కమెడియన్‌గా అందరికీ పరిచయమైన వేణు బలగంతో దర్శకుడిగా అవతారమెత్తాడు. తాను కమెడియన్ కావడంతో ఏదో హాస్య కథా చిత్రం చేస్తాడనుకున్నారంతా! కానీ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను ఏడిపించేశాడు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా వందకు వంద మార్కులు కొట్టేశాడు. ఈ విజయం అతడికి ఒక్కరోజులో రాలేదు. ఎన్నో ఏళ్లు కష్టాలతో సావాసం చేసి ఇన్నాళ్లకు సక్సెస్ రుచి చూశాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'1999లో ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాత ఓ చిన్న సినిమాకు ఓ షెడ్యూల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఓ రచయిత దగ్గర ఆరు నెలలు పని చేశాను. చిత్రం శ్రీను అన్న దగ్గర టచప్ బాయ్‌గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత దాదాపు 200 సినిమాలు చేశాను. కానీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. నా తర్వాత వచ్చినవాళ్లందరూ ముందుకు పోతున్నారు, కానీ నాకు మాత్రం అంత గుర్తింపు రావడం లేదని ఫీలయ్యాను.
ఇకపోతే నేను బలగం కథ రాసుకుని నిర్మాతల కోసం తిరుగుతున్నాను. ఆ సమయంలో నా స్నేహితుడు ప్రదీప్ చిలుకూరికి కథ చెప్పాను. ఆయన కూడా ఓ డైరెక్టర్. కథ విని.. ఇంత మంచి స్టోరీ దగ్గర పెట్టుకుని నిర్మాతల కోసం తిరుగుతున్నావా? అన్నాడు. ఆ మర్నాడే శివరామ్ దగ్గరకు వెళ్లడం, ఆయన ఓకే చెప్పడం.. దీన్ని దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్లడం, సినిమా రిలీజవడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమాను అందరూ ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు వేణు. కాగా గతంలోనూ తను పడ్డ కష్టాలు చెప్తూ ఎమోషనలయ్యాడీ నటుడు. అవకాశాల కోసం అంట్లు తోమడమే కాక బాత్రూమ్‌లు కూడా కడిగానని చెప్పాడు. ఇన్నాళ్లకు అతడికి మంచి బ్రేక్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
Comments
Please login to add a commentAdd a comment