Director Selvaraghavan To Share Screen Space With Dhanush In Villain Role - Sakshi
Sakshi News home page

Dhanush: తమ్ముడికి అన్నయ్యే విలన్‌ అయ్యాడు

Published Sun, Aug 28 2022 2:47 PM | Last Updated on Sun, Aug 28 2022 4:36 PM

Director Selvaraghavan to share screen space with Dhanush - Sakshi

తమ్ముడికి అన్నయ్య విలన్‌గా నటించడం చాలా అరుదైన విషయం. అలాంటి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. నటుడు ధనుష్‌ చాలాకాలం తరువాత ఇటీవల విడుదలైన తిరుచిట్రంఫలం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నానే వరువేన్‌ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఆయన సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ధనుష్‌కు ప్రతినాయకుడిగా ఈయనే నటిస్తున్నట్లు తాజా సమాచారం.

దర్శకుడుగా మంచి పేరు ఉన్న సెల్వరాఘవన్‌ ఇటీవల నటుడుగాను దుమ్మురేపుతున్నారు. సాని కాగితం చిత్రంతో నటుడిగా పరిచయమైన ఈయన ఆ చిత్రంలో సెటిల్‌ ఫెర్మార్మెన్స్‌తో అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత విజయ్‌ కథానాయకుడుగా నటించిన బీస్ట్‌ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించి మెప్పించారు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా నటిస్తున్న నానే వరువేన్‌ చిత్రంపై దృష్టి సారించారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో కాదల్‌ కొండేన్, పుదుపేట్టై, మయక్కం ఎన్నా చిత్రాలు రూపొందాయి. వాటిలో కాదల్‌ కొండేన్, పుదుపేట్టై చిత్రాలు సంచలన విజయం సాధించాయి.

కాగా సుమారు 11 ఏళ్ల తరువాత మళ్లీ వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం నానే వరువేన్‌. దీనిని కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. నటి ఇందుజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, ఓం ప్రకాష్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెపె్టంబర్‌ 30వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.   

చదవండి: (తెలుగు హీరోతో కలిసి నటించనున్న మోహన్‌లాల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement