చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ప్రముఖ హీరో దర్శన్‌కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ నెల రోజుల నుంచి కటకటాల వెనుక ఉన్నారు. దర్శన్ సహా 13 మంది నిందితులు పరప్ప అగ్రహార జైలులో ఉండగా, నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.జైల్లో ఉన్న దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జైలు అధికారులు కూడా ఇదే మాట అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శన్ నుంచి వస్తున్న ప్రతి మాటలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తుందని అంటున్నారు. రేణుకాస్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు కాడంతో ఇప్పుడు ఆయన మరణం వల్ల కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ కాస్త చలించిపోయినట్లు తెలుస్తోంది.
రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు సహాయం అందించాలని దర్శన్ పూనుకున్నారట. ఈ విషయాన్ని రేణుకాస్వామి కుటుంబ సభ్యులతో దర్శన్ అనుచరులు చర్చించారట. అందుకు వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. గర్భంతో ఉన్న రేణుకాస్వామి భార్యకు సాయం చేయడంతో పాటు ఆయన తండ్రి, తల్లికి విడివిడిగా సాయం చేయాలని దర్శన్ ఆలోచించాడట. ఈ వార్త తన అనుచరుల ద్వారా కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దర్శన్‌ను పెళ్లికి ఆహ్వానించిన 'కాటేరా' దర్శకుడు
దర్శన్‌ను కలిసేందుకు 'కాటేరా' చిత్ర దర్శకుడు తరుణ్ సుధీర్ ఈరోజు పరప్ప అగ్రహార జైలుకు వెళ్లారు. దర్శన్‌ని కలిసిన అనంతరం తరుణ్ సుధీర్ మీడియాతో ఇలా మాట్లాడారు.. 'దర్శన్ సర్‌కు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నన్ను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయనకు చెప్పాను. దర్శన్ సార్‌కు రెండు పుస్తకాలు ఇచ్చాను. జీవిత పాఠం గురించి తెలిపే పుస్తకంతో పాటు అర్జునుడి గురించి మరొక పుస్తకాన్ని ఆయనకు అందించాను.' అని తరుణ్ సుధీర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment