టాలీవుడ్ దర్శక-నిర్మాతలపై కన్నేసిన పర భాష హీరోలు! | Dulquer Salman, Fahad Fazil, Suriya, Other Language Heroes Focus On Tollywood | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ దర్శక-నిర్మాతలపై కన్నేసిన పర భాష హీరోలు!

Published Sat, Nov 9 2024 12:57 PM | Last Updated on Sat, Nov 9 2024 1:13 PM

Dulquer Salman, Fahad Fazil, Suriya, Other Language Heroes Focus On Tollywood

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాలీవుడ్‌ ముందు వరుసలో ఉంది. స్టార్‌ హీరోల తెలుగు సినిమాలు  పాన్‌  ఇండియా మూవీస్‌గా ఇతర భాషల్లో రిలీజ్‌ అవుతున్నాయి. కథాబలం ఉన్న సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇలా ఇతర భాషల హీరోల సినిమాలు కూడా టాలీవుడ్‌లో విడుదలై, మంచి సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలుస్తున్నాయి. దీంతో కొందరు హీరోలు తెలుగు నిర్మాణ సంస్థలు, తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా క్షేమంగా రండి లాభంగా వెళ్లండి అంటూ ఆదరిస్తున్నారు.  ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం...

ఆకాశంలో ఒక తార!
‘మహానటి, సీతారామం’, ఇటీవల ‘లక్కీభాస్కర్‌’ చిత్రాలతో దుల్కర్‌ సల్మాన్‌  తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగులో దుల్కర్‌ చేసిన ఈ మూడు సినిమాలు సూపర్‌హిట్స్‌ కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు దుల్కర్‌ సల్మాన్‌ . ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నారాయన. పవన్‌  సాధినేని ఈ సినిమాకు దర్శకుడు. గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమాస్, లైట్‌ బాక్స్‌ మీడియా పతాకాలపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రం నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌ గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ‘కాంత’ అనే పీరియాడికల్‌ ఫిల్మ్‌లోనూ దుల్కర్‌ హీరోగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌ అట్లూరి, జోమ్‌ వర్గీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాను సంగీతం అందిస్తున్నారు. కాగా దుల్కర్‌ తెలుగు నిర్మాతలతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి సమర్పణలో...
అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న బన్వర్‌సింగ్‌ షెకావత్‌ పాత్రలో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించారు మలయాళ హీరో ఫాహద్‌ఫాజిల్‌. ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమాలోనూ ఫాహద్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. అయితే ఫాహద్‌ హీరోగా ‘డోన్ట్‌  ట్రబుల్‌ ది ట్రబుల్, ఆక్సిజన్‌ ’ అనే రెండు తెలుగు సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. 

రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, కార్తికేయ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ‘ఆక్సిజన్‌ ’ సినిమాతో సిద్ధార్థ్‌ నాదెళ్ల, ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ సినిమాతో శశాంక్‌ ఏలేటి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ‘డోన్ట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్, ఆక్సిజన్‌’ సినిమాల ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. అయితే ఆ తర్వాత ఈ సినిమాల గురించి మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది.

జై హనుమాన్‌
‘కాంతార’ సినిమాతో కన్నడ యాక్టర్‌ రిషబ్‌ శెట్టి పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్‌ ‘కాంతార: ఛాప్టర్‌ 1’తో బిజీగా ఉన్నారు రిషబ్‌శెట్టి. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అదే జై హనుమాన్‌.

ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హను–మాన్‌ ’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌ ’ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రిషబ్‌శెట్టి మెయిన్‌  లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (పీవీసీయు)లో భాగంగా ‘జై హను మాన్‌ ’ అనే తెలుగు సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు రిషబ్‌. ప్రశాంత్‌ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానా మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ‘జై హనుమాన్‌’ సినిమాను నిర్మిస్తున్నారు.

యాక్షన్‌  ‘జాట్‌’
బాలీవుడ్‌లోని సీనియర్‌ హీరోల్లో ఒకరైన సన్నీ డియోల్‌ తెలుగులో సినిమా చేస్తున్నారు. ‘జాట్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌  ప్యాక్డ్‌ మూవీకి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ మొదలైంది. పీటర్‌ హెయిన్స్‌, అన్ల అరసు, రామ్‌–లక్ష్మణ్, వెంకట్‌.. ఇలా నలుగురు యాక్షన్‌  కొరియోగ్రాఫర్స్‌ ఈ సినిమాకు అసోసియేట్‌ కావడం చూస్తే యాక్షన్‌  సీక్వెన్స్‌లు నెక్ట్స్‌ లెవల్‌లో ఉండబోతున్నాయని ఊహించవచ్చు. రణ్‌దీప్‌ హుడా, వినీత్‌కుమార్, సయామీ ఖేర్, రెజీనా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు  పోషిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌  ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ ‘జాట్‌’ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

హిందీలో ‘గదర్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన వెంటనే సన్నీడియోల్‌ తెలుగులో ‘జాట్‌’ చేయడానికి అంగీకరించడం విశేషం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు. ‘జాట్‌’ కాకుండా హిందీలో ‘బోర్డర్‌ 2, లాహోర్‌ 1947’ సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీడియోల్‌. ‘జాట్‌’ విజయం సాధిస్తే ఆయన తదుపరి సినిమాలైన ‘బోర్డర్‌ 2, లాహోర్‌ 1947’ చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్‌ అవుతాయని ఊహించవచ్చు.

కంగువా
హీరో సూర్య తెలుగులోనూ పాపులర్‌. ఆయన తమిళ చిత్రాలు ఎప్పటికప్పుడు తెలుగులో అనువాదం అవుతుంటాయి. వీలైనప్పుడు నేరుగా తెలుగు సినిమాల్లోనూ సూర్య నటిస్తారు. తాజాగా సూర్య నటించిన భారీ బడ్జెట్‌ సైన్స్‌ ఫిక్షనల్‌ ఫిల్మ్‌ ‘కంగువా’. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్స్‌ , యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా, తెలుగు నిర్మాతలు వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ‘కంగువ, ఫ్రాన్సిస్‌’ అనే రెండు భిన్నమైన రోల్స్‌లో సూర్య నటించారు.

 దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యోగిబాబు, బాబీడియోల్‌ ఇతర పాత్రలు చేశారు. ఈ నెల 14న ‘కంగువా’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరకర్త. అలాగే గీతాఆర్ట్స్‌ సంస్థలో సూర్య ‘గజిని 2’ సినిమా చేస్తారని, అలాగే బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
కుబేర
ధనుష్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే ధనుష్‌ తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రం ‘సార్‌’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ‘సార్‌’ చిత్రం వందకోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే తెలుగు నిర్మాతలతో మరో సినిమా చేసేందుకు ధనుష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అదే ‘కుబేర’. 

శేఖర్‌కమ్ముల దర్శ కత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్‌మోహన్‌ రావు నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ ఇది. ఈ సినిమాలో నాగార్జున మరో లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా, రష్మికా మందన్నా హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఈ నెల 15న ‘కుబేర’ సినిమా టీజర్‌ విడుదల కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ సినిమా రిలీజ్‌ కానుంది. 

ఈ తరహాలో మరికొంతమంది ఇతర భాషల హీరోలు టాలీవుడ్‌ దర్శక– నిర్మాతలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు ఆసక్తి చూపిస్తూ, కథలు వింటున్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement