తమిళ సినిమా: నటుడు సూర్య, దర్శకుడు హరి సూపర్‌హిట్ కాంబినేషన్. ఇంతకు ముందు ఆరు, వేల్, సింగం సిరీస్ మొదలు హిట్ చిత్రాలు వచ్చాయి. సింగం-2 చిత్రం తరువాత వీరి కాంబినేషన్‌లో అరువా చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత సూర్యకు దర్శకుడు హరికి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో అరువా చిత్రం ఆగిపోయిందని ప్రచారం జరిగింది.
అన్నట్టుగానే వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు మరో చిత్రం రాలేదు. నటుడు సూర్య ఇతర చిత్రాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేయనున్నారు. ఇక దర్శకుడు హరి చివరిగా అరుణ్ విజయ్ హీరోగా యానై చిత్రాన్ని చేశారు. కాగా ఇటీవల తన సతీమణితో కలిసి ఓ రికార్డింగ్, ప్రివ్యూ స్టూడియోను ప్రారంభించారు.
ఆ వేడుకకు నటుడు సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీంతో వీరి మధ్య మనస్పర్థలు అనేవి వదంతులని తేలింది. కాగా దర్శకుడు హరి ఇప్పుడు వరుసగా మూడు కమర్షియల్ కథా చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
చదవండి: వైరముత్తు నవలలో విక్రమ్ నటిస్తారా?
అందులో ముందుగా నటుడు విశాల్ హీరోగా చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు పూజా, తామ్రరభరణి వంటి హిట్ చిత్రాలు రూపొందాయి. కాగా తదుపరి నటుడు సూర్య కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా నటుడు కార్తీ తాను హరి చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment