టైటిల్: ధమాకా
నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడ్కర్, తణికెళ్ల భరణి, రావు రమేశ్ తదితరులు
నిర్మాణ సంస్థలు: పుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నిర్మాత: టీజీ ప్రసాద్
దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సెసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: ప్రవీణ్ పూడి
విడుదల తేది: డిసెంబర్ 23, 2022
కథేంటంటే..
కథేంటంటే..
స్వామి(రవితేజ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. చెల్లి పెళ్లి చేయాలనే బాధ్యతతో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ కారణం చేత అతని ఉద్యోగం పోతుంది. వేరే ఉద్యోగం కోసం వెతుకున్న సమయంలో అతని చెల్లి స్నేహితురాలు ప్రణవి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. మరో వైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత చక్రవర్తి(సచిన్ ఖేడ్కర్) తన కొడుకు ఆనంద్ చక్రవర్తి(రవితేజ)ని తన కంపెనీకి ఈసీవోగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఆనంద్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఇదే క్రమంలో పీపుల్స్ మార్ట్ కంపెనీపై జేపీ(జయరాం) కన్నుపడుతుంది.
దేశంలో నెంబర్ వన్‌గా కొనసాగే కంపెనీలను బలవంతంగా తన వశం చేసుకునే జేపీ.. పీపుల్స్ మార్ట్ కంపెనీని కూడా చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరి జేపీని ఆనంద్ చక్రవర్తి ఎలా అడ్డుకున్నాడు? మిడిల్ క్లాస్‌కు చెందిన స్వామికి వ్యాపారవేత్త ఆనంద్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ ప్రణవి ఇష్టపడింది స్వామినా లేదా ఆనంద్ చక్రవర్తినా? జేపీ కాకుండా పీపుల్స్ మార్ట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న మరో వ్యక్తి ఎవరు? పీపుల్స్ మార్ట్ కంపెనీతో స్వామికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ కంపెనీకి ఎవరు సీఈఓగా నియమితులయ్యారనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
మాస్ అనే పదానికి పర్యాయపదంలా కనిపిస్తాడు రవితేజ. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ అంటే అందరికి చాలా ఇష్టం. అయితే ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలలో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతుంది. సీరియస్ సబ్జెక్ట్‌నే ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. పాత రవితేజ మిస్ అవుతున్నామనే భావన అభిమానులతో పాటు సీనీ ప్రేమికుల్లోనూ ఉంది. ‘ధమాకా’తో రవితేజ ఆ లోటుని తీర్చాడు. తెరపై ఒకప్పటి రవితేజను చూస్తారు. కథ మాత్రం రొటీన్‌గా ఉంటుంది. పాత కథనే అటు ఇటుగా మార్చి దానికి కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చి స్క్రీన్‌ప్లేతో మాయ చేయడం ప్రసన్న కుమార్‌కు అలావాటు. ‘ధమాకా’ చిత్రంలోనూ ప్రసన్న కుమార్ అదే ఫాలో అయ్యాడు.
రొటీన్ కథే అయినప్పటికీ.. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇవన్నీ సమ పాళ్లలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు త్రినాథరావు. రవితేజ నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా మొత్తం రవితేజ వన్ మ్యాన్ షోగా సాగుతుంది. శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు ఈ సినిమాకు చాలా ప్లస్. ఓ ఫైట్.. కామెడీ సీన్లతో ఫస్టాఫ్ అంతా జాలీగా సాగుతుంది. కథతో కొత్తదనం లేకున్నా.. కామెడీ, పాటలు ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా చూస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఒక సెకండాఫ్‌లో కథ రొటీన్‌గా సాగుతుంది. సాగదీత సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. అయితే మధ్యలో వచ్చే ఓ ఫోక్ సాంగ్ అలరిస్తుంది. లాజిక్స్‌ని వెతక్కుండా మాస్ సినిమాను ఎంజాయ్ చేసే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
రవితేజ సినిమాలలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. డ్యూయల్ రోల్‌లో ఆయన రెచ్చిపోయి నటించాడు. వ్యాపారవేత్త ఆనంద్ చక్రవర్తిగా, మిడిల్ క్లాస్ యువకుడు స్వామిగా రెండు రెండు విభిన్న పాత్రలో కనిపించిన రవితేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ప్రణవిగా శ్రీలీల తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎక్స్‌ప్రెషన్స్, డాన్య్ విషయంలో రవితేజతో పోటీ పడి నటించింది. రావు రమేశ్, హైపర్ ఆదిల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా పండాయి. పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత చక్రవర్తిగా సచిన్ ఖేడ్కర్, జేపీగా జయరాం తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ తరహా క్యారెక్టర్స్‌లో నటించడం వారికి కొత్తేమి కాదు. తనికెళ్ల భరణి, అలీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సెసిరోలియో సంగీతం. అదిరిపోయే పాటలు.. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ‘జింతాక్’ పాట థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే బాగుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment