‘‘నేను ఎప్పటి నుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకుంటున్నాను. అది ‘లక్కీ భాస్కర్’ సినిమాతో నెరవేరింది. డైరెక్టర్ వెంకీ బ్యాంకింగ్ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథ చెప్పడం కొత్తగా అనిపించింది. సినిమాలో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, చిన్న బ్యాంక్ ఉద్యోగి అయిన భాస్కర్ తన పరిధిలో స్కాం చేయడం కొత్తగా అనిపించింది.
మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 31న విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో దుల్కర్ సల్మాన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ నేను తెలుగులో నటించిన ‘మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్’ సినిమాలు హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని సంతోషంగా ఉంది. నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలి. షారుఖ్ ఖాన్ లాంటివారు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. మనలోని నటుణ్ణి బయటకు తీసుకురావాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలి. ‘లక్కీ భాస్కర్’ చిత్రంలోని భాస్కర్ పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో పాటు ఎన్నో భావోద్వేగాలున్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తిని ఇస్తాయి. ఈ సినిమా షూటింగ్‌ని ప్రతిరోజూ చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిన చిత్రమిది.
⇒ నేను నటుడు మమ్ముట్టిగారి కొడుకుని అయినప్పటికీ సాధారణ యువకుల్లాగానే ఆలోచిస్తాను. లాటరీ తగిలితే సొంతంగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని చిన్నప్పుడు కలలు కనేవాడిని. ‘లక్కీ భాస్కర్’ చూసిన నాన్నగారు నాతో ఏం చెప్పలేదు. కానీ, వెంకీతో మాట్లాడి యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందించారు. నాకు బాగా నచ్చిన కథల గురించి నాన్నకి చెబుతుంటాను. ‘లక్కీ భాస్కర్’ కథకి తగ్గట్టుగా, ప్రతి భావోద్వేగాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. సినిమాకి వస్తున్న స్పందన చూసి నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్యగార్లు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment