తెలుగు సినిమా ‘లోఫర్’తో కెరీర్ మొదలుపెట్టిన దిశా పటానీ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఎంఎస్ ధోని:ది అన్‌టోల్డ్ స్టోరీ’, యాక్షన్ ఫిల్మ్ ‘బాఘీ’లతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్ ఫిల్మ్స్, సూపర్ హీరో ఫిల్మ్స్ ఇష్టపడే దిశకు నచ్చిన పుస్తకం ఏ లైఫ్ ఇన్ సీక్రెట్స్. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం...
టైటిల్ కింద కనిపించే ట్యాగ్‌లైన్ ‘ఆట్‌కిన్స్ అండ్ ది మిస్సింగ్ ఏజెంట్స్ ఆఫ్ వరల్డ్ వార్–2’ చూసిన తరువాత పుస్తకం గురించి స్థూల అవగాహన వస్తుంది. ఎవరీ ఆట్‌కిన్స్? నాజీ గూఢచారి హ్యూగో బ్లేచెర్ మాటల్లో....‘నన్ను ఇంటరాగెట్ చేసిన వాళ్లలో ఒకరు ఆట్‌కిన్స్. మిగతా అధికారులతో పోల్చితే పోష్ ఇంగ్లిష్ యాక్సెంట్‌తో ఆమె చాలా భిన్నంగా కనిపించారు. కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. మగరాయుడిలా అనిపించింది’
రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్‌లో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్‌వోయి)లో ఫ్రాన్స్ సెక్షన్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేంది. కొద్దికాలంలోనే హెడ్ ఆఫ్ ది ఫ్రెంచ్ సెక్షన్‌కు అసిస్టెంట్‌గా పనిచేసే స్థాయికి ఎదిగింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా ఆమె ప్రధాన విధులు ఏమిటంటే, ఇంటర్వ్యూ చేసి స్పెషల్ ఏజెంట్లను ఎంపిక చేయడం. అలా ఎంపిక చేసిన వారిని 16వ శతాబ్దానికి చెందిన కంట్రీ హౌజ్‌లో బస ఏర్పాటు చేస్తారు. బాహ్యప్రపంచంతో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. ఇక్కడ ‘కమెండో కోర్స్’ చేయిస్తారు. ఫాల్స్ ఐడెంటిటీలతో ప్రత్యర్థులను ఎలా బురిడీ కొట్టించాలో తర్ఫీదు ఇస్తారు. భాషకు సంబంధించిన మెలకువలు నేర్పించడంతో పాటు, ఆక్రమిత ఫ్రాన్స్‌లో పోలీస్ రూల్స్ ఎలా ఉంటాయి, కర్ఫ్యూ ఏ విధంగా ఉంటుంది, రేషనింగ్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్‌పోర్ట్ సమస్యలు ఏమిటి...మొదలైన విషయాలను పూసగుచ్చినట్లు వివరించేది ఆట్‌కిన్స్. శిక్షణ పూర్తయ్యాక నాజీ జర్మనీ ఆక్రమిత ఫ్రాన్స్‌లోకి వీరిని పంపిస్తారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటారు.
నాజీ జర్మని ఆక్రమిత ఫ్రాన్స్‌లోకి 470 మంది ఏజెంట్లను పంపుతారు. అందులో 39 మంది స్త్రీలు కూడా ఉన్నారు. ఈ ఏజెంట్ల పేర్లు, కోడ్‌నేమ్స్‌తో సహా ప్రతి చిన్న విషయం ఆట్‌కిన్స్‌కు కొట్టిన పిండే. ‘మోస్ట్ డేరింగ్ వుమెన్’గా పేరున్న ఆట్‌కిన్స్ ‘కవరింగ్’ స్టోరీలు అల్లడంలో, కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌లో పనిచేసిన జర్మనీ అధికారులు, గార్డులను ఇంటరాగేట్ చేయడంలో నెంబర్‌వన్ అనిపించుకుంది.
జేమ్స్‌బాండ్ సిరీస్‌లో ‘మిస్ మనీ పెన్నీ’కి ప్రేరణ ఆట్‌కిన్స్ అంటారు.
‘ది సండే టైమ్స్ ఆఫ్ లండన్’ ‘ది ఇండిపెండెంట్’ పత్రికల్లో చాలాకాలం పాటు రిపోర్టర్‌గా పనిచేసిన సారా హెమ్ 1998లో ఆట్‌కిన్స్‌ను స్వయంగా కలుసుకొని ఈ పుస్తకానికి కావల్సిన ముడిసరుకు సమకూర్చుకున్నారు. రొమేనియా నుంచి కెనడా వరకు వేలమైళ్ల దూరం ప్రయాణం చేసి పుస్తకానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోగ్రాఫ్‌లు, ఫ్యామిలీ రికార్డులు సేకరించారు. తన పరిశోధనలో హెమ్‌కు తెలిసిన విషయం ఏమిటంటే, బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్‌లో పనిచేయడానికి ముందు బచరెస్ట్ (రొమేనియా)లోని ఒక ఆయిల్ కంపెనీలో సెక్రెటరీగా పనిచేసింది ఆట్‌కిన్స్. ఆ కాలంలో బ్రిటీష్ ఇంటెలిజెన్స్‌కు అవసరమైన సమాచారాన్ని చేరవేసేది. ఆమె పనితీరు నచ్చడం, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో పట్టు ఉండడం...మొదలైన కారణాలతో ‘ఎఫ్–సెక్షన్’లోకి తీసుకున్నారు. అంత పెద్ద స్థాయిలో వెలిగిన ఆట్‌కిన్స్ కూడా ఇంగ్లిష్ ఉన్నత అధికారుల దగ్గర జాతివివక్ష ఎదుర్కుందట. మరో సంచలనం ఏమిటంటే, బ్రిటీష్ ఇంటెలిజెన్స్ విభాగంలో ‘పవర్‌ఫుల్ ఫిగర్’ అనిపించుకున్న ఆట్‌కిన్స్ జర్మన్, సోవియట్‌లకు ‘స్పై’గా పనిచేసిందని ఆరోపణలు వచ్చాయి. 92 ఏళ్ల వయసులో చనిపోయిన ఆట్‌కిన్స్‌ను రహస్యాల పుట్ట అంటారు. ఆ రహస్యాల అరల్లోకి వెళ్లడమే ఈ పుస్తకం చేసిన పని.
Comments
Please login to add a commentAdd a comment