మందితో పంచుకోవడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ‘వైల్డ్ డాగ్’ చూడగానే నాకదే అనిపించింది. తెలుగువాళ్లుగా మనమంతా గర్వపడే గొప్ప సినిమా ఇది’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న రిలీజైంది. ఈ సినిమాని ఆదివారం చిరంజీవి చూశారు. సోమవారం విలేకరుల సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా గురించి నిరంజన్ నాతో చెప్పినప్పుడు సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ ఉండవు అన్నాడు. నాగ్ సినిమా అంటే ఇవన్నీ ఊహిస్తాం కానీ అవేవీ లేకుంటే డ్రైగా ఉంటుందనుకున్నాను. కానీ ‘వైల్డ్ డాగ్’ చూసేటప్పుడు ఆద్యంతం ఉత్కంఠగా అనిపించింది.
ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశానంటే ఈ సినిమా మీద నా ఆసక్తి చివరిదాకా ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందీ ‘యురి’ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇలాంటి సినిమా మనం ఎందుకు తీయలేకపోతున్నాం.. కమర్షియల్ ట్రాక్‌లో పడిపోయామా? అనుకుంటున్న సమయంలో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ లాంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అయ్యా’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘చిరంజీవి గారు ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ‘వైల్డ్ డాగ్’ అనడం గర్వంగా అనిపించింది’’ అన్నారు. ‘‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మేకర్స్ ఆఫ్ ‘క్షణం, ఘాజీ’ అని వేసుకున్నాం.. చిరంజీవిగారు ఫోన్ చేశాక మా తర్వాతి సినిమాకి మేకర్స్ ఆఫ్ ‘క్షణం, ఘాజీ’తో పాటు ‘వైల్డ్ డాగ్’ అని వేసుకోవాలనిపించింది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. అహిషోర్ సాల్మన్ పాల్గొన్నారు.
మంచిని పంచుకుంటే ఆనందమే
Published Tue, Apr 6 2021 3:50 AM | Last Updated on Tue, Apr 6 2021 4:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment