ఆవేశంతో ఊగిపోవడం ఆపై 'సారీ' చెప్పడం 'మెగా బ్రదర్స్‌'కు అలవాటే.. | Did Naga Babu Comments On Jr NTR? | Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌.. 'సారీ' చెప్పిన నాగబాబు

Published Thu, Feb 29 2024 4:54 PM | Last Updated on Thu, Feb 29 2024 5:12 PM

Did Naga Babu Comments On JR NTR - Sakshi

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న మిగిలిన ఇద్ద‌రు సోద‌రుల‌తో పోల్చుకుంటే సినిమాల్లో రాణించ‌లేక‌పోయాడు. ఏదో అడ‌పాద‌డ‌పా ఆయ‌న సినిమాల్లో క‌నిపించీ క‌నిపించ‌కుండా ఉంటాడు. తమ్ముడు పవన్‌ పుణ్యమా అని పార్ట్‌ టైమ్‌ పొలిటీషయన్‌గా ఎన్నికల సమయంలో మాత్రమే జనాల్లో కనిపిస్తాడు. ఆ సమయంలో  ఆయన ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. తాజాగా తన కుమారుడు వరుణ్‌ తేజ్‌ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడ పోలీస్‌ పాత్రల గురించి ఆయన కామెంట్‌ చేశాడు.

సినిమాలలో ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉండే వారు  పోలీస్ ఆఫీసర్ పాత్రలు వేస్తే అంతగా నమ్మేలా ఉండవని సెటైర్లు వేశాడు నాగబాబు. పోలీస్ క్యారెక్ట‌ర్ త‌న కొడుకు లాంటి వారు మాత్ర‌మే చేయాలి త‌ప్పా మిగ‌త వారు అందుకు ప‌నికి రారు అన్న‌ట్లుగా మాట్లాడారు. అయితే అవి కాస్త సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. పాన్‌ ఇండియా స్టార్‌ హీరో అయిన జూ ఎన్టీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని నెట్టింట్ట వైరల్‌ అయింది. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ ఎంట్రీ ఇవ్వడం ఆపై నాగబాబుపై విమర్శలు చేయడంతో ఫైనల్‌గా సారీ చెప్పాడు.

'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్‌లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది.. 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను, ఆ మాటలు నేను వెనక్కు తీసుకుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే నన్ను క్షమించండి. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు,అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ ఒక పోస్ట్‌ చేశాడు.

గతంలో కూడా బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు వ్యాఖ్యలు చేయడం తర్వాత వాటికి గుడ్‌ బై చెప్పి కాంప్రమైజ్‌కావడం వంటివి జరడం మనం చూసిందే.. తాజాగా తారక్‌ను ఉద్దేశించే నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ఎన్నికల సమయంలో ఈ తలనొప్పి ఎందుకులే అనుకున్నాడేమో సింపుల్‌గా ఇలా సారీ చెప్పేశాడు.

గతంలో కూడా నాగబాబు ఏబీఎన్‌ అధినేత రాధాక్రిష్ణపై ఫైర్ అవుతూ ఒక వీడియో విడుదల చేశాడు. చంద్రబాబుపై మీరు చేసిన 'భట్రాజ్' పొగడ్తల్ని నేను ఒక వీడియో ద్వారా చూపించానంటూ రాధాక్రిష్ణపై కామెంట్లు చేశాడు. అయితే అందులో 'భట్రాజ్ పొగడ్తలు' అనే పదం వల్ల ఆయనకు చిక్కులు వచ్చాయి. ఆ కమ్యూనిటీకి చెందిన వారు ఫైర్‌ కావడంతో నాగబాబు క్షమాపణలు చెప్పాడు. ఇలా ఆవేశంలో నోటికి వచ్చింది మాట్లాడటం తర్వాత సారీ చెప్పడం పవన్‌- నాగబాబుకు సర్వసాధారణం అయింది.

మరో వైపు పవన్‌ కల్యాణ్‌ కూడా అంతే.. ఆవేశంలో ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. కేవలం సినిమా డైలాగుల మాదిరి రాజకీయం చేయాలనుకుంటే  అయ్యే పని కాదని ఇప్పటికీ ఆయనకు అర్దం అయినట్లు లేదు. రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ సుమారు 10 ఏళ్లకు పైగానే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు. ఈ ప‌దేళ్ల‌లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ రాజ‌కీయంగా ఎద‌గ‌క‌పోగా అదఃపాతాళానాకి చేరుకున్నాడు. అందుకే ఆయన నోటి నుంచి ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. 

కొన్ని నెలల క్రితం తణుకు సభలో విడివాడ  రామచంద్రరావుకు తణుకు టిక్కెట్ అంటూ ఆవేశంగా ప్రకటించాడు. గత ఎన్నికల్లో మీలాంటి వ్యక్తి వెనుక నేను నిలబడలేనందుకు మనస్పూర్తిగా చింతిస్తున్నాను. 2019లో టిక్కెట్‌ ఇవ్వలేకపోయినందుకు ఇలా పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పుకుంటున్నానంటూ పవన్‌ అన్నారు. ఆ సమయంలో రామచంద్రరావుకు క్షమాపణలతోనే సభను ప్రారంభించాడు పవన్‌. కానీ ఈసారి కూడా పవన్‌ మాట నిలబెట్టుకోలేకపోయాడు. తణుకు అభ్యర్థిగా రాధాకృష్ణకు టిక్కెట్ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

దీంతో రామచంద్రరావుకు మళ్లీ సింపుల్‌గా సారీతో గుడ్‌బై చెప్తాడని తెలుస్తోంది. చంద్రబాబు కోసం పవన్‌ రాజకీయం చేస్తున్నాడు అనేది నిజం.. ఆయన ఇచ్చిన 24 సీట్లతో సంబరపడిపోతూ ప్రస్తుత రాజకీయ సభల్లో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నాడు. కానీ తన పార్టీకి కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయిన జనసేన అధినేత తన జెండా అదఃపాతాళానాకి చేరుకోవాడానికి కారణం ఎవరు..? దీనికి మ‌రెవ‌రినో నిందించాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయాల్లో ఆత్మ‌హ‌త్య‌లే త‌ప్ప‌, హ‌త్య‌లుండ‌వంటారు. ఇందుకు ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చేస్తున్న రాజ‌కీయమే నిలువెత్తు నిదర్శనం.

ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పైకి ఎన్ని సినిమా డైలాగ్స్‌ పేల్చినా ఉపయోగం లేదు. జ‌గ‌న్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను అడ్డుకోడానికి మాత్ర‌మే జ‌న‌సేన ఆవిర్భ‌వించింద‌ని ఆయన పట్టరాని ఆక్రోశంతో మాట్లాడుతున్నాడు. కానీ టీడీపీ కోసమే జనసేన పుట్టింది అని పవన్‌ పరోక్షంగా చెప్పినట్లు అయింది. దీంతో తన  ఫ్యాన్స్‌తో పాటు తన వర్గం వారు కూడా పవన్‌ను ప్రశ్నిస్తున్నారు.. పలు సలహాలు ఇస్తున్నారు... కానీ ఆయన ఐ డోంట్‌ కేర్‌ అంటూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకే జై కొడుతున్నాడు.

పవన్‌కు ఎంత ప్యాకెజీ ఇస్తే అంతలా స్టేజీ డైలాగ్స్‌తో ప్రస్తుతం రెచ్చిపోతున్నాడు. 2014లో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీ కూట‌మికి  మ‌ద్ద‌తు ఇచ్చి నాలగు లాజిక్‌ లేని మాటలను తన ఫ్యాన్స్‌కు చెప్పాడు.. 2019లో మ‌ళ్లీ అలాంటి కాకమ్మ కథలే చెప్పి చంద్రబాబు కోసం సొంతంగా బ‌రిలోకి దిగాడు. 2024 వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలంటూ టీడీపీకి జ‌న‌సేన‌ను తాక‌ట్టు పెట్టేశాడు. ఇలాంటి కొత్త కథలు విని తట్టుకోలేక పవన్‌ ప్యాన్స్‌ కూడా ఫైర్‌ అవుతున్నారు.

పవన్‌ను తిడుదామంటే అభిమానం అడ్డొస్తుంది.. దీంతో వారందరూ చంద్రబాబుపై ఫైర్‌ అవుతున్నారు. ఎన్ని చేసినా ఈసారి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఓడించడం కష్టం అని జనసేన అభిమానులో వీడియోలు చేస్తూ పోస్ట్‌ చేస్తున్నారు. ఈ ఎన్నికలు అయిపోయాక 2029  ఎన్నికల్లో చంద్రబాబుతో తూచ్‌ అని ... జనసైనికులకు ఒక సారీ చెప్పి సింగిల్‌గా పోటీకి దిగుతానని ఏదో ఒక సినిమా కథ చెప్పడం ఖాయం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement