తమిళ సినిమా: ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు, రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు, బీజేపీ తమిళ భాషాభివృద్ధి అధ్యక్షుడు పేరరసు విళిత్తెళు చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై శివగంగ నగర్ మండ్రం అధ్యక్షుడు, నటుడు సీఎం దొరై ఆనంద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మురుగా అశోక్, గాయత్రి జంటగా నటిస్తున్నారు. ఏ.తమిళ్ సెల్వన్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ గురువారం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. దర్శకుడు పేరరసు, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్ తంగం, పారిశ్రామికవేత్త దామ్ కన్నన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న వారిని చూస్తుంటే తమిళ భాషాభిమానులని తెలుస్తోందన్నారు. ఇప్పుడు తమిళ భాషపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే తమిళంపై రాజకీయాలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.
తమిళం అన్నా, తమిళనాడు అన్నా ఒకటి కాదా అంటూ ప్రశ్నించారు? తమిళనాడు వర్ధిల్లాలి.. తమిళం వర్ధిల్లాలి అన్నవి రెండు ఒకటే అన్నారు. రాజకీయ పార్టీల్లో పలు విభాగాలు ఉండవచ్చని, అయితే తమిళుడు తమిళుడుగానే ఉండాలని పేర్కొన్నారు. గవర్నర్ అనే వ్యక్తి రెండేళ్లలో వెళ్లిపోతారని తమిళులు ఇక్కడే ఉంటారని అన్నారు. ఈ చిత్రంలోని పాటలు తమిళుడు మోసపోతూనే ఉన్నాడు అనే పదం ఉందన్నారు. అది నిజమేనన్నారు. కాబట్టి తమిళ రాజకీయాల్లో తమిళుడు చిక్కుకోరాదని ఈ సందర్భంగా పేరరసు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment